H-1B వీసా...భారతీయుల నెత్తిన మరో బాంబు వేసిన ట్రంప్

Submitted on 27 May 2019
US starts process to ban work permits for spouses

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వీసా విధానాలపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇప్పటికే హెచ్‌-1బీ వీసాల జారీ విషయంలో నిబంధనలు కఠినతరం చేసిన ట్రంప్ సర్కార్... ఇప్పుడు హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతిపై నిషేధం విధించే ప్రక్రియ ప్రారంభించింది. ట్రంప్ నిర్ణయం అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వేలాది భారతీయ టెకీ కుటుంబాలపై ప్రభావం చూపనుంది.

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్స్ ను తొలగించేలా ట్రంప్‌ సర్కార్‌ గతంలో ప్రతిపాదనలు తయారుచేసిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలపై ఇటీవల నోటీసులు జారీ చేశారు.ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైనట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ రెండో దశకు చేరుకుంది. ఇక్కడ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే...వాటిని ఫెడరల్‌ రిజిస్ట్రీలో ప్రచురిస్తారు. ఆ తర్వాత కొత్త ప్రతిపాదనలపై 30-60 రోజుల వరకు ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు వీలుంటుంది.

అనంతరం దీనిపై చట్టం తీసుకొస్తారు. అయితే ఇదంతా జరిగేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తెలిపారు.అయితే ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే భారతీయులే ఎక్కువగా నష్టపోతారు. హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూసే వారి జీవిత భాగస్వాములు అమెరికాలోని కంపెనీల్లో పనిచేసేందుకు హెచ్‌-4 డిపెండెంట్‌ వీసాల కింద వీలు కల్పిస్తూ 2015లో ఒబామా ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది.

అయితే ఈ విధానాన్ని తొలగిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో ప్రకటించారు. దీన్ని భారత సంతతికి చెందిన ప్రజాప్రతినిధులు, పలు సంఘాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అయినప్పటికీ ట్రంప్‌ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. అమెరికా యువతకు ఉద్యోగాలు కల్పించేందుకే ఈ నిబంధనలు తీసుకొస్తున్నట్లు ట్రంప్‌ సర్కార్‌ చెబుతోంది. 

donald trump
usa
Visa
h1B
work permit
spouses
ban
start
process
Indians
techie
effect

మరిన్ని వార్తలు