ఏపీలో విజృంభిస్తోన్న కరోనా...314కు చేరిన కేసులు...నలుగురి మృతి

Submitted on 7 April 2020
Corona cases reaching to 314 in AP, four people died with virus

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ చాప కిందనీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ మరో 10 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 314కు పెరిగింది. గుంటూరులో 8 కేసులు నమోదు కాగా...కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందగా...ఆరుగురు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. 

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు 
కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో కేసుల సంఖ్య 43కి చేరింది. గుంటూరు జిల్లాలో 41, కృష్ణా జిల్లాలో 29, కడప జిల్లాలో 27 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రకాశంలో 24, పశ్చిమగోదావరిలో 21 కేసులున్నాయి. ఏపీలోని మొత్తం కేసుల్లో సగానికి పైగా కర్నూలు.. నెల్లూరు, గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో టెన్షన్ నెలకొంది. ఏపీ సర్కార్‌ కరోనా పరీక్షా కేంద్రాల సామర్ధ్యం పెంచింది. ప్రాథమిక స్థాయిలోనూ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అధికారులు రెడ్‌జోన్లను క్లస్టర్లుగా విభజించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
 
రెడ్‌ జోన్లు, క్లస్టర్ల వారీగా ర్యాండమ్‌ పరీక్షలపై దృష్టి 
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా విశాఖ తరహాలో రెడ్‌ జోన్లు, క్లస్టర్ల వారీగా ర్యాండమ్‌ పరీక్షలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ర్యాండమ్‌ టెస్టు కిట్ల ద్వారా ప్రజల నుంచి నమూనాలు సేకరించి, ఆ మేరకు డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని పరిస్థితులను అంచనా వేయాలని ఆయన సూచించారు. కోవిడ్‌–19 వ్యాప్తి నివారణ చర్యలపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలే కాకుండా భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై  ఈ సమావేశంలో చర్చించారు. 

ఇంటింటి సర్వే ద్వారా వ్యాధి లక్షణాలున్న వారి గుర్తింపు 
వేగవంతంగా పరీక్షలు నిర్వహించేందుకు వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే ద్వారా వ్యాధి లక్షణాలు ఉన్న వారి గుర్తించాలని ఆయన సూచించారు. వీరిలో ఎవరెవరికి పరీక్షలు చేయించాలన్న దానిపై వైద్యులు నిర్ధారిస్తున్నారు. త్వరలో వీరందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తారు. విశాఖపట్నం, గుంటూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచుతోంది.  స్వచ్ఛంద సంస్థల ద్వారా టెలీ మెడిసిన్‌ సర్వీసులు అందించడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఐసోలేషన్‌లో ఉన్న వారు ఎవరైనా ఫోన్‌ చేసి వైద్యం పొందవచ్చు. క్వారంటైన్, ఐసోలేషన్‌ క్యాంపుల్లో సదుపాయాలను మెరుగు పరచాలని.... సదుపాయాల్లో నాణ్యత ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ఈ విషయంలో రూపొందించుకున్న స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) ప్రకారం ముందు కెళ్లాలన్నారు.

కరోనా నివారణ కోసం ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటు
కరోనా నివారణ కోసం  ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటుపై మరింత దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. ప్రతి ఆసుపత్రిలోనూ ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు, పనితీరు పట్ల ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. ఐసీయూ బెడ్లు, వాటి సంఖ్యకు తగినట్టుగా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని.... వారం రోజుల పాటు సేవలు అందించిన వైద్య సిబ్బందిని తర్వాత 14 రోజుల పాటు ఐసోలేషన్‌కు పంపించేలా రూపొందించుకున్న ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకు ఎక్కువ మంది వైద్యులు, సిబ్బంది అవసరం. తగిన చర్యలు తీసుకోవాలి..కోవిడ్‌–19 ప్రభావిత ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్లు, మాస్కులు తగినన్ని అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ చెప్పారు.
 

Also Read | లాక్‌డౌన్ పుణ్యమా అని పదేళ్ల తర్వాత శారీరకంగా కలుసుకున్న పాండా జోడీ

corona virus
Case
Reach
314
AP
FOUR
people
die
cm jagan

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు