టీఆర్‌ఎస్‌కు లోక్‌స‌భ‌లో నాయ‌క‌త్వం వ‌హించేది ఎవ‌రు?

Submitted on 25 May 2019
who is TRS lok sabha lp leader

పార్లమెంటు ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌డం, అనూహ్యంగా సీనియ‌ర్ నేత‌లు ఓట‌మి పాలు కావ‌డంతో కొత్త చ‌ర్చలు తెర‌పైకి వ‌స్తున్నాయి. గులాబీ ద‌ళానికి లోక్ స‌భ‌లో నాయ‌క‌త్వం వ‌హించేది ఎవ‌రు? పార్టీ అధినేత మ‌న‌సులో ఏముంది? అనే అంశాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఫ్లోర్ లీడ‌ర్ ఎంపిక‌లో ఏయే స‌మీక‌ర‌ణాలు కీల‌కం కానున్నాయి. 

టీఆర్ఎస్ ఎంపీల‌కు లోక్ స‌భ‌లో నాయ‌క‌త్వం వ‌హించేది ఎవ‌ర‌నేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ త‌ర‌పున గెలిచిన ఎంపీల్లో ఐదుగురు మొద‌టిసారి ఎన్నికైన వారే. మిగ‌తావారిలో కొత్త ప్రభాక‌ర్ రెడ్డి, ప‌సునూరి ద‌యాక‌ర్, నామా నాగేశ్వర్ రావు, బీబీ పాటిల్‌లు రెండు సార్లు ఎన్నిక‌య్యారు. వీరిలో నామా నాగేశ్వరరావు గ‌తంలో టీడీపీ త‌ర‌పున గెలిచి ఢిల్లీలో కీల‌కంగా వ్యవ‌హ‌రించిన అనుభవం ఉంది. అనుభ‌వాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే నామా వైపే అధినేత మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. అయితే సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే కొత్త ప్రభాక‌ర్ రెడ్డికి అవ‌కాశం ద‌క్కుతుంద‌నే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు అదే సామాజిక వ‌ర్గానికి చెందిన ఉన్నత విద్యావంతుడు రంజిత్ రెడ్డి కూడా రేసులో ఉన్నార‌ని స‌మాచారం. 

ద‌ళిత సామాజిక వ‌ర్గానికి ఛాన్స్ ఇచ్చి పార్లమెంట‌రీ నేత‌గా బీసీకి అవ‌కాశం ఇవ్వాల‌నే కోణంలో కూడా ప‌రిశీలిస్తున్నారు. అదే జ‌రిగితే ప‌సునూరి ద‌యాక‌ర్, పి.రాములులో ఒక‌రికి అవ‌కాశం ద‌క్కుతుంది. సీనియ‌ర్లు అనే పారామీట‌ర్ ప‌క్కన బెట్టి మ‌హ‌బూబాబాద్ ఎంపీ మాలోత్ క‌విత‌ను లోక్ స‌భ ప‌క్ష నేత‌గా ఎంపిక చేయాల‌ని గులాబీ ద‌ళ‌ప‌తి భావిస్తున్నట్టు స‌మాచారం. గిరిజ‌న సామాజిక వ‌ర్గం, మ‌హిళ అనే స‌మీక‌ర‌ణాలు మాలోతు క‌విత‌కు అనుకూలాంశాలుగా మారే అవ‌కాశాలున్నాయి. 

లోక్ స‌భ ప‌క్ష నేత ఎంపిక ఎలా ఉన్నప్పటికీ పార్లమెంట‌రీ ప‌క్షనేతగా సీనియ‌ర్ నేత కేశ‌వ‌రెడ్డికి అవ‌కాశం ఇవ్వాల‌నే యోచిస్తున్నట్టు స‌మాచారం. టీఆర్ఎస్ త‌ర‌పున ఎన్నిక‌యిన ఎంపీల్లో బీబీ పాటిల్ ఒక్కరే బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. ఇక ముగ్గురు ద‌ళిత‌, ఒక గిరిజ‌న‌, ఒక క‌మ్మ, ముగ్గురు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఎన్నిక‌య్యారు. సామాజిక స‌మీక‌ర‌ణాల ఆధారంగా కేసీఆర్ ఎవ‌రికి ఛాన్స్ ఇస్తారో అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది. 
 

TRS
Lok Sabha
LP leader
CM KCR
Discussion

మరిన్ని వార్తలు