విదేశాల్లో వాస్తుకి పెరుగుతున్న డిమాండ్ : హైదరాబాద్ కి వచ్చి ట్రైనింగ్

Submitted on 12 September 2019
Vaastu heads to foreign shores

యోగా, ఆయుర్వేదం, మెడిటేషన్(ధ్యానం).. మన భారత దేశంలో ఎంత ప్రాముఖ్యం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అంశాల్లో భారత్ గురువు లాంటిది. ప్రపంచ దేశాలు మనల్ని ఫాలో అవుతున్నాయి. మన ఆచార, వ్యవహారాలను గౌరవించడమే కాకుండా ఫారిన్ లోనూ ఆచరిస్తున్నారు. భారత్ కి వచ్చి మరీ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వాస్తు కూడా అదే జాబితాలో చేరింది. మన వాస్తుకి విదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. వాస్తు నేర్చుకోవాలని, ఆచరించాలని విదేశీయులు ఆరాటపడుతున్నారు. విదేశాలకు చెందిన కొందరు వాస్తు శిల్పులు, ఇంటీరియర్ డిజైనర్లు.. వాస్తులోని సూత్రాలను నేర్చుకునేందకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ వచ్చి వాస్తు గురువుల దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. రష్యా, బ్రెజిల్, సౌత్ అమెరికాకి చెందిన పలువురు ఔత్సాహికులు హైదరాబాద్ కి క్యూ కట్టారు. మన నగరానికి వచ్చిన వాస్తు శిక్షణ తీసుకుంటున్న వారిలో ఒకరు మరియానా. ఆమె ఓ ఆర్కిటెక్ట్. బ్రెజిల్ నుంచి వచ్చింది.

యోగా ద్వారా మైండ్ ని, ఆయుర్వేదం ద్వారా శరీరాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది భారత్ నేర్పిందని బ్రెజిల్ కి చెందిన ఆర్కిటెక్ట్ మరియానా తెలిపింది. ఇదే విధంగా ఇప్పుడు వాస్తు పట్ల ఆసక్తి పెరుగుతోందని చెప్పింది. వాస్తు కరెక్ట్ గా ఉండటం ద్వారా ఆనందం, సిరి సంపదలు లభిస్తాయనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. అందుకే తాను హైదరాబాద్ వచ్చి మరీ వాస్తు నేర్చుకుంటున్నాను అని తెలిపింది. ఆనందం, ఆరోగ్యం మధ్య వారథిలా వాస్తు పని చేస్తుందని ఆమె తెలిపింది.

నగరంలో వాస్తు టీచర్ వేణుగోపాల్ రావ్ దగ్గర పలు విదేశీయులు అభ్యాసం చేస్తున్నారు. ఒక మరియానానే కాదు.. సారా అనే ఆర్కిటెక్ట్ కూడా వాస్తు శిక్షణ పొందుతోంది. సౌత్ అమెరికాలోని పనామా నుంచి ఆమె వచ్చింది. ఆర్కిటెక్ట్ లో మాత్రమే కాదు వాస్తు ద్వారా చాలా లాభాలు ఉన్నాయని చెబుతుంది. అందుకే పశ్చిమ దేశాల్లో ఆదరణ పెరుగుతోందని వెల్లడించింది.

ఇళ్లకు మాత్రమే కాదు వాణిజ్య భనవాలు కట్టే వారు కూడా వాస్తు చూసుకుంటున్నారని వారు చెబుతున్నారు. రష్యాలో వాస్తు గురించి బాగా అవగాహన పెరిగిందని డరియా అనే డిజైనర్ చెప్పింది. ''రష్యాలో వాస్తు నిపుణుల కొరత ఉంది. పెద్ద సంఖ్యలో క్లయింట్స్ వస్తున్నారు. కానీ వారికి సరైన విధంగా పరిష్కారాలు చెప్పలేకపోతున్నాము. అందుకే హైదరాబాద్ కి వచ్చి వాస్తు నేర్చుకుంటున్నా. మా దగ్గరికి వచ్చే వారికి సరైన పరిష్కారం ఇవ్వాలని అనుకుంటున్నాము'' అని డరియా చెప్పింది. మొత్తంగా భారతీయ సంపద్రాయంలో భాగమైన వాస్తుకి విదేశాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది. ఇండియాకి వచ్చి వాస్తు నేర్చుకోవాలనే ఫారినర్స్ సంఖ్య పెరుగుతోంది.

Vaastu
heads
foreign shores
india
Hyderabad
architects

మరిన్ని వార్తలు