పచ్చని పల్లెను కాలుష్యం కాటేస్తోంది

Submitted on 15 May 2019
industries pollution in Sagareddy district

పచ్చని పల్లెను కాలుష్యం కాటేస్తోంది. స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యంగా బతికిన పల్లె జనం ఇప్పుడు అనారోగ్య పాలవుతున్నారు. అంతేకాదు పచ్చని పొలాలు చేతికందకుండా పోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి ప్రాంతాన్ని కాలుష్య భూతం ఆవరించింది. గుట్టలుగా టైర్లు పేరుకుని ఉన్నాయి. పరిశ్రమలు కాలుష్యం వెదజల్లుతున్నాయి. కాలుష్యం పొగలు పల్లెను కమ్ముకుంటున్నాయి. దీంతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. పరిశ్రమల కాలుష్యం గ్రామవాసులను కలవరపెడుతోంది.
  
పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుందనుకున్నారు కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామవాసులు. ఉపాధి ఇవ్వడం అటుంచి ఉన్న ఉపాధిని మటుమాయం చేస్తోంది. కూరగాయలు పండించి బతికే గ్రామస్తులు....కాలుష్యం భూతం కాటుకు పంటలపొలాలు నాశనమవుతున్నాయి. దీంతో ఉన్న ఉపాధి పోయింది. ఫ్యాక్టరీలు వెదజల్లుతున్న కాలుష్యంతో మల్లేపల్లి వాసుల బతుకులు పొగబారిపోతున్నాయి.

కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 9 పైరాలసిస్ పరిశ్రమలు వచ్చాయి. పాత టైర్లను దేశ విదేశాల నుండి ఇక్కడకు తరలించి వాటిని రియాక్టర్ లో వేసి మూడు వందల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో మరిగిస్తారు. అలా దాని నుండి ఆయిల్ తీస్తారు. రియాక్టర్లో టైర్ లో ఉన్న స్టీల్ ను తొలగించి కేవలం రబ్బర్ ను మాత్రమే వేయాలన్న నిబందనని ఇక్కడి పరిశ్రమలు పట్టించుకోవడంలేదు. ఇక రియాక్టర్ నుండి పొగ రాకుండా సీలింగ్ చేయాలి కానీ చేయరు. దీనివల్ల వాయుకాలుష్యం విపరీతంగా ఈ ప్రాంతమంతా వ్యాపిస్తోంది.

మల్లెపల్లి వాసులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు నిబంధనలు పాటించని పరిశ్రమలకు క్లోజర్ నోటీసులు ఇచ్చినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. తాత్కాలికంగా మూసివేసి మళ్లీ కొన్నాళ్లకు పరిశ్రమలను నడిపించేస్తున్నారు యజమానులు. ఈ పరిశ్రమల కాలుష్యం నుండి మమ్మల్ని కాపాడాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

పరిశ్రమలకు అనుమతులిచ్చే కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు ఉదాసినంగా వ్యవహరించడం వల్లే పరిస్థితి అధ్వాన్నంగా తయారైందంటున్నారు స్థానికులు. అయితే అధికారులు మాత్రం కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటామంటున్నారు. పరిశ్రమలు రావాలి ఉపాధి మెరుగవ్వాలి.. కానీ బతుకులు బుగ్గిపాలయ్యే పరిస్థితులు మాత్రం రాకూదంటున్నారు మల్లేపల్లి గ్రామస్తులు. 
 

Industries
Pollution
Mallappally
Kondapur
Sagareddy

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు