రివ్యూ : వినయ విధేయ రామ

Submitted on 11 January 2019
Vinaya Vidheya Rama Movie Review

రంగస్థలంతో టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన రామ్ చరణ్ అన్ని జానర్ సినిమాలు చెయ్యాలనే ఉద్దేశ్యంతో కమర్షియల్ ఎంటర్ టైనర్ అందించడం కోసం మాస్ స్టైలిష్ స్టైల్ లో బోయపాటి శ్రీను తో జతకట్టాడు. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా.. ట్రైలర్ లో పవర్ ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చూపిస్తామని హామీ ఇచ్చింది చిత్ర యూనిట్. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో చిరంజీవి కాన్ఫిడెన్స్, రామ్ చరణ్ యాక్టివ్ నెస్, బోయపాటి ప్రామిస్ చూసిన ప్రేక్షకులు, ట్రేడ్ వర్గలకు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కలెక్షన్స్ కుమ్మేయటం ఖాయమని అనుకున్నారు. ఇలాంటి అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన వినయ విధేయ రామ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
కథ :
నలుగురు అనాథలకు ఒక పసి పిల్లవాడు దొరకుతాడు. అతనికి రామ అని పేరు పెడతారు. వాళ్లంతా కలిసి అన్నదమ్ముల్లా పెరుగుతారు. రామ్ కి కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబం జోలికి ఎవరొచ్చినా.. విధ్వంసకర రాముడిగా విరుచుకుపడతాడు. రామ్ పెద్దన్నయ్య భువన్ కుమార్ (ప్రశాంత్) స్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్ . అతనికి బీహార్ లో ఎలక్షన్ డ్యూటీ పడుతుంది. అక్కడికి వెళ్లి ఎలక్షన్ డ్యూటీ చేసే సమయంలో రాజా సింగ్ అనే నియంత లాంటి విలన్ చేతిలో చిక్కుకుంటాడు. ఆ విషయం తెలిసిన రామ్ అక్కడికి వెళ్లి ఏం చేశాడు..? వాళ్ల అన్నను రక్షించుకున్నాడా లేదా..? రాజా సింగ్ ని ఎలా అంతం చేశాడు అనేది సినిమా చూసి తెల్సుకోవాల్సిందే. 
ఎలా నటించారు :
రంగస్థలంతో నటుడిగా, తన సత్తా ఏంటో నిరూపించుకున్న రామ్ చరణ్ కి ఈ సినిమాలోని రామ్ కొణిదెల పాత్ర.. నటుడిగా ఎలాంటి ఛాలెంజ్ ని కూడా ఇవ్వలేకపోయింది. సగటు కమర్షియల్ హీరో పాత్రను తన వరకూ ఎలాంటి పేరు పెట్టడానికి లేకుండా అలవోకగా అంకితభావంతో చేసుకెళ్లిపోయాడు. ఫైట్స్ కోసం కఠోర సాధన చేసి పాటలకోసం అదిరిపోయే స్టెప్స్ వేసి ఫ్యాన్స్ కోసం పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పి డైరెక్టర్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి వినయవిధేయరాముడిగా సినిమాను నిలబెట్టడానికి చెయ్యగలిగినంత ప్రయత్నం చేశాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ గ్లామర్ హీరోయిన్ గా టర్న్ తీసుకుంది. సినిమాకి అవసరమైన మేర అందాల ప్రదర్శనకు ఓకే చెప్పింది. చరణ్ తో ఆమె పెయిరింగ్ పర్ ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఇక వెటరన్ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చిన స్నేహకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కాయి. మధుమిత, రవివర్మ, మధునందన్, హిమజ, ప్రవీణ వీళ్లంతా చూడచక్కని ఫ్యామిలీలో నిండుదనం తెచ్చారు. ఈ సినిమా కోసం విలన్ గా మారిన బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ నటన పరంగా అలరించినా.. పాత్ర పరంగా పెద్దగా ప్రత్యేకత లేకపోవడంతో.. తనదైన ముద్రను వేయలేకపోయాడు. ముఖేష్ రిషి, ఎప్పటిలానే మామూలు విలన్ గా కనిపించాడు. మహేష్ మంజ్రేకర్ పాత్ర కూడా సాధారణంగా ఉంది. పృధ్వి, హేమ చేసిన కామెడీ కంటెంట్ నవ్వులు పూయించింది. మిగతా నటీనటులందరూ తమకిచ్చిన పాత్రలను దర్శకుడి ఆలోచనల మేరకు నటించారు.
సాంకేతిక వర్గం :
ఇప్పటి వరకూ మాస్ సినిమాలు తీస్తూ.. అలవోకగా విజయాలు అందుకున్న బోయపాటికి ఈ సినిమా అసలైన సవాల్ గా నిలిచింది. రంగస్థలంతో చరణ్ ఇమేజ్ అమాంతంగా పెరగడంతో తన కథలో వయెలెన్స్ పాళ్లు బాగా పెంచాడు బోయపాటి. ఆ క్రమంలో కథ పలచబడిన విషయాన్ని గ్రహించలేకపోయాడు. ఫస్టాఫ్ వరకూ యాక్షన్, సెంటిమెంట్, కామెడీ బ్యాలెన్స్ చేసుకుంటూ సాదాసీదా కమర్షియల్ ఎంటర్ టైనర్ లా సినిమా నడిపించాడు. సెకండాఫ్ లో మాత్రం ఓవర్ ద టాప్ సీన్స్ ను డిజైన్స్ చేశాడు. హీరో, విలన్ పాత్రలను అత్యంత పవర్ ఫుల్ గా చూపించాలనే తాపత్రయంతో బేసిక్స్ ని వదిలేశాడు. దాని వల్ల సినిమాకి హైలెట్ గా నిలబడాల్సిన ఎపిసోడ్స్.. అయ్యబాబోయ్ అనేలా తయారయ్యాయి. సినిమా వరకూ డైరెక్టర్ గా పూర్తిగా నిరాశపరిచాడనే చెప్పాలి. రుషి పంజాబీ, ఆర్దర్ విల్సన్ ల సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ లో ఉంది. సినిమా అంతా రిచ్ లుక్ రావడానికి వీళ్లు ఎంతగానో సహకరించారు. అజర్ బైజాన్ ఎపిసోడ్స్ లో ఏరియల్ షాట్స్ ఆకట్టుకున్నాయి. సినిమాలో కంటెంట్ సో..సో..గా ఉండడంతో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న దేవీశ్రీప్రసాద్ కూడా నార్మల్ ట్యూన్స్ మాత్రమే డెలివర్ చెయ్యగలిగాడు. ఆర్.ఆర్ లో మాత్రం దేవీ ట్రేడ్ మార్క్ అక్కడక్కడా కనిపించింది. డైలాగ్ రైటర్ రత్నం పవర్ ఫుల్ డైలాగ్స్ వరకూ తన పెన్ పవర్ చూపించాడు. ఈ సినిమాలో ఫైట్ మాస్టర్స్ కష్టం స్క్రీన్ పై కనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కొంత మేరకు ఆకట్టుకున్నాయి. డి.వి.వి దానయ్య నిర్మాణ విలువలకు తిరుగులేదు. అడుగడుగునా గ్రాండియన్ కనిపించేలా ఈ సినిమాని నిర్మించారు. ఓవరాల్ గా చెప్పాలంటే .. భారీ ఎక్స్ పెక్టేషన్స్ మద్య కమర్షియల్ ఎంటర్ టైనర్ గా థియేటర్స్ లోకి వచ్చిన వినయ విధేయ రామ.. సినిమాలో మాత్రం వీర విధ్వంసకర రాముడిగా రెచ్చిపోయాడు. ఫస్టాఫ్ వరకూ ఓకే అనిపించినా.. సినిమా రెండో భాగంలో గతి తప్పింది.
యాక్షన్ ఎపిసోడ్స్ ని ఎక్కువగా కుమ్మరించడంతో.. ఫ్యాన్స్ కు కనెక్ట్ అయినా.. కామన్ ఆడియన్స్ కి మాత్రం సో సో గా అనిపించవచ్చు. పండగ సీజన్ కావడం వల్ల బాక్సాఫీస్ వద్ద బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉండొచ్చు.
ప్లస్
రామ్ చరణ్ మేకోవర్
యాక్షన్ ఎపిసోడ్స్
డైలాగ్స్, ఆర్.ఆర్
సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్
రొటీన్ కథ
అస్తవ్యస్తమైన స్క్రీన్ ప్లే
అతిగా అనిపించే సన్నివేశాలు
సెకండాఫ్

Vinaya Vidheya Rama
review
movie

మరిన్ని వార్తలు