మరో ఛాన్స్ : ఏపీలో ముగ్గురు టీడీపీ ఎంపీ అభ్యర్థుల గెలుపు

Submitted on 25 May 2019
Three TDP MP candidates win in AP elections

ఏపీ ఎన్నికలు-2019లో టీడీపీ తీవ్ర ప్రజాగ్రహానికి గురైంది. ఆ పార్టీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రజలు... వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ముగ్గురు టీడీపీ ఎంపీ అభ్యర్థుల విషయంలో మాత్రం జనం సానుభూతి చూపించారు. గతంలో ప్రత్యేక హోదా కోసం బలంగా గళమెత్తిన ముగ్గురు నేతల్ని... మరోసారి ఆశీర్వదించారు. రాష్ట్ర హక్కుల కోసం ప్రశ్నించే గళాలకు మళ్లీ అవకాశం ఇచ్చారు.

ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. పార్టీ చరిత్రలోనే ఎన్నడూలేనంత దారుణ ఓటమిని చవిచూసింది. వైఎస్‌ జగన్‌ సునామీల్లో ఉద్దం డుల్లాంటి నాయకులు కూడా కొట్టుకుపోయారు. మంత్రులు, సీనియర్‌ ఎమ్మెల్యేలు కూడా పరాజయం పాలయ్యారు. అసెంబ్లీ ఫలితాలే కాదు.. లోక్‌సభలోనూ సేమ్ సీన్‌. సీనియర్‌ ఎంపీలంతా ప్రజాగ్రహానికి గురయ్యారు. కానీ.. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో గళమెత్తిన ముగ్గురు టీడీపీ ఎంపీలను మాత్రం ప్రజలు ఆదరించారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడిన ఆ ముగ్గుర్నీ... మరోసారి పార్లమెంటుకు పంపించారు.

రాష్ట్రంలో టీడీపీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. అసెంబ్లీలో కేవలం 23 స్థానాల్లోనే విజయం సాధించింది. ఇక పార్లమెంటరీ స్థానాల్లో ముగ్గురికి మాత్రమే ప్రజలు మళ్లీ ఓటు వేసి గెలిపించారు. ఆ ముగ్గురు ఎంపీ అభ్యర్థులూ... గతంలో పార్లమెంటులో ప్రధాని మోడీని ప్రత్యేక హాదా కోసం నిలదీసిన వారే. వారిలో గుంటూరు లోక్‌సభ తెలుగుదేశం అభ్యర్థి గల్లా జయదేవ్ ఒకరు. తాజా ఎన్నికల్లో ఆయన మరోసారి విజయం సాధించారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ పార్లమెంటులో మిస్టర్ ప్రైమ్‌ మినిస్టర్ అంటూ ప్రసంగించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు గల్లా జయదేవ్‌. అందుకే మరోసారి ఏపీ ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. వైసీపీ అభ్యర్థి వేణుగోపాల్‌రెడ్డిపై 4800 ఓట్ల తేడాతో జయదేవ్‌ విజయం సాధించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్‌ గాలి బలంగా వీచినా... శ్రీకాకుళంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడ్ని మాత్రం టచ్ చేయలేకపోయింది. ఆయన మరోసారి ఎంపీగా విజయం సాధించారు. రామ్మోహన్‌ నాయుడు కూడా ప్రత్యేక హోదాపై పార్లమెంటులో గట్టిగా పోరాడారు. ఏపీ హక్కుల కోసం తన గొంతుని బలంగా వినిపించారు. పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ వైఖరిని తూర్పారబట్టారు. సహజంగానే రామ్మోహన్‌నాయుడు తన మాటలతో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో దిట్ట. సమర్థవంతమైన యువనేతగా మంచి ఆదరణ ఉంది. దీనికితోడు ప్రత్యేకహోదా కోసం గట్టిగా మాట్లాడారన్న అభిమానం కూడా కలిసి వచ్చింది.

మరోవైపు విజయవాడ లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని కూడా మరోసారి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ను 8726 ఓట్లతో ఓడించి మరోసారి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. ఈయన కూడా... ప్రత్యేక హోదాపై పార్లమెంటులో తనవంతు బాధ్యతగా పోరాడారు. అవిశ్వాస తీర్మానం సందర్భంలో కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రయత్నించారు. నాని గెలుపుకు ఇది కూడా ఓ కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మొత్తానికి ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నా చావుతప్పి కన్నులొట్టబోయినట్లు ముగ్గురు ఎంపీ అభ్యర్థులు మాత్రం విజయం సాధించారు. వారిపై నమ్మకముంచిన ప్రజలు ఏపీ హక్కుల కోసం పోరాడాలంటూ మరోసారి పార్లమెంటుకు పంపించారు.
 

Three
TDP
MP Candidates
win
ap elections
Amaravathi

మరిన్ని వార్తలు