టీమ్‌ ఇండియాకు మరో ఎదురు దెబ్బ : విజయ్‌ శంకర్ కి గాయం

Submitted on 20 June 2019
World Cup 2019: Vijay Shankar suffers injury

వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆటగాళ్లు గాయాలబారిన పడుతున్నారు. ఇప్పటికే చేతి వేలి గాయం కారణంగా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ టోర్నీ నుంచి దూరం అయ్యాడు. కాలి కండరాలు పట్టేయడంతో పేసర్ భువనేశ్వర్ కుమార్ రెండు మ్యాచులకు దూరమయ్యాడు. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే.. ఇప్పుడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయపడ్డాడు. నెట్‌ ప్రాక్టీస్‌లో విజయ్‌ శంకర్ ఇంజ్యూర్ అయ్యాడు. బుమ్రా వేసిన యార్కర్‌తో గాయపడ్డాడు. బుమ్రా విసిరిన యార్కర్‌ని అడ్డుకోబోయిన శంకర్.. విఫలమయ్యాడు. దీంతో.. బంతి నేరుగా పాదాన్ని బలంగా తాకడంతో శంకర్ నొప్పితో విలవిలలాడాడు. అయితే భయపడాల్సిన పని లేదని జట్టు యాజమాన్యం తెలిపింది.

శనివారం ఆఫ్గనిస్తాన్‌తో సౌతాంప్టన్‌లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం గురువారం (జూన్ 20,2019) ప్రాక్టీస్‌ చేస్తుండగా విజయ్‌ శంకర్‌కు గాయమైంది. ఈ నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌కు విజయ్‌ శంకర్‌ అందుబాటులో ఉంటాడా.. లేదా అనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. మ్యాచ్‌కి ఒక్క రోజు సమయం ఉంది. అధికారికంగా టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి శంకర్‌ గాయంపై ఎలాంటి ప్రకటనా రాలేదు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ప్లేస్ లో విజయ్‌ శంకర్‌ తుది జట్టులోకి వచ్చాడు. బ్యాట్‌తో విఫలమైనా.. బంతితో మెరిశాడు. మ్యాచ్‌లో తాను వేసిన తొలి బంతికే ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌ని ఔట్ చేసిన ఈ ఆల్‌రౌండర్ ఆ తర్వాత.. కీలకమైన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ వికెట్ కూడా పడగొట్టాడు. దాంతో శంకర్ ని ఆఫ్గనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ కొనసాగించాలనే భావనలో టీమిండియా ఉంది. విజయ్‌ శంకర్‌ కూడా గాయం బారిన పడటంతో అతను జట్టులో ఉండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్‌ నాటికి కోలుకుంటే విజయ్‌ శంకర్‌ జట్టులో ఉంటాడని టీమ్ మేనేజ్ మెంట్ తెలిపింది. ఈ మెగా టోర్నీలో లీగ్‌ దశ పూర్తి కాకుండానే భారత క్రికెటర్లు వరుసగా గాయాల బారిన పడటం అటు జట్టు యాజమాన్యాన్ని ఇటు అభిమానులను టెన్షన్ పెడుతోంది.

world cup 2019
Vijay Shankar
suffers
injury
all rounder
yorker
Jasprit Bumrah

మరిన్ని వార్తలు