క్యాన్సిల్ ఆర్డర్ల ఫుడ్‌తో.. పేద పిల్లల కడుపు నింపుతున్న డెలీవరీ బాయ్

Submitted on 22 May 2019
Zomato delivery guy feeds hungry children

జొమాటో డెలీవరీ బాయ్ అంటే ఏవో రూమర్లతో వార్తల్లో నిలిచే వ్యక్తులే కాదు. పేద పిల్లలకు సాయం చేయడం కోసం తమ వంతుగా చేయూతనిచ్చే మంచి మనసున్న వారు ఉంటారని నిరూపించాడు సాహా. జొమాటో తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ వీడియోను పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలో నివాసముంటున్న పతిక్రిత్ సాహా జొమాటో డెలీవరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అతణ్ని ప్రేమగా రోల్ కాకూ అని పిలుస్తుంటారు. దానికి కారణం జొమాటో ఆర్డర్ క్యాన్సిల్ అవడంతో చికెన్ రోల్స్, వెజ్ రోల్స్, బిర్యానీ, ఎగ్స్ చిన్నారులకు పంచిపెడుతుంటాడు. క్యాన్సిల్ ఆర్డర్లను వృథా చేయకుండా చిన్నారులకు పంచిపెడతాడు. అంతేకాదు, పీజీ చదువుకున్న సాహా.. ఖాళీ సమయాల్లో పేద పిల్లలకు పాఠాలు కూడా చెప్తుంటాడు. 

'నాలుగేళ్ల క్రితం, కోల్‌కతాలోని దమ్‌దమ్ కంటోన్మెంట్ దగ్గర్లోని వీధుల్లో నడుస్తుండగా ఓ టీనేజర్ వచ్చి నా కాళ్ల మీద పడిపోయాడు. డబ్బులు కావాలని ప్రాధేయపడుతున్నాడు. అప్పుకు నాకర్థమైంది. పూర్తిగా డ్రగ్స్ తీసుకుని ఉన్నాడని, నేను డబ్బులు ఇచ్చినా మళ్లీ హానికారక డ్రగ్స్ తీసుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటాడని.. అతణ్నించి తప్పించుకుందామని చూస్తే, వదల్లేదు ఇక తప్పని పరిస్థితుల్లో చెంపమీద కొట్టా. అక్కడ నుంచి నా కథ మొదలైంది' అని సాహా చెప్పుకొచ్చాడు. 

ఖాళీ సమయాల్లో చదువు చెప్పడంతో పాటు జ్యూస్ బాటిల్స్ కూడా అమ్మి పిల్లల చదువు కోసం కష్టపడుతున్నాడు. కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం మానేసి కేవలం తన జీవితం పేద బాలల కోసమే వినియోగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. మరోవైపు తన కుటుంబం ఎటువంటి ఆర్థిక సమస్యలకు లోనుకాకూడదని జొమాటో ఉద్యోగం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతో పాటు రెస్టారెంట్ లో మిగిలిపోయిన ఆహారాన్ని కూడా పేదవారికి అందిస్తుంటాడు.

zomato
delivery guy

మరిన్ని వార్తలు