సంక్రాంతి తర్వాత సమరమే : ఆ పోరాటంతో బీజేపీ బలపడుతుందా..?

Submitted on 14 January 2020
ap bjp key decision on capital amaravati

మూడు రాజధానుల విషయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్టే ఉంది. బీజేపీ కోర్‌ కమిటీ ఈ విషయంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది. నిజానికి మూడు రాజధానుల విషయంలో ఇప్పటి వరకూ ఆ పార్టీ నేతలు తలో మాట మాట్లాడుతూ వచ్చారు. రాజధాని అంశం మనకు సంబంధం లేని విషయమంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు చెప్పడాన్ని పార్టీలోని మిగిలిన నేతలు వ్యతిరేకిస్తున్నారు. అలా ఎలా మాట్లాడతారంటూ పార్టీలోని ముఖ్య నేతలు ప్రశ్నించారు. ప్రధాన పార్టీగా రాష్ట్రంలో ఉంటూ సంబంధం లేకుండా ఎలా ఉంటుందన్నారు. దీంతో చేసేదేం లేక జీవీఎల్‌ సైలెంట్‌ అయిపోయారంట.

జీవీఎల్ అలా.. సుజనా ఇలా:
అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానులపై సీఎం జగన్‌ ఒక ప్రకటన చేయగానే దానిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యతిరేకించారు. అసలు అమరావతి నుంచి రాజధానిని ఎలా మారుస్తారంటూ ప్రశ్నించారు. అదే సమయంలో పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణకు తమ పార్టీ మొదటి నుంచి సానుకూలంగా ఉందంటూ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యానించారు. అసలు రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనే నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టంగా చెప్పేశారు. మరోపక్క, అమరావతి నుంచి రాజధానిని మార్చే అవకాశమే లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి వ్యాఖ్యానించారు. ఇది కేంద్ర ప్రభుత్వం మాటగానే ఆయన చెప్పుకొచ్చారు. 

జగన్‌కు మద్దతు పలికేలా జీవీఎల్‌ వ్యాఖ్యలు:
కొద్ది రోజుల తర్వాత కన్నా లక్ష్మీనారాయణ కూడా మెత్తబడ్డారు. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోదన్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ, రాష్ట్ర శాఖ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించబోదని అన్నారు. ఇలా తలో మాట మాట్లాడుతూ కార్యకర్తలను, జనాలను కన్‌ఫ్యూజ్‌ చేసేశారు. ఈ విషయంలో కార్యకర్తల కన్‌ ఫ్యూజన్‌ ను తొలగించేందుకు బీజేపీ కోర్‌ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పార్టీ పరంగా అమరావతిలోనే రాజధాని ఉండేలా పోరాటం చేయాల్సిందేనని ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు చెబుతున్నారు. ఈ సందర్భంగా జగన్‌కు మద్దుతు పలికేలా జీవీఎల్‌ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో కేంద్రం జోక్యం చేసుకోబోదని, అలానే పార్టీ పరంగా కూడా ఇది సంబంధం లేని విషయంగా పేర్కొన్నారు. దీంతో పార్టీలోని ముఖ్య నేతలు జీవీఎల్‌పై మండిపడ్డారంట. 

సంక్రాంతి తర్వాత అమరావతి పోరాటం:
ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని ఎలా తరలిస్తారనే దానిపై చర్చ సాగిందంటున్నారు. సంక్రాంతి తర్వాత అమరావతి కోసం ప్రత్యక్ష పోరాటానికి దిగాల్సిందేనని డిసైడ్‌ అయ్యారంట. ఇదే సమయంలో కొన్ని విషయాల్లో జీవీఎల్‌ వ్యవహార శైలిపై బీజేపీలో కొంత అసంతృప్తి ఉందంటున్నారు పార్టీ కార్యకర్తలు. నిజానికి రాజధాని విషయంలో పార్టీకి మంచి ఊపొచ్చిన తరుణంలో జీవీఎల్‌ వ్యాఖ్యలతో ఉత్సాహం చప్పబడిపోయిందంటున్నారు. సుజనాచౌదరి చెప్పిన మాటలతో పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందంట. పార్టీ చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన కనిపించింది. వేల మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ స్పందన చూసిన ముఖ్యనేతలు తమ కళ్లను తామే నమ్మలేకపోయారంటున్నారు.

బీజేపీ ప్లాన్స్‌ వర్కవుట్‌ అవుతాయా?
తమ పార్టీ చేపట్టిన కార్యక్రమానికి ఈ రేంజ్‌లో రెస్పాన్స్‌ రావడంతో కొత్త ఉత్సాహంతో దూకుడుగా ముందుకు సాగాల్సిన సమయంలో జీవీఎల్‌ నరసింహారావు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కన్‌ ఫ్యూజన్‌ మొదలైందంటున్నారు. దీంతో పార్టీ కేడర్‌ లో నిరుత్సాహం కనిపించిందంట. దూసుకెళ్లాల్సిన తరుణంలో వెనకబడిపోవలసి వస్తోందని పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. మొత్తం మీద వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, పార్టీ కోర్‌ కమిటీలో ఫైనల్‌గా ఒక నిర్ణయానికి వచ్చేసి, సంక్రాంతి తర్వాత నుంచి జోరు పెంచాలని డిసైడ్‌ అయ్యారంటున్నారు. మరి బీజేపీ ప్లాన్స్‌ వర్కవుట్‌ అవుతాయో లేవో వేచి చూడాల్సిందే. మొత్తం మీద ఈ ఎపిసోడ్‌లో పార్టీలోని నాయకులంతా ఒక వైపు ఉంటే.. జీవీఎల్‌ ఒక్కరే ఒకవైపు ఉండిపోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు.

ap capital
amaravati
three capitals
BJP
GVL
Sujana Chowdary
kanna lakshmi narayana
cm jagan
Chandrababu
Modi
Amit Shah
Visakhapatnam

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు