తొలి అడుగులు : బిజీ బిజీగా జగన్

Submitted on 25 May 2019
YS jagan Busy Busy

భారీ మెజార్టీని సొంతం చేసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన జగన్... వెంటనే హైదరాబాద్‌ చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను, ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. మే 26వ తేదీన ప్రధాని మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్లనున్నారు జగన్. 

అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో గంటసేపు భేటీ అయ్యారు. వైసీఎల్పీనేతగా తనను ఎన్నుకుంటూ ఎమ్మెల్యేలు చేసిన తీర్మాన కాపీని గవర్నర్‌కు జగన్ అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతించాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈనెల 30న జరిగే తన ప్రమాణ స్వీకారానికి గవర్నర్‌ను ఆహ్వానించారు.

గవర్నర్‌తో భేటీ అనంతరం నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్..తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తొలిసారిగా వచ్చిన జగన్‌ దంపతులకు స్వయంగా స్వాగతం పలికిన కేసీఆర్‌ పుష్పగుచ్ఛం అందించారు. స్వీట్ తినిపించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. శాలువా కప్పి, జ్ఞాపికను అందచేసి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన జగన్‌ను అభినందనలతో ముంచెత్తారు.

ప్రగతి భవన్‌లో అందరినీ పేరు పేరునా పరిచయం చేశారు...తెలంగాణ సీఎం కేసీఆర్. ఇటు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్‌ కూడా జగన్‌కు శుభాకాంక్షలు చెప్పి ఆలింగనం చేసుకున్నారు. తరువాత కేసీఆర్, కేటీఆర్, ఇతర మంత్రులతో జగన్ భేటీ అయ్యారు. ఈనెల 30న విజయవాడలో జరుగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. మే 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు.

ఇటు ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం కుదిరింది. మే 30 న ఉదయం 12 గంటల 23 నిమిషాలకు సీఎంగా ప్రమాణం చేస్తారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Ys Jagan
Busy Busy
Pragati Bhavan
KCR And Jagan

మరిన్ని వార్తలు