5-indian-states-free-coronavirus

గుడ్ న్యూస్, కరోనా నుంచి బయటపడ్డ ఐదు రాష్ట్రాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. దేశంలో 5 రాష్ట్రాలు కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడ్డాయి. ఇప్పుడు ఆ 5 రాష్ట్రాలు కరోనా ఫ్రీ స్టేట్స్. ఆ ఐదు కూడా ఈశాన్య రాష్ట్రాలు కావడం విశేషం. ఈశాన్య రాష్ట్రాల్లోని ఐదు రాష్ట్రాలు కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడ్డాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిక్కిం, నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, త్రిపుర కోవిడ్‌-19 లేని రాష్ట్రాలుగా నిలిచాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ఈశాన్య ప్రాంతంలోని మిగతా మూడు రాష్ట్రాలైన అసోం, మిజోరం, మేఘాలయా.. కరోనా ఫ్రీ కానప్పటికీ తాజాగా కోవిడ్‌ కేసులు నమోదు కాలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యల కారణంగానే ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ముప్పు తక్కువగా ఉందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఆరేళ్ల నుంచి ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని చెప్పుకొచ్చారు. 

లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా నిత్యవసర సరుకుల కొరత లేదు:
‘దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ నిత్యవసర సరుకుల కొరత రాకుండా కార్గో విమానాల ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు తరలిస్తున్నాం. ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ వాయుసేన ద్వారా ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లకు ప్రాధాన్యతా క్రమంలో సరుకులు పంపిస్తున్నామ’ని జితేంద్ర సింగ్‌ తెలిపారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కట్టడికి షిల్లాంగ్‌లోని ఈశాన్య అభివృద్ధి మండలితో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. లాక్‌డౌన్‌ కంటే ముందే కేంద్రం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించామన్నారు.

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు:
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగింది. గతంలో పోలిస్తే రోజువారీగా కేసుల నమోదు బాగా తగ్గింది. సోమవారం(ఏప్రిల్ 27,2020) కేవలం రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం బాధితుల సంఖ్య 1003కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 646. ఏపీలో మాత్రం కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,177కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 31మంది చనిపోయారు. 235 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 911. వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

దేశంలో 29వేల 439 కరోనా కేసులు, 931 మరణాలు:
మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 29వేల 439కి చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 931మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6వేల 734. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 3వేల 108కి చేరింది. 54మంది కరోనాతో చనిపోయారు. 877మంది కోలుకున్నారు. మహారాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8వేల 590కి చేరింది. ఇప్పటివరకు 1,282మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో కరోనాతో 27మంది చనిపోయారు.

ప్రపంచవ్యాప్తంగా 30.60 లక్షల కేసులు, 2.11లక్షల మరణాలు:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 30.60 లక్షలకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2.11లక్షల మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 9.21లక్షల మంది కోలుకున్నారు.

Related Posts