మాగుంట దారెటు ? 

Submitted on 15 January 2019
what is the Magunta Decession ?

సుమారు మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభం ఉన్న కుటుంబం వారిది. కాంగ్రెస్ పార్టీనుండి గెలుపొందిన అనుభవం ఉన్నా...... గత ఎన్నికల్లో ఓటమి  పాలవడంతో ఈ సారి కూడా ఓటమి పునరావృతం అవుతుందేమోననే అనుమానపు భయం ఆ నాయకుడ్ని ఇప్పుడు వెంటాడుతొంది. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్ధిగా అధికారపార్టీ అతడ్నే ప్రకటించినప్పటికి యుద్దానికి సైనికులెవరనేది  ఇంకా ఓ కొలిక్కిరాకపోవడంతో ఆ నాయకుడు బరిలో దిగడానికి ధైర్యం చేయలేక పోతున్నాడట. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా ఎంతో అనుభవమున్న ఆ నాయకుడ్ని పట్టి పీడిస్తున్న అంశాలు ఏమిటి? 
మాగుంట శ్రనివాసులు రెడ్డి 
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. మాగుంట కుటుంబ రాజకీయాలు గురించి ప్రస్తావన వచ్చిన వెంటనే జిల్లా ప్రజలకు గుర్తుకు వచ్చేది మాగుంట సుబ్బరామిరెడ్డి. మాగుంట సుబ్బరామి రెడ్డికి రాజకీయంగా కార్యకర్తలతో, నాయకులతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన మరణాంతరం ఆయన వారసుడిగా రాజకీయ అరంగ్రేటం చేసిన మాగుంట శ్రీనువాసులు రెడ్డి  ఒంగోలు ఎంపిగా పలు మార్లు గెలుపొందారు. రాష్ట్ర విభజనానంతరం దారితీసిన పరిణామాలతో కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని తెలుగుదేశం పార్టీలో చేరిన మాగుంట శ్రీనివాసులు ఓటమి పాలయ్యారు. అయితే ఆలస్యంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించడమే అతని ఓటమి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
టీడీపీలో ఓటమి చెందడంతో ఆయన కాస్త నిరాశ చెందాడు. అయితే ఆయనపై ఉన్న నమ్మకంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి కూడా ఆయనకే సీటు ఇస్తున్నట్లు స్ఫష్టం చేశారు.    పార్టీనుండి టికెట్ హామీ వచ్చినా, ఈ సారి గెలుస్తామా లేదా?  అని మాగుంటకే పలు అనుమానాలు ఉన్నాయి. 
పశ్చిమ ప్రకాశంలో టీడీపీ బలం తక్కువ
ఇందుకు కొన్ని కారణాలు కూడా లేకపోలేదు. పశ్చిమ ప్రకాశంలో టీడీపీకి అంత పట్టులేదన్న విషయం  తెలుగుదేశం పార్టీ అధినేత సైతం అంగీకరిస్తారు. దశాబ్ధాలుగా పశ్చిమ ప్రాంతం కాంగ్రెస్ కు కంచుకోట లాంటింది. గతంలో కాంగ్రెస్ తరుపున పోటీచేసిన మాగుంట సునాయాసంగా విజయాలు సాదించారు. అయితే పశ్చిమ ప్రకాశంలోని కాంగ్రెస్ ఓటుబ్యాంక్  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి టర్న్ కావడంతో టీడీపీ తరుపున పోటీ చేసిన మాగుంటకు ఓటమి తప్పలేదు.  

పశ్చిమ ప్రకాశంలో పసుపు జెండాను రెపరెప లాడించాలని చంద్రబాబు ఎంతగా వ్యూహలు రచించినా వర్కౌట్ కావడంలేదు. చివరికి పశ్చిమ ప్రకాశంలో వైఎస్ అర్ కాంగ్రెస్ జెండా పై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినా, చెప్పుకోదగ్గ అభివృద్ది చేసినా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచే పరిస్తితి లేదని మాగుంట అంచనా. ఈ నేపద్యంలో మళ్లీ టీడీపీ నుండి పోటీ చేసి ఓటమి భారాన్ని ఎందుకు మోయాలని ఆలోచిస్తున్నారంట మాగుంట శ్రీనివాసుల రెడ్డి.  ఇదే విషయం టీడీపీ అద్యక్షుడికి చెప్పడంతో మాగుంటను గెలిపించే భాద్యత తనదని హామీ ఇచ్చారట చంద్రబాబు. 

ఇలాంటి పరిస్థితుల్లో తన పార్లమెంటు నియోజక వర్గంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యే అభ్యర్ధులను మార్చమని మాగుంట చంద్రబాబును కోరినట్లు తెలుస్తొంది. కనిగిరి టికెటు బాబురావుకు  కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వమని మాగుంట చెప్పారని ప్రచారం జరుగుతోంది. అదే విదంగా మార్కాపురం నియోజకవర్గంనుండి ప్రస్తుత కందుల నారాయణ రెడ్డి అయితే గెలవడం  కష్టమని యర్ర గొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు పై అవినీతి ఆరోపనలు ఉన్నందున ప్రజల్లో వ్యతిరేక ఉందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమూల్ల అశోక్ రెడ్డి గెలవడం కష్టమని చంద్రబాబుకు చెప్పారట మాగుంట శ్రీనివాసుల రెడ్డి. ఈ విషయంకాస్త సిట్టింగు ఎమ్మెల్యేల చెవిన పడటంతో  వారు మాగుంటపై భగ్గుమన్నారు. నేరుగా విమర్శలకు దిగుతున్నారు. ఇలా వివాదాలు ముదరడంతో అప్రమత్తమైన మాగుంట తాను అభ్యర్ధులను మార్చమంటూ చంద్రబాబుకు ఎప్పుడూ చెప్పలేదని అనవసరంగా తనను అపార్ధం చేసుకున్నారంటూ మాగుంట వివరణ ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది. 
ఎమ్మెల్యేల లిస్టు పంపని మాగుంట
పార్లమెంట్ సెగ్మెంట్ నుండి ఎమ్మెల్యే అభ్యర్ధులు ఎవరు అంటూ..... కొన్ని రోజుల క్రితం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంనుండి అందరూ ఎంపీ అభ్యర్ధులకు వర్తమానం అందింది. దీంతో అందరు అధిస్టానానికి పంపించగా మాగుంట మాత్రం తన ఎమ్మెల్యే అభ్యర్ధుల నివేదిక ఇవ్వలేదు. ఇప్పటికే ఆయనపై విమర్శలు వచ్చిన నేపద్యంలో ఆయన తన మనస్సులో ఉన్న లిస్టును పంపించేందుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తొంది.
మరోవైపు మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసినా ఇంత వరకు ప్రచారం కాని, ప్రజల్లోకి పోవడంకాని, రాజకీయాలు చేయడంకాని, మాగుంట చేయట్లేదు. 
వారానికి రెండు రోజులు మాత్రమే ఒంగోలుకు పరిమితమవ్వడం వెనుక ఉన్న రహస్యమేమిటో తెలియడం లేదని, ఆయన సన్నిహితులకు సైతం అంతు బట్టడంలేదు. అదే పరిస్థితుల్లో మాగుంటను గెలిపించే భాద్యత తనదని భాద్యత తీసుకున్న చంద్రబాబు ఆ దిశగా  ప్రయత్నాలు మొదలు పెట్టలేదని మాగుంట అనుచరులు భావిస్తున్నారు. 
మొత్తంగా చూస్తే గత ఎన్నికల్లో పార్టీ మారడం ఆలశ్యంగా ప్రచారం మొదలు పెట్టడం వంటి విషయాలు ఆయన ఓటమికి కారణమని ప్రచారం ఉన్న నేపధ్యంలో ఇప్పుడు అభ్యర్ధిని చాలా  రోజుల క్రితమే ప్రకటించేసినా ప్రచారానికి చాలా సమయం ఉన్నా కూడా మాగుంట గెలుపు కోసం వ్యూహాలు రచించక పోవడం వెనుక ఉన్న కారణమేంటన్న దానిపై పార్టీలో రకరకాలుగా చర్చలు  సాగుతున్నాయి. మరి మాగుంట మనస్సులో ఏముందో..ఆయన ఎప్పుడు దూకుడు పెంచుతాడోల వేచి చూడాలి.       

Ongole politics
Ongole MP
Congress
TDP
Magunta Sreenivasulu Reddy

మరిన్ని వార్తలు