4-crore-users-may-be-without-mobile-phones-may-end-if-curbs-not-lifted-icea

కరోనా ఎఫెక్ట్, 4 కోట్ల మంది దగ్గర ఫోన్లు ఉండవు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావమే చూపుతోంది. ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. ముందు ముందు మరిన్ని వ్యవస్థలపై కరోనా ప్రభావం చూపనుంది. కాగా, కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్రం లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి కాకుండా కట్టడి చేయడంలో లాక్ డౌన్ సక్సెస్ అయ్యిందని చెప్పుకోవాలి. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరగపోవడానికి ప్రధాన కారణం లాక్ డౌన్. దీంతో లాక్ డౌన్ పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో లాక్ డౌన్ వల్ల కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నం కాబోతున్నాయి. అందులో ఒకటి మొబైల్ ఫోన్ల కొరత.

4 కోట్ల మంది చేతుల్లో మొబైల్ ఫోన్లు మాయం:
వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఇలాగే కొనసాగితే మే నెలాఖరు నాటికి దేశంలోని 4 కోట్ల మంది చేతుల్లో మొబైల్ ఫోన్లు మాయం కానున్నాయి. అవును ఇది నిజ‌మే..హాండ్ సెట్ లలో వచ్చే లోపాలు, బ్రేక్ డౌన్ లు వంటి కారణంగా అవి ఉపయోగపడకపోవచ్చని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. మొబైల్ ఫోన్లు, విడి భాగాల విక్రయాలపై లాక్ డౌన్ ఆంక్షలు ఇలాగే కొనసాగితే ఆ పరిస్థితి తలెత్తే అవకాశం లేకపోలేదు. ఇదే విష‌యాన్ని ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్(ఐసియా-ICEA) తెలిపింది. మొబైల్ ఫోన్ల విడిభాగాలు అందుబాటులో లేకపోవడం, కొత్త హ్యాండ్‌ సెట్ల విక్రయాలపై ఆంక్షల కారణంగా ఇప్పటికే దాదాపు 2.5 కోట్ల మంది ఫోన్లు నిరుపయోగంగా మారాయని అంచనా వేసింది. అలాగే, హ్యాండ్‌సెట్లలో తలెత్తే లోపాలు, బ్రేక్‌ డౌన్ల వల్ల మరికొన్ని మొబైల్స్‌ నిరుపయోగంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దేశంలో ప్రస్తుతం 85 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయని, నెలకు 2.5 కోట్ల ఫోన్ల అమ్మకాలు జ‌రుగుతున్న‌ట్లు వివ‌రించింది.

అత్యవసర వస్తువుల జాబితాలో మొబైల్ ఫోన్లను కూడా చేర్చాలని ప్రధానికి విజ్ఞప్తి:
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సరఫరా చెయిన్ లో మొబైల్ ఫోన్ల విడిభాగాలు లేకపోవడం, కొత్త హ్యాండ్ సెట్ల విక్రయాలపై ఆంక్షలుండటంతో ప్రస్తుతం 2.5 కోట్ల మందికి పైగా వినియోగదారుల ఫోన్లు నిరుపయోగంగా ఉన్నాయని ఐసియా తెలిపింది. ప్రస్తుతం నిత్యావసర వస్తువులు, సేవల విక్రయాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. టెలికాం, ఇంటర్నెట్ బ్రాడ్ కాస్ట్, ఐటీ సేవల కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చిన కేంద్రం ఆ సేవలు పొందేందుకు అవసరమైన మొబైల్ పరికరాల విక్రయాలకు మాత్రం అనుమతి ఇవ్వలేదని ఐసియా వెల్లడించింది. అత్యవసర వస్తువుల జాబితాలో మొబైల్ ఫోన్లను కూడా చేర్చాలంటూ ఇప్పటికే పలుమార్లు ప్రధానితో సహా ప్రభుత్వాన్ని కోరామని ఐసియా ఛైర్మన్ పంకజ్ మొహింద్రూ వెల్లడించారు. మొబైల్ పరికరాలతో పాటు ల్యాప్ టాప్ లను కూడా అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చండంటూ హోం శాఖకు ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. ఆ శాఖ నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉంది. 

Related Posts