సోషల్ మీడియాతో ఆధార్ లింక్..కేంద్రం మార్గదర్శకాలు

Submitted on 23 October 2019
Aadhaar link to social media

బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, రేషన్ కార్డు ఇతర ప్రభుత్వ పథకాలు.. ఇలా అన్నింటికీ ఆథార్‌ కార్డును అనుసంధానం చేసేస్తున్నారు. పథకాలు లబ్దిదారులకే అందేలా ప్రభుత్వం ఆధార్‌ను లింక్ చేస్తోంది. అసాంఘీక శఖ్తులను పారదోలడానికి దీన్ని ఉపయోగిస్తోంది. తాజాగా సోషల్ మీడియాను ఆధార్‌తో లింక్ చేసే విషయంపై కేంద్రం దృష్టి సారించింది. వచ్చే ఏడాది జనవరి నాటికి మార్గ దర్శకాల రూపకల్పన పూర్తవుతుందని, ఆ వెంటనే వాటిని అమలు చేస్తామని మంగళవారం సుప్రీంకోర్టుకు నివేదించింది. 

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పోర్న్ వెబ్ సైట్లకు అడ్డుకట్ట వేసింది. ఛైల్డ్ పోర్న్.. అడల్ట్ కంటెంట్ ఉన్న సుమారు 800లకు పైగా వెబ్ సైట్లను నిషేధించింది. తాజాగా- సోషల్ మీడియా దూకుడుకు కూడా అడ్డుకట్ట వేయడానికి చేస్తోన్న ప్రయత్నాల వల్ల మిశ్రమ స్పందన ఎదురవుతోంది. అవాంఛనీయ, అసత్య వార్తలను నియంత్రించాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. దాన్ని ఆధారంగా చేసుకుని సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడం మాత్రం సరికాదని అంటున్నారు నెటిజన్లు. ఆరోగ్యకరమైన పోస్టింగులు, షేర్లను అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.

వాస్తవానికి అసాంఘీక చర్యలకు, అశ్లీల కంటెంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్‌తో లింక్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఫేస్‌ బుక్ సుప్రీంకోర్టు తలుపుతట్టింది. ఇవే డిమాండ్లతో మద్రాస్ బాంబే, మధ్యప్రదేశ్ హైకర్టుల్లో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటిని విచారించాలంటూ ఫేస్‌బుక్ కోరింది. తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలు యూజర్ల ప్రైవసీకి భంగం కలిగిస్తాయంటూ ఫేస్‌బుక్ వాదిస్తోంది. అయితే ఓ మెసేజ్ ఎవరు పోస్ట్ చేశారో తెలుసుకునేందుకు సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్‌తో లింక్ చేయడం అవసరం అని, ప్రొఫైల్ ట్రాక్ చేయడం సులువు అవుతుందని పిటిషనర్ తరపు లాయర్లు వాదించారు. ఇరు ప్రక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కేంద్రం, తమిళనాడు పోలీసులకు, గూగుల్, ట్విట్టర్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. 

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను కంట్రోల్ చేయాలంటూ... దాఖలైన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ స్థాయిలో ఉంది. జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్ లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం దీన్ని విచారిస్తోంది. సోషల్ మీడియాను నియంత్రించడానికి చేపట్టిన చర్యలు వివరించాలంటూ సెప్టెంబర్ 24న కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. వాటిపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ను అందజేసింది. తప్పుడు సమాచారం విస్తరణలో సోషల్ మీడియా చురుకైన పాత్ర పోషిస్తోందని కోర్టుకు తెలిపింది. కొంతమంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని అఫిడవిట్‌లో పేర్కొంది. విద్వేష పూరిత ప్రసంగాలు, నకిలీ వార్తలు, అవాంఛనీయ, అసాంఘిక కార్యకలాపాల వీడియోక్లిప్పింగులను ఇష్టానుసారంగా పోస్ట్ చేస్తున్నారని, దాని వల్ల సామాజిక పరమైన సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపింది. అలాంటి పోస్టింగులతో పాటు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను నియంత్రించడానికి సరి కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు  కోర్టుకు కేంద్రం వెల్లడించింది.
Read More : ఐటీలో కలకలం..ఇన్ఫోసిస్ ఎఫెక్ట్ తో ఒక్కరోజే 53వేల కోట్ల నష్టం

Aadhaar
link
social media
Facebook
Central govt

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు