కారు జోరేనా : హుజూర్‌నగర్‌ ఫలితంపై ఉత్కంఠ

Submitted on 24 October 2019
Thriller over Telangana Huzurnagar result

హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. నేటితో నెలరోజుల ఉత్కంఠకు తెరపడనుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కౌంటింగ్ హాల్‌లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలనుంచి ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానున్నది. ఇందుకోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 

అధికార టీఆర్‌ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతితోపాటు మొత్తం 28 మంది అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీ చేశారు. 302 పోలింగ్ కేంద్రాల్లో 2 లక్షల 36వేల 842 మంది ఓటర్లకుగాను రెండు లక్షల 754 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కో రౌండ్‌కు 14 టేబుళ్లపై 14 ఈవీఎంలను లెక్కిస్తారు. అనంతరం పోలింగ్ కేంద్రాల నంబర్లవారీగా చిట్టీలు పెట్టి.. ఐదు పోలింగ్ కేంద్రాలను ఎంపికచేసి వాటిలోని వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. పోలైన ఓట్లు, వీవీప్యాట్ స్లిప్‌లో సమానంగా వచ్చాయా లేదా అన్నది పరిశీలిస్తారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముందుగా నేరేడుచర్ల మండలం నుంచి ప్రారంభంకానున్నది. నేరేడుచర్ల, పాలకవీడు, మఠంపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం, హుజూర్‌నగర్, గరిడేపల్లి మండలాలవారీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రతిరౌండ్‌లో దాదాపు ఎనిమిదివేల నుంచి పది వేల ఓట్లను లెక్కించేఅవకాశం ఉన్నది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఓట్ల లెక్కింపు పూర్తయి తుది ఫలితం వెలువడే అకాశముంది. 

హుజూర్‌నగర్ ఉపఎన్నిక ఫలితంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గతం కంటే చాలా అంశాలు తమకు అనుకూలంగా ఉన్నాయని.. విజయావకాశాలు మెరుగయ్యాయని టీఆర్ఎస్ నేతలు చెప్తుంటే... సంస్థాగతంగా ఉన్న కేడర్ చెక్కు చెదరలేదని.. సైలెంట్ ఓటింగ్ తమను మరోసారి విజయ తీరాలకు చేరుస్తుందని కాంగ్రెస్ భరోసాగా ఉంది. రెండు పార్టీల నేతలు... బూత్‌ల వారీగా ఓటర్ల వివరాలను తెలుసుకుంటూ... తమ బలాబలాలను బేరీజు వేసుకునే పనిలో ఉన్నారు. కౌంటింగ్ ఎజెంట్లకు శిక్షణ శిబిరాలు నిర్వహించారు.
Read More : ఆర్టీసీ సమ్మె 20వ రోజు : కొనసాగుతున్న నిరసనలు

Thriller
over
Telangana
Huzurnagar result

మరిన్ని వార్తలు