గొప్పగా చెప్పారు : అభివృద్ధి కోసమే బీజేపీలో చేరామన్న టీజీ

Submitted on 20 June 2019
tg venkatesh reaction on joining bjp

తమ ప్రాంతాల అభివృద్ది కోసమే టీడీపీని వీడి బీజేపీలో చేరామని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చెప్పారు. ప్రభుత్వంలో ఉంటే నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారాయన. ప్రజాభిప్రాయం మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాజ్యసభలో బీజేపీకి బలం తక్కువగా ఉందన్న టీజీ.. బీజేపీకి బలం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తాము బీజేపీలో చేరడం.. తమకే కాదు.. బీజేపీకి కూడా లాభమే అన్నారు. రాజ్యసభలో బలపడితే కీలకమైన బిల్లులు పాస్ చేసుకోవచ్చన్నారు. గతంలో తనకు బీజేపీతో అనుబంధం ఉందని ఎంపీ టీజీ వెంకటేష్ గుర్తు చేశారు. విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో పని చేశానని చెప్పారు.

వారం రోజుల క్రితమే తమ అధినేత చంద్రబాబును కలిశానని, బీజేపీలోకి చేరు విషయం గురించి చెప్పానని టీజీ తెలిపారు. పార్టీని వీడొద్దని, పార్టీకి నష్టం కలిగించొద్దని తనకు చంద్రబాబు సూచించారని అన్నారు. పార్టీని వీడనున్న ఎంపీలు చేసిన సంతకాల లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి అందజేసినట్టు చెప్పారు.

తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ సమావేశాల తొలి రోజే టీడీపీ నిలువునా చీలింది. అధిష్టానంపై నలుగురు రాజ్యసభ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాము టీడీపీని వీడినట్టు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడుకి ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేష్ లేఖ ఇచ్చారు. ఇకపై తమను టీడీపీ సభ్యులుగా కాకుండా ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని వెంకయ్యను కోరారు. టీడీపీని వీడి ఈ నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. అనర్హత వేటు పడకుండా ఫిరాయింపు ఎంపీలు కొత్త ఎత్తు వేశారు. తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలంటూ రాజ్యసభ చైర్మన్ కి లేఖ ఇచ్చారు. దీంతో ఈ నలుగురు ఎంపీలు ఇకపై బీజేపీ అనుబంధ సభ్యులుగా కొనసాగనున్నారు.

tg venkatesh
TDP
MP
BJP
Chandrababu
Modi
Sujana Chowdary
garikapati mohanrao

మరిన్ని వార్తలు