panchayati-secretary-dies-dogs-fear

ప్రాణం తీసిన కుక్కల భయం, స్కూటర్ పైనుంచి పడి పంచాయతీ కార్యదర్శి మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుక్కల భయం ఓ నిండు ప్రాణం తీసింది. కుక్కలు వెంబడించడంతో స్కూటర్ పైనుంచి దూకిన మహిళా పంచాయతీ కార్యదర్శి మృతి చెందారు. ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంట దగ్గర ఈ ఘటన జరిగింది. ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంటకు చెందిన కోటపూడి సువర్ణలక్ష్మి(31) మార్టూరు మండలం వలపర్ల-2 పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా సోమవారం(ఏప్రిల్ 27,2020) విధులు నిర్వహించారు. ఆ తర్వాత తన బంధువైన సత్యనారాయణతో కలిసి స్కూటర్ పై త్రోవగుంటకు బయల్దేరారు. జాగర్లమూడివారిపాలెం దాటిన తర్వాత రోడ్డుపై ఉన్న కుక్కలు స్కూటర్ ను వెంబడించాయి. 

కుక్కలు పెద్దగా అరుస్తూ వాహనం వెంట వేగంగా పరుగెత్తుకుంటూ రావడంతో సువర్ణలక్ష్మి భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో టూవీలర్ పైనుంచి ఒక్కసారిగా కిందికి దూకారు. దీంతో ఆమె తల రోడ్డుని తాకడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రైవేట్ వాహనంలో ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు విడిచారు. సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో సువర్ణలక్ష్మి కుటుంబంతో పాటు స్థానికంగా విషాదం అలుముకుంది. కాసేపట్లో ఇంటికి చేరాల్సి ఉంది. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. సువర్ణలక్ష్మి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Related Posts