మన టార్గెట్ 2024.. చంద్రబాబుకి దేవుడు అద్భుతంగా స్క్రిప్ట్ రాశాడు : ఎమ్మెల్యేలతో జగన్

Submitted on 25 May 2019
ys jagan targets 2024

వైసీపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగన్ మోహన్ రెడ్డి.. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. వారికి దిశానిర్దేశం చేశారు. ఇక మన టార్గెట్ 2024 అని జగన్ అన్నారు. 2024లో ఇంతకన్నా ఎక్కువ సీట్లతో వైసీపీ గెలవాలని, అందుకు తగ్గ రీతిలో అంతా పని చేయాలని జగన్ కోరారు. ఈ ఎన్నికల్లో విజయం తన ఒక్కడిది మాత్రమే కాదన్నారు. సుపరిపాలన అందించి మంచివాడిని అనిపించుకుంటా అని జగన్ అన్నారు. ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకు తాను చేసిన 3వేల 600 కిలోమీటర్ల పాదయాత్రను మర్చిపోలేను అని జగన్ చెప్పారు.

ఏపీ ఎన్నికల్లో వైసీపీకి 50శాతం ఓట్లు రావడం ఓ చరిత్ర అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడింది వైసీపీనే అని జగన్ చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి వచ్చామన్న జగన్.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ, 22 లోక్ సభ స్థానాలు రావడం అసాధారణ విషయం అన్నారు. అన్యాయం చేస్తే దేవుడు మొట్టికాయలు వేస్తాడు అనడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటమే నిదర్శనం అన్నారు.

చంద్రబాబు అక్రమంగా 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, చివరికి టీడీపీ గెలిచిన ఎమ్మెల్యే సంఖ్య కూడా 23 అని జగన్ గుర్తు చేశారు. దేవుడు అంత గొప్పగా స్క్రిప్ట్ రాశాడని జగన్ చెప్పారు. 6 నెలలు తిరిగేసరికి మంచి సీఎం అని ప్రజలతో అనిపించుకుటానని జగన్ స్పష్టం చేశారు. ఇక ముందు కూడా ఇదే జోరు సాగాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించాలని జగన్ ఆకాంక్షించారు. విలువలు, విశ్వసనీయతకు ప్రజలు ఓటేశారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బాధ్యతతో ముందుకెళ్లాలి అని అన్నారు. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా పని చేద్దామని జగన్ పిలుపునిచ్చారు.


వైసీపీ శాసనసభాపక్ష నేతగా జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం (మే 25, 2019) ఉదయం అమరావతి తాడేపల్లిలోని జగన్ క్యాంప్‌ ఆఫీస్‌లో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఎల్పీ నేతగా జగన్ పేరును సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రతిపాదించారు. ధర్మాన ప్రసాదరావు, పార్ధసారథి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బలపరిచారు. దీంతో వైసీఎల్పీ నేతగా జగన్‌ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. మధ్యాహ్నం తర్వాత జగన్‌ తాడేపల్లి నుంచి హైదరాబాద్‌ పయనమవుతారు. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి... ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ఎమ్మెల్యేలు జగన్ ను వైసీఎల్పీ నేతగా ఎన్నుకున్న తీర్మానం కాపీని గవర్నర్‌కు అందజేయనున్నారు. జగన్‌ తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలవనున్నారు. మే 30న విజయవాడలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని కేసీఆర్ ని జగన్ ఆహ్వానించనున్నారు. ఆదివారం (మే 26, 2019)న జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ కలవనున్నారు.

Ys Jagan
Ysrcp
ysrcp lp leader
target 2024
TDP
ap elections results
Chandrababu Naidu

మరిన్ని వార్తలు