బాంబుల్లా పేలుతున్నాయి : సిలిండర్ పేలి ఒకరి మృతి

Submitted on 23 January 2019
Another Cylinder Blast In Hyderabad

హైదరాబాద్: వంట గ్యాస్ సిలిండర్లు వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలుతున్నాయి. కాప్రాలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మర్చిపోక ముందే మరో సిలిండర్‌ పేలుడు చోటుచేసుకుంది. వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2019, జనవరి 23వ తేదీ మంగళవారం ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో వృద్ధురాలు మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

 

విశాఖకు చెందిన శ్రుతికీర్తి(80) వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌లోని సోమనాథ క్షేత్రానికి వచ్చింది. మంగళవారం మధ్యాహ్న ఆలయం వంట గదిలోని స్టవ్‌ వెలిగించగా, ఆకస్మాత్తుగా సిలిండర్‌ పేలింది. పేలుడు ధాటికి శ్రుతికీర్తికి తీవ్ర గాయాలయ్యాయి. పక్క గదిలో ఉన్న లలితకు కిటీకి అద్దాలు పగిలి శరీరానికి గుచ్చుకున్నాయి. వెంటనే అక్కడున్న భక్తులు వారిని ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రుతికీర్తి రాత్రి 9గంటల సమయంలో మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లలిత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

 

పేలుడు తీవ్రతకు వంట గదితో పాటు ఆలయ సమీపంలోని ఎనిమిది ఇళ్ల కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో సమీపంలో నివాసం ఉంటున్న వారు ఉలిక్కిపడ్డారు. భయంతో బయటకి పరుగులు తీశారు. మంటల్లో కాలిపోతున్న కీర్తి ఆర్తనాదాలు విని వెంటనే అక్కడికి చేరుకున్నారు. షార్ట్ సర్య్యూట్ వల్ల చెలరేగిన మంటల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాప్రాలో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు బీభత్సం మరవక ముందే మరోసారి అదే తరహా ఘోరం జరిగడం నగరవాసుల్లో ఆందోళన నింపింది. గ్యాస్ సిలిండర్ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.

cylinder blast
another blast
Hyderabad
vanastalipuram
somnath temple
old woman die
Kapra

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు