వైసీపీ చెలగాటం.. ఏపీ బీజేపీకి ప్రాణసంకటం!

Submitted on 21 January 2020
Ysrcp involving Centre to blame in AP three capital decision

ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ పని చేసినా కేంద్రానికి చెప్పే చేస్తున్నామని ఆ మధ్య చాలా సందర్భాల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెబుతుండే వారు. ఇదంతా పార్టీ వ్యూహమేనని అనే వాళ్లు ఉన్నారు. మరోపక్క మాత్రం వైసీపీతో బీజేపీయే ఇదంతా చేయిస్తోందని కూడా అంటున్నారు.

ఇప్పుడు రాష్ట్రాన్ని కకావికలం చేస్తున్న మూడు రాజధానుల అంశం కూడా కేంద్రానికి చెప్పే వైసీపీ సర్కారు చేస్తోందంటూ ప్రచారం మొదలైంది. ఈ విషయమే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీని ఇరకాటంలోకి నెట్టింది. ఇదంతా నిజంగానే కేంద్రానికి చెప్పి చేస్తుందా.. లేక పార్టీకి చెప్పకుండా చేసుకుంటూ పోతోందా? చెప్పకుండానే చెప్పి చేస్తున్నట్టుగా చెబుతోందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. 

బీజేపీని ఇరికించడానికేనా? :
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం కాక రేపుతోంది. ఏకపక్షంగా చేపట్టిన మూడు రాజధానులకు బీజేపీ మద్దతు లేదని ఆ పార్టీ రాష్ట్ర శాఖ స్పష్టం అంటోంది. తాము అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతిస్తామే తప్ప.. పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతిచ్చేది లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారు. కానీ, ఈ విషయంలో ఇప్పటి వరకూ కేంద్రంలోని బీజేపీ నుంచి మాత్రం ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదంటున్నారు జనాలు. ఇదే విషయంలో తాము ప్రతి విషయాన్ని కేంద్రానికి చెప్పే చేస్తున్నామని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఇది బీజేపీని ఇరికించడానికి చేస్తున్న ప్రచారంగా రాష్ట్ర స్థాయి నేతలు చెబుతున్నారు. 

ఇదంతా తప్పుడు ప్రచారమే :
ఇదంతా చూస్తున్న జనాలు మాత్రం అసలేం జరుగుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఢిల్లీలోని పార్టీ హైకమాండ్‌ నుంచి ఎలాంటి స్పష్టత లేకుండా.. రాష్ట్ర నాయకులు చెప్పిందే ఫైనల్‌ ఎలా అనుకుంటామని అంటున్నారు. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఓ ఆంగ్ల దినపత్రికలో ఇదే విషయం ప్రధానంగా ప్రచురితమైంది.

దీనిపై ఢిల్లీలోని బీజేపీ నాయకుడు సునీల్‌ దియోధర్‌ ట్విటర్‌లో స్పందించారు. మూడు రాజధానుల నిర్ణయంపై కేంద్రంలోని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో చర్చించామని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్‌ సర్కారు తీరును తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న మూర్ఖపు చర్యను సమర్థించుకోలేక కేంద్రంతో చర్చించామని తప్పుడు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. 

ఈ తతంగాన్నంతా గమనిస్తున్న జనాలు ఇదేం విడ్డూరం.. అసలు విషయంపై ఇంత వరకూ పార్టీ నిర్ణయాన్ని చెప్పకుండా ఖండిస్తున్నామంటే సరిపోతుందా అని అడుగుతున్నారు. అసలు బీజేపీ నేతలు ఖండిస్తున్నది కేంద్ర ప్రభుత్వాన్ని ఇరికించడాన్నా? మూడు రాజధానుల నిర్ణయాన్నా? అని క్వశ్చనింగ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీని ఇరికించేందుకే వైసీపీ ప్రయత్నిస్తున్నదని కొందరు అంటుంటే.. అసలు కేంద్రం సపోర్ట్‌ లేకుండా జగన్‌ ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకొని ఉండరేమోలే అని మరికొందరు అనుకుంటున్నారు.

సెంట్రల్‌ గవర్నమెంట్‌ను సెంటర్‌ చేసి వైసీపీ తన నిర్ణయాలను అమలు చేసుకోవాలని చూస్తున్నదని చెబుతున్నారు. మొత్తం మీద వైసీపీ ఈ విషయంలో ఆడుతున్న చెలగాటం.. కేంద్రంలోని బీజేపీకి ప్రాణసంకటంలా మారినట్టుందని అనుకుంటున్నారు. 

Ysrcp
Central govt
blame bjp
AP
Three capital decision
Ys Jagan
Vijayasai reddy 

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు