అమెరికాలో దారుణం: దుండగుల కాల్పుల్లో తెలంగాణవాసి మృతి

Submitted on 21 February 2019
Telangana Man Killed In Florida

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. తుపాకీ కాల్పులకు మరో తెలుగు వ్యక్తి బలయ్యాడు. ఫ్లోరిడాలో తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లాకు చెందిన గోవర్ధన్ రెడ్డిని(45) దుండగులు కాల్చి చంపారు. గోవర్ధన్ రెడ్డి జీవనోపాధి కోసం అమెరికాకు వెళ్లి.. స్టోర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం(ఫిబ్రవరి-19-2019) రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) 8 గంటలకు స్టోర్‌లోకి వచ్చిన ఓ  నల్లజాతీయుడు విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గోవర్ధన్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 15ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆయన.. సెలవులపై  మార్చిలో ఇంటికొస్తానని కుటుంబసభ్యులు, మిత్రులకు చెప్పారు. అంతలోనే గోవర్ధన్‌ మృతిచెందారన్న వార్త కుటుంబసభ్యులను షాక్‌కు గురి చేసింది.

ఫ్లోరిడా రాష్ట్రంలోని పెన్సకోలా సిటీలో నివాసం ఉంటున్న గోవర్ధన్‌.. ఫ్లోరిడాలోని ఓ గ్యాస్‌స్టేషన్‌ స్టోర్‌లో కౌంటర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గోవర్ధన్‌రెడ్డి స్టోర్‌లో ఉండగా ముగ్గురు నల్లజాతీయులు (ఓ మహిళతోసహా) లోపలకు ప్రవేశించి దోపిడీకి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలోనే గోవర్ధన్‌పై 3 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. కాల్పులకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసి హత్యానేరం కిందకేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

గోవర్దన్ కు భార్య శోభారాణి, ఇద్దరు కుమార్తెలు (శ్రియ, తులసి) ఉన్నారు. భార్య హైదరాబాద్ బోడుప్పల్‌లో నివాసముంటూ.. ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. పెద్ద కుమార్తె శ్రియ ఇంజనీరింగ్, చిన్న కుమార్తె తులసి ఇంటర్‌ చదువుతున్నారు. ఆయన తండ్రి నర్సిరెడ్డి, తల్లి పద్మ స్వగ్రామమైన యాదాద్రి భువనగరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం రహీంఖాన్‌పేటలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. గోవర్ధన్ మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు అతడి కుటుంబీకులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

2018 నవంబర్‌లో న్యూజెర్సీలో తెలంగాణ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. మెదక్‌కు చెందిన సునీల్‌ ఎడ్లాను వెంట్నార్‌ సిటీలో ఆయన ఇంటి ముందే 16 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఆ ఘటన మరువక మందే మరో ఘోరం చోటు చేసుకోవడం అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో ఆందోళన నింపింది.

telangana man killed
Florida
usa
america
govardhan reddy
store manger
firing
shot

మరిన్ని వార్తలు