ఏపీ శాసన మండలి రద్దుకు కేంద్రం సహకరిస్తుందా?

Submitted on 23 January 2020
Will the union govt support the abolition of the AP Legislative Council?

శాసన మండలి రద్దుకి సీఎం జగన్‌ సంకేతాలు ఇచ్చినట్టే కనిపిస్తుంది. రద్దు నిర్ణయం నిజమైతే కేంద్రం సహకరిస్తుందా..? తక్కువ సమయంలోనే ఉభయసభల్లో ఆమోదించేలా చొరవ తీసుకుంటుందా..? అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. మరోవైపు రద్దు నిర్ణయానికి ముఖ్యమంత్రి నాలుగు రోజుల గడువు పెట్టడంపై.. పొలిటికల్ సర్కిల్‌లో హాట్‌ హాట్‌ చర్చ నడుస్తోంది. 

పెద్దల సభలో అడ్డు వస్తున్నారనే కారణంతో రద్దు నిర్ణయం
తెలుగుదేశం పార్టీ మొదటిసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చినపుడు శాసనమండలిని రద్దు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఅర్ అసెంబ్లీలో తీసుకుంటున్న నిర్ణయాలకు మండలి పెద్దలు పదే పదే అడ్డు వస్తుండడంతో ఆయన మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్నుంచి ఆంధ్రప్రదేశ్ కు శాసనమండలి లేకుండా చాలా రోజులు నడిచింది. అయితే 2004లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు పదవులు కల్పించాలనే ఉద్దేశ్యంతో శాసనమండలిని తిరిగి పునరుద్ధరించారు. ఇపుడు మళ్ళీ పదిహేనేళ్ల తరువాత పెద్దల సభ రద్దు చేస్తారనే ఊహాగానాలు ఉపందుకున్నాయి. 

ఏర్పాటు, రద్దు నిర్ణయం శాసన సభలదే..
శాసనమండలిని ఏర్పాటు చేయడమే కాదు, రద్దు చేసే అధికారాన్ని కూడా రాజ్యాంగం శాసనసభలకే కల్పించింది. ఆర్టికల్‌ 169 (1) ప్రకారం శాసనసభ 2/3 వంతు మెజార్టీతో ప్రత్యేక తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తీర్మానాన్ని పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదించిన తర్వాత.. రాష్ట్రపతి సంతకంతో అమల్లోకి వస్తుంది. ఎన్టీఆర్‌ హయాంలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే మండలి రద్దు చేయగలిగారు. దీంతో జగన్‌ సర్కార్‌ మండలి రద్దుకి మొగ్గుచూపితే ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది. 

ఇప్పటికే మోడీ దృష్టికి మండలి రద్దు నిర్ణయం..?
మండలి రద్దు వారం రోజుల్లో కూడా జరగొచ్చు. కానీ అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్యను బట్టి ఉంటుంది. ప్రస్తుతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. దీంతో రద్దుకి ఎక్కువ టైమ్‌ పట్టకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే మండలి రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోడీ దృష్టికి జగన్‌ తీసుకెళ్లారని.. అందుకు ఆయన అభ్యంతరం తెలపలేదనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఏపీ మండలి అతి త్వరలోనే కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తుంది. 

బీజేపీతో జతకట్టిన జనసేన
ఏపీలో పరిస్థితులు ఇంతకుముందులా లేవు. మూడు రాజధానుల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేన.. ఇప్పుడు బీజేపీతో జత కట్టింది. అమరావతి విషయంలో సీరియస్‌గా ఉన్న పవన్.. రైతులకు బాసటగా నిలుస్తున్నారు. అయితే వారిని పరామర్శించేందుకు వెళ్లినా ప్రభుత్వం ఆంక్షలు పెడుతుండడం జనసేనకు మింగుడు పడడం లేదు. దీంతో జగన్‌ సర్కార్‌పై గుర్రుగా ఉన్న పవన్‌.. ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో వైసీపీ సర్కార్ మండలి రద్దు నిర్ణయానికి పవన్‌ మోకాలడ్డుతారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మండలి రద్దు నిర్ణయంపై పునరాలోచన చేస్తారా?
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైసీపీకి కేంద్రం సహకరిస్తుందా.. జగన్‌ ఆశిస్తున్నట్టు మండలి రద్దు బిల్లును ఉభయసభల్లో ప్రవేశ పెట్టి తక్కువ కాలంలో ఆమోదిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మండలి రద్దుకు సంకేతాలిచ్చిన జగన్‌.. నాలుగు రోజుల సమయం ఎందుకు తీసుకున్నారనేది హాట్‌ టాపిక్‌గా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలామంది పదవులు ఆశిస్తున్నారు. వాళ్లందర్ని సంతృప్తి పరచాలంటే ఖచ్చితంగా పదవులు కట్టబెట్టాల్సిందే. 

రద్దు నిర్ణయంతో టీడీపీ డిఫెన్స్ లో పడిందా? 
ఒక్క ఏడాది ఆగితే.. చాలా ఎమ్మెల్సీలు ఖాళీ అవుతాయి. ఆశావహులకు అవకాశాలు కల్పించొచ్చు. ఇంత మాత్రానికి రద్దుకి మొగ్గుచూపుతారా..? మరోవైపు జగన్ టీడీపీని డిఫెన్స్‌లో పడేసేలా గడువు తీసుకున్నారనే వాదనలూ లేకపోలేదు. ఎమ్మెల్సీల్లో చాలామంది టీడీపీ సభ్యులే ఉన్నారు. ఒకవేళ రద్దు చేస్తే వాళ్లందరి పదవులు పోవడం ఖాయం. వాళ్లు యూటర్న్ తీసుకునేలా గడువు పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 

union govt
Support
Suspense
abolition
AP
Legislative Council
Amaravathi

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు