ఏపీ శాసన మండలి రద్దు ఖాయమేనా! 

Submitted on 23 January 2020
Will the AP Legislative Council be dissolved?

విడిపోయిన ఈ పేద రాష్ట్రానికి శాసన మండలి అవసరమా అన్న సీఎం జగన్‌ వ్యాఖ్యలు.. పెద్దల సభను పక్కన పెట్టేందుకేనా..?  కీలక బిల్లుల తిరస్కరణతో అసహనంతో రగిలిపోతున్న ప్రభుత్వం.. మండలి రద్దుపై నిర్ణయానికి వచ్చేసిందా..? ఒకవేళ రద్దు నిజమైతే ఎంతకాలం పట్టొచ్చు..? కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తుందా అన్న ప్రశ్నలు ఆసక్తిరేపుతున్నాయి. 

ఏపీ సీఎం జగన్‌ వ్యాఖ్యలతో దాదాపు శాసన మండలి రద్దు ఖాయంగా కనిపిస్తుంది. ఇదే నిజమైతే ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది..? రద్దుకి ఎంత సమయం పడుతుంది..?... మండలిని రద్దు చేయాలంటే ముందుగా శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టాలి. సభ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపాలి. అక్కడ ముందుగా లోక్‌సభలోనైనా రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టొచ్చు. రెండు సభల్లో రద్దు తీర్మానం ఆమోదం పొందితే ఫర్వాలేదు. 

రెండింటిలో ఏ ఒక్క సభ తిరస్కరించినా బిల్లు మళ్లీ రాష్ట్రానికి చేరుతుంది. ఇక్కడ మరోసారి శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ కేంద్రానికి పంపించాలి. ఒకవేళ అప్పుడు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందితే అక్కడినుంచి రద్దుకు సంబందించిన ఆమోదప్రతి రాష్ట్రపతికి చేరుకుంటుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఆ క్షణం నుంచి పూర్తిగా ఏపీ శాసన మండలి రద్దు కానుంది. 

శాసన మండలి రద్దు ప్రాసెస్‌ నెలలో పూర్తి కావొచ్చు.. లేదంటే పదేళ్లు పట్టొచ్చు. ఇంత కాలం అని నిర్దిష్ట గడువేం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్యను బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్ ఆమోదం లభించకపోతే మాత్రం.. శాసన మండలి రద్దు కష్టమేనని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.
 

AP
Legislative Council
dissolve
cm jagan
union govt
Amaravathi

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు