జగన్ రికార్డు : తక్కువ ఏజ్‌లో నవ్యాంధ్రకు రెండో సీఎం 

Submitted on 24 May 2019
At a young age Chief Minister Jagan

ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్‌ దిగిందా? లేదా? ఇదే... ఇప్పుడే దేశంలో యంగెస్ట్ సీఎంల పంచ్‌ డైలాగ్‌. ఏళ్ల తరబడి రాజకీయాల్లో పండిపోయి... వయసుడిగిపోయాకే ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనలకు కాలం చెల్లింది. పాలిటిక్స్‌లో వడివడిగా పరుగులు పెట్టే సత్తా ఉన్న నేతలకు... పిన్న వయసులోనే సీఎం పదవి దక్కుతోంది. ఈ లిస్ట్‌లో వైఎస్‌ జగన్‌ కూడా చేరిపోయారు. 46 ఏళ్లకే ముఖ్యమంత్రి పదవిని అధిష్టించబోతున్నారు. 

తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో పిన్న వయసులోనే సీఎం అవుతున్న నాలుగో వ్యక్తిగా... వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రికార్డ్ సృష్టించారు. ప్రస్తుతం ఆయన వయసు 46 ఏళ్లు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన 10 సంవత్సరాల్లో జగన్‌ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న టీడీపీ అధినేత చంద్రబాబును చిత్తుగా ఓడించి తక్కువ ఏజ్‌లో నవ్యాంధ్రకు రెండో సీఎంగా నిలిచారు. ఇక ఉమ్మడి ఏపీలో చిన్నవయసులో సీఎం అయిన మూడో వ్యక్తి చంద్రబాబు. 45 ఏళ్లకే ఆయన 1995లో సీఎం అయ్యారు.

జగన్‌, చంద్రబాబు కంటే ముందు..మరికొందరు తెలుగు నేతలు కూడా చిన్న వయసులోనే ముఖ్యమంత్రి గద్దెను అధిరోహించారు. 1962లో దామోదరం సంజీవయ్య కేవలం 38 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో నీలం సంజీవరెడ్డి 43 ఏళ్లకే ఏపీ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక దేశంలో అత్యంత పిన్నవయసులో సీఎం అయిన రికార్డు ఎంవో హసన్‌ ఫరూఖ్‌ మారికర్‌ పేరుతో ఉంది. ఆయన 1967లో కేవలం 30 ఏళ్లకే పాండిచ్చేరి పగ్గాలు అందుకున్నారు. మూడుసార్లు ఆ పదవిలో కొనసాగారు.

ప్రస్తుతం దేశంలోని చాలామంది ముఖ్యమంత్రులు... అతి తక్కువ వయసులోనే ఆ పదవి చేపట్టారు. వీరిలో అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమాఖండూ ఒకరు. 2016లో ఆయన 36 ఏళ్లకే సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. మేఘాలయ సీఎంగా ఉన్న కనరాడ్‌ సంగ్మా 40 ఏళ్లకు... మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్‌ 43 ఏళ్లకు, యూపీ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్‌ 44 ఏళ్లకు పగ్గాలు చేపట్టారు. అసోంలో ప్రఫుల్ల కుమార్ మహంత 33 ఏళ్లకు, యూపీలో అఖిలేశ్ యాదవ్ 39 ఏళ్లకు ముఖ్యమంత్రులయ్యారు. తాజాగా ఏపీలో జగన్‌ 46 ఏళ్లకు పదవి దక్కించుకున్నారు.

young age
Chief Minister Jagan
Navyandhra
amaravati

మరిన్ని వార్తలు