Active COVID-19 cases in China fall below 100

చైనాలో కరోనా పూర్తిగా ఖతం…యాక్టివ్ కేసులు 91 మాత్రమే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచదేశాలన్నీ కరోనా కౌగిలిలో బంధీగా ఉన్న వేళ వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలో మాత్రం కరోనా ఖతమైపోయినట్లు కన్పిస్తోంది. చైనాలో కరోనా చైన్ ను పూర్తిగా బ్రేక్ చేయడంలో కమ్యూనిస్ట్ దేశం విజయం సాధించిందనే చెప్పవచ్చు. చైనాలో జనవరి నుంచి మొదటిసారిగా కరోనా యాక్టివ్ కేసులు 100లోపే ఉన్నాయని ఆ దేశ నేషనల్ హెల్త్ కమిషన్ శుక్రవారం ప్రకటించింది. 

చైనాలో ప్రస్తుతం 91 యాక్టివ్ కరోనా కేసులే ఉన్నాయని,ఇందులో 11మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలిపింది. గడిచిన 24గంటల్లో 14మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. గురువారం నాలుగు కొత్త కేసులు నమోదైనట్లు తెలిపింది. లోకల్ ట్రాన్స్ మిషన్ ద్వారా ఈ నలుగురుకి కరోనా సోకిందని,ఈ నలుగురు ఈశాన్య రాష్ట్రం జిల్లిన్ కు చెందినవారని తెలిపింది. 

జిల్లిన్ మరియు దాని పొరుగు రాష్ట్రమైన లియోనింగ్ లో గడిచిన కొన్ని రోజులుగా లోకల్ ట్రాన్స్ మిషన్ ద్వారా కొత్త కేసులు నమోదైనట్లు తెలిపింది. దీంతో ఇప్పటివరకు చైనాలో 82,933 కరోనా కేసులు నమోదు కాగా, 78,209మంది కోలుకున్నారని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. కేవలం 4,633 కరోనా మరణాలు మాత్రమే చైనాలో నమోదయ్యాయని తెలిపింది. గతేడాది డిసెంబర్ లో వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన హుబే ఫ్రావిన్స్ సహా చైనా వ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తివేయబడిన విషయం తెలిసిందే.

ఈ వైరస్ వ్యూహాన్ ల్యాబ్ నుంచే పుట్టినట్లు అమెరికా సహా చాలా దేశాలు ఆరోపిస్తున్నాయి. చైనాపై అంతర్జాతీయ విచారణకు కూడా అమెరికా రెడీ అయింది.  కరోనా వైరస్‌ వూహాన్‌లోని పరిశోధనశాల నుంచే విడుదలైందని తమవద్ద ఆధారాలున్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో స్పష్టం చేశారు. చైనాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదై ఉంటాయని, కరోనా కేసులను బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వం దాస్తోందంటూ అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి.

సమర్థవంతంగా లాక్ డౌన్ అమలు చేయడం వల్లే కరోనాను ఖతం చేయగలిగామని కమ్యూనిస్ట్ దేశం చెబుతున్నప్పటికీ చైనా ఏదో దాచిపెడుతుందనే ప్రపంచదేశాలు అనుమానిస్తున్నాయి. కరోనాకు జన్మస్థలమైన వుహాన్ ‌లోనూ పెద్ద ఎత్తున మరణాలు నమోదు అయినప్పటికీ చైనా ప్రభుత్వం వాటిని బయటకు రానీయకుండా దాచిపెడుతుందని అమెరికా అధ్యక్షుడు ‌ ట్రంప్‌ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే చైనాలో కరోనా కేసులు లక్షకు పైనే నమోదై ఉంటాయని వార్తలు కూడా వినిపించాయి. అయితే వీటన్నింటనీ డ్రాగాన్‌ దేశం ఖండించింది. 

మరోవైపు, భారత్‌లో కరోనా కేసులు వైరస్‌ పురుడుపోసుకున్న చైనాను మించిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్‌లో గడిచిన నెలరోజుల్లో ప్రతి రోజూ కనీసం మూడువేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నాటికి కరోనా కేసుల్లో భారత్‌ చైనాను అధిగమించనుంది. ఇప్పటికే భారత్ లో కేసుల సంఖ్య 82 వేలు దాటింది. ఒకటి రెండు రోజుల్లో చైనాను క్రాస్‌ చేసేస్తాం. అయితే చైనాతో పోల్చుకుంటే భారత్‌ లో కాస్తా మరణాల రేటు తక్కువగా ఉంది. రికవరీ రేటు కూడా తక్కువగానే ఉంది. భారత్ లో ఇప్పటివరకు 2,649 మంది కరోనాతో చనిపోయారు. 27,920మంది కోలుకున్నారు. 

Read Here>> కరోనా కేసుల్లో చైనాను దాటిపోతున్న భారత్

Related Posts