ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే : అమ్మఒడిపై ప్రభుత్వం క్లారిటీ

Submitted on 19 June 2019
amma odi scheme only for government schools

అమ్మఒడి పథకంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అమ్మఒడి పథకం అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందు వైఎస్  జగన్ అమ్మఒడి పథకం ప్రకటించారు. నిరక్షరాస్యత తగ్గించడంతోపాటు విద్యను ప్రాథమిక హక్కుగా చేసేందుకు అమ్మఒడి పథకం రూపొందించారు. నవరత్నాల్లో కీలక పథకమైన  అమ్మఒడి విధి విధానాలపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటన చేశారు. అమ్మఒడి పథకం ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల  తల్లులకు మాత్రమే వర్తింప చేస్తామని చెప్పారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థి, విద్యార్థినుల తల్లులకి జనవరి 26న రూ.15వేలు ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకుంటున్న విద్యార్థులకు ఈ  పథకం వర్తింప చేయాలా వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా కర్నూలు  జిల్లాకు వచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. అమ్మఒడి పథకంపై స్పందించారు. 

బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టింది. జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుంది. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న పేద విద్యార్థి బడికి వెళ్తే ఆ కుటుంబానికి రూ.15వేలు అందిస్తారు. ఈ పథకానికి కేబినెట్‌ ఆమోదం జరిగిందే కానీ ప్రభుత్వం నుంచి విధి విధానాలు, ఎలా అమలు చేయాలి, ఎవరు అర్హులు అన్న అంశాలపై ఆదేశాలు అందలేదు. దీంతో కన్ ఫ్యూజన్ ఏర్పడింది. ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింపచేస్తారా లేక ప్రైవేట్ స్కూల్స్ కి కూడా అమలు చేస్తారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కాగా, అమ్మఒడిని ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాలని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాధించాలంటే అమ్మఒడి వంటి పథకం ఎంతో మేలని ఉపాధ్యాయ సంఘాలు చెప్పాయి. ఇప్పటికే మౌలిక వసతులు అంతంతమాత్రంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపడం లేదని... అమ్మఒడి పథకంతో పరిస్థితిలో మార్పు వస్తుందన్నారు.

ఈ పథకం పేద విద్యార్థులకు ఓ వరమనే చెప్పాలి. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోతతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో ఆసరాగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాదికి రూ.15వేలు వస్తుందన్న ఆశ ప్రతి విద్యార్థిని బడి వైపు నడిపిస్తుందన్నది ప్రభుత్వ ఆలోచన. మైనార్టీ వర్గాలు చదువులపై దృష్టి పెట్టకుండా తమ పిల్లలను బాల కార్మికులుగా మార్చేస్తున్నారని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖామంత్రి అంజద్‌బాషా పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కుటుంబాలకు అమ్మఒడి ఎంతో ఆదరణగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు అమ్మఒడి వర్తింపజేస్తారు.

amma odi scheme
government schools
Buggana Rajendranath Reddy
AP CM YS Jagan

మరిన్ని వార్తలు