హైదరాబాద్ లో కరోనా సోకిన వ్యక్తులు ఎక్కువున్న ప్రాంతాలు 12.. అక్కడ రాకపోకలు బంద్, ఇంటింటి సర్వే

Submitted on 9 April 2020
12 containment clusters in Hyderabad to be under intensified surveillance

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టారు. మరోవైపు హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దాదాపు 100 కరోనా కేసులు హైదరాబాద్ నగరంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 

ఆ 15 ప్రాంతాలు అష్టదిగ్బంధం:
హైదరాబాద్ నగరంలో కరోనా సోకిన వ్యక్తులు ఎక్కువున్న ప్రాంతాలను జీహెచ్ ఎంసీ అధికారులు గుర్తించారు. అలాంటి ప్రాంతాలు 12 ఉన్నాయి. వాటిని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ బుధవారం(ఏప్రిల్ 8,2020) కంటైన్ మెంట్ క్లస్టర్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకోవాలని యంత్రాంగానికి స్పష్టం చేశారు. కంటైన్ మెంట్ క్లస్టర్లు అంటే ఆ ప్రాంతాలను అష్టదిగ్బంధం చేస్తారు. అంటే ఆయా ప్రాంతాల్లో రాకపోకలు బంద్ చేస్తారు. బయటివారిని లోనికి వెళ్లనియ్యరు, లోనివారిని బయటకు వెళ్లనివ్వరు. అంతేకాదు.. వైద్య బృందాలు రంగంలోకి దిగుతాయి. ఇంటింటి సర్వే చేస్తారు. అందరికి వైద్య పరీక్షలు చేస్తారు.

వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఇక రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనూ 3ప్రాంతాలను కంటైన్ మెంట్ క్లస్టర్లుగా గుర్తించారు. మొత్తంగా కరోనా సోకిన వ్యక్తులు ఎక్కువున్న ప్రాంతాలు 15 ఉన్నాయి.

హైదరాబాద్ నగరంలో 175 కరోనా కేసులు ఉండగా.. 12 ప్రాంతాల్లోనే 89 మంది వైరస్ బారినపడ్డారు. దీన్ని ఇలానే వదిలేస్తే పరిస్థితి చేజారుతుందని అధికారులు భయపడుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాలను కంటైన్ మెంట్ క్లస్టర్లుగా ప్రకటించారు. (ఈ 10 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వండి : CIABC )

కంటైన్ మెంట్ క్లస్టర్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ఏం చేస్తారంటే:
* ప్రతి ఇంటిని వైద్యఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ, సంబంధిత విభాగాలు తనిఖీ చేస్తాయి
* సర్వే చేసి, వ్యాధి లక్షణాలున్న వారిని ఆస్పత్రికి తరలిస్తారు. వైరస్ సోకితే ఐసోలేషన్ లేదా నిర్బంధ కేంద్రాలకు తరలిస్తారు
* అక్కడున్న ప్రతి వీధిని శుభ్రంగా ఊడ్చి, క్రమం తప్పక క్రిమి సంహారకాలు పిచికారీ చేస్తారు. నిత్యం పర్యవేక్షిస్తారు
* ఆ ప్రాంతాల్లోని వ్యక్తులు బయటకు వెళ్లకుండా చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేస్తారు.

ఎప్పటికప్పుడు జియోట్యాగ్:
మార్చిలో ఢిల్లీ తబ్లీగి జమాత్ కి వెళ్లొచ్చినవారు ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 593 మంది ఉన్నారు. వారిలో 83 మందికి వైరస్ సోకింది. వారి ద్వారా మరో 51 మందికి వ్యాపించింది. వేర్వేరు మార్గాల్లో మరో 70మందికి సోకింది. వీరందరి నివాస ప్రాంతాలను అధికారులు ప్రభుత్వ యాప్ లో జియో ట్యాగ్ చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో బుధవారం నాటికి 659 మంది నివాసాలను జియోట్యాగ్ చేశారు.

కరోనా సోకిన వ్యక్తులు ఎక్కువున్న ప్రాంతాలు ఇవే.. (కంటైన్ మెంట్ క్లస్టర్లు):
రాంగోపాల్ పేట 
షేక్ పేట
రెడ్ హిల్స్
మలక్ పేట - సంతోష్ నగర్
చాంద్రాయాణగుట్ట
అల్వాల్
మూసాపేట
కూకట్ పల్లి
కుత్బుల్లాపూర్ - గాజులరామారం
మయూరినగర్
యూసుఫ్ గూడ
చందానగర్
బాలాపూర్
చేగూరు
తుర్కపల్లి

తెలంగాణలో 453కి చేరిన కరోనా కేసులు:
తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతోంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది. ప్రస్తుతం 397 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 11 మంది మృతి చెందగా.. మరో 45 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రోజురోజుకు కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజలను కలవరానికి గురి చేస్తోంది.  

తెలంగాణకు 95 శాతం కరోనా భయం తగ్గింది:
తెలంగాణకు 95 శాతం కరోనా భయం తగ్గిందని.. ఇకపై కరోనా పాజిటివ్‌‌ కేసులు భారీగా నమోదు కాకపోవచ్చని మంత్రి ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం(ఏప్రిల్ 8,2020) 49 పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు వరకు రాష్ట్రంలో 453కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని.. ప్రస్తుతం అందులో ఎవరికీ కూడా విషమంగా లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం 397మందికి చికిత్స అందుతోందని..వీరిలో ఒక్కరు కూడా వెంటిలేటర్‌పై లేరని తెలిపారు.

Hyderabad
containment clusters
ghcm
coronavirus
Telangana
Corona positive cases
12 containment clusters
covid 19

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు