అర్ధరాత్రి నుంచి పెరగనున్న ఎయిర్ టెల్, ఐడియా మొబైల్  చార్జీలు

Submitted on 2 December 2019
Airtel, Voda Idea and Jio to hike mobile, data tariffs by up to 40%

ఇంతకాలం పోటీ పడి వినియోగదారులకు చవకగా సేవలు అందిస్తున్న మొబైల్ కంపెనీలు సోమవారం అర్ధరాత్రి నుంచి టారిఫ్ చార్జీలు పెంచుతున్నాయి. ఇన్నాళ్ళు  ప్రజలకు ఫోన్ల వాడకాన్ని బాగా అలవాటు చేసిన కంపెనీలు ఇప్పుడు లాభాల బాట పట్టటానికి వినియోగదారులపై భారం మోపుతున్నాయి. భారతీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్. వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియోలు టారిఫ్ రేట్లు పెంచతున్నట్లు ప్రకటించాయి. ఎయిర్ టెల్, ఓడా ఫోన్, ఐడియా రేట్లు డిసెంబర్ 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుండగా... జియో రేట్లు 6 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త ప్లాన్లు, పాతప్లాన్ల కంటే దాదాపు 42-50 శాతం  ఎక్కువగా ఉన్నాయి. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ కస్టమర్లు నెల రోజుల పాటు నెట్‌వర్క్‌ సేవలను పొందాలంటే కనీసంగా రూ.49 చెల్లించాల్సి ఉంటుంది.

నష్టాల్లో కంపెనీలు 
మారుతున్న ప్రభుత్వ విధానాలతో  టెలికాం కంపెనీల పై భారం పడింది. కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులపై వేయడానికి సిధ్ధమవుతున్నాయి. సవరించిన స్థూల రాబడుల (ఏజీఆర్‌)కు సంబంధించిన సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌లపై భారం పడింది. వొడాఫోన్‌, ఐడియా రూ.44,150 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి వొడాఫోన్‌ ఐడియా రూ.50,921 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 

ఎయిర్‌టెల్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.35,586 కోట్ల వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ కూడా సెప్టెంబరు త్రైమాసికానికి రూ.23,045 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి టెలికం కంపెనీలు చార్జీలను పెంచాలని నిర్ణయించాయి. ఐదేళ్ల తర్వాత టెలికాం కంపెనీలు మొదటిసారిగా మొబైల్‌ చార్జీలను పెంచుతున్నాయి.

ప్లాన్లు ఈరకంగా ఉన్నాయి
ప్లాన్ల విషయానికి వస్తే.. ఏడాది కాలపరిమితితో అపరిమిత కాల్స్‌, డేటాను అందించే ప్లాన్‌ ధరను రూ.999 (12 జీబీ) నుంచి రూ.1,499 (24 జీబీ)కి పెంచారు. ఈ ప్లాన్‌ ధర దాదాపు 50 శాతం పెరిగింది.
365 రోజుల వాలిడిటీతో అపరిమిత కాల్స్‌, రోజుకు 1.5 జీబీ డేటాను అందించే ప్లాన్‌ ధరను రూ.1,699 నుంచి రూ.2,399కి పెంచారు. దీని ధర 41.2 శాతం పెరిగింది.
అపరిమిత కేటగిరీలో 84 రోజుల వాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటాను అందిస్తున్న ప్రారంభ ప్లాన్‌ ధర దాదాపు 31 శాతం పెరిగింది. ఇప్పుడు రూ.458 ఉన్న ప్లాన్‌ ధర రూ.599కి పెరగనుంది.
28 రోజుల కాలపరిమితి అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌తో రోజుకు 1.5 జీజీ డేటా ఇస్తున్నారు. ఈ ప్లాన్‌ ధరను రూ.199 నుంచి రూ.249కి పెంచారు. పెంపు 25 శాతంగా ఉంది.

Air Tel
Vodafone
JIO
Idea
Tariff

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు