టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి 

Submitted on 19 June 2019
YV Subbareddy as Chairman of TTD

టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. శనివారం (జూన్ 22, 2019) ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీటీడీ ఈవో సింఘాల్ కు పంపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే టీటీడీని ప్రక్షాళన చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దానికనుగుణంగా పార్టీలోని కీలక నేత, సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి అప్పగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు త్వరలో జారీ కానున్నాయి. రెండు రోజుల్లో అధికారిక జీవో రానుంది. 

ప్రస్తుతమున్న పుట్టా సుధాకర్ యాదవ్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసేది లేదు.. అవసరమైతే ప్రభుత్వమే తనను తొలగించాలని గతంలో చెప్పిన సుధాకర్.. రాజకీయ కారణాలు, రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆర్డినెన్స్ ద్వారా టీటీడీ బోర్డును రద్దు చేస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేయటం విశేషం. టీడీపీ ప్రభుత్వం నియమించిన పాలక మండలి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయకపోవడంతో, ఆర్డినెన్స్‌ ద్వారా ప్రస్తుత పాలక మండలిని తొలగించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి శ్రీనివాస్ బుధవారం (జూన్ 19, 2019) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వెల్లడించారు. శ్రీవారి సొమ్ము తిన్నోళ్లను వదిలిపెట్టేది లేదని మంత్రి తేల్చి చెప్పారు.

గత ప్రభుత్వం హయాంలో టీటీడీ చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం జరిగింది. ఆయన నియామకంపై అప్పుడే పెద్ద దుమారం చెలరేగింది. క్రిస్టియన్ మద్దతుదారుడికి టీటీడీ చైర్మన్ పదవి ఎలా కట్టబెడతారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా అప్పటి సీఎం చంద్రబాబు పుట్టాకు పదవి కట్టబెట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టినా... ఆయన మాత్రం తన పదవి నుంచి దిగిపోలేదు. 

YV Subbareddy
TTD
Chairman
Chittoor
Putta Sudhakar yadav
RESIGN

మరిన్ని వార్తలు