మీటింగ్ టైమ్ : జూన్ 18న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

Submitted on 17 June 2019
Telangana Cabinet Meeting On JUne 17th

తెలంగాణా మంత్రి వ‌ర్గం సమావేశం కాబోతోంది. జూన్ 18వ తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్రగ‌తి భ‌వ‌న్‌లో ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్యక్షత‌న కేబినెట్‌ భేటీ కానుంది. నాలుగు నెల‌ల అనంత‌రం సమావేశం కాబోతున్న మంత్రివర్గ ఎజెండా ఏమిటీ? ఈ భేటీలో కేబినెట్ పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్ వేయనుందని తెలుస్తోంది. వ‌రుస ఎన్నిక‌ల‌తో పాల‌న‌లో నెల‌కొన్న స్తబ్ధత‌ను తొలగించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ పావులు క‌దుపుతున్నారు.

ఎన్నిక‌ల కోడ్‌తో దాదాపు 9 నెల‌ల పాటు ఎలాంటి కొత్త నిర్ణయాలు లేకుండానే రాష్ట్రంలో పాల‌న సాగింది. ఎన్నిక‌ల‌న్నీ పూర్తి కావ‌డంతో పాల‌న‌ను కొత్త పుంత‌లు తొక్కించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. జూన్ 18వ తేదీ మంగ‌ళ‌వారం జ‌రిగే రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుప‌నుంది. రెండో ద‌ఫా అధికారం చేప‌ట్టిన గులాబీ పార్టీ  ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌పై మంత్రి వ‌ర్గంలో చ‌ర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

తెలంగాణాలో కొత్త స‌చివాల‌య నిర్మాణం చేయాల‌ని ప్రభుత్వం భావిస్తోంది.  ఈ నెల 27వ తేదీ లోపే ప్రస్తుతం ఉన్న స‌చివాల‌యం స్థానంలో కొత్త భ‌వ‌న నిర్మాణాల‌ను మొద‌లు పెట్టాల‌ని కేసీఆర్ నిర్ణయించారు. దీంతో కేబినెట్‌ భేటీలో  కొత్త స‌చివాల‌య నిర్మాణానికి ఆమోదం తెలుప‌నున్నట్లు తెలుస్తోంది. ప్రజ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు తీసుకోవాల్సిన ప‌లు చ‌ట్టాల‌పై ఇప్పటికే క‌స‌ర‌త్తును పూర్తి చేసిన అధికారులు కేబినెట్ ముందు ఆ బిల్లుల‌ను ఉంచనున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ, మున్సిప‌ల్, రోడ్ సెఫ్టీ లాంటి బిల్లులు మంత్రి వ‌ర్గం ముందుకు రానున్నాయి. సాగునీటి రంగానికి సంబంధించి ఈ విడ‌త పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పెద్ద పీట వేసే అవ‌కాశాలున్నాయి. ఇందుకోసం ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ రుణం తీసుకోవాల‌ని ప్రభుత్వం భావిస్తుంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఈనెల 21న ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో దీనిపై కూడా మంత్రివ‌ర్గంలో చ‌ర్చించే చాన్స్ ఉంది. ఇత‌ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజ‌రు కానున్న నేప‌థ్యంలో ఈ కార్యక్రమాన్ని ఘ‌నంగా నిర్వహించాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల‌కు మ‌ధ్యంత‌ర భృతి కూడా కేబినెట్‌లో చ‌ర్చకు వ‌చ్చే అవ‌కాలున్నాయి. అస‌రా పెన్షన్లు పెంచుతూ ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేయ‌నుంది.

మ‌హిళా సంఘాల‌కు ఫుడ్ ప్రాసిసింగ్ యూనిట్ల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చ‌ర్యలు, రైతు రుణ‌మాఫికి సంబంధించి మంత్రివ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చించి దీనిపై స్పష్టత ఇచ్చే చాన్స్ క‌నిపిస్తోంది. మంత్రిమండ‌లి స‌మావేశానికి ఉన్నతాధికారులు పూర్తి వివ‌రాల‌తో కేబినెట్ ఎజెండాను సిద్ధం చేశారు. ప్రభుత్వ పరంగా రాబోయే రోజుల్లో  తీసుకోవాల్సిన ప్రాధాన్యత‌ల‌ను సీఎం కేసిఆర్ మంత్రుల‌కు వివ‌రించనున్నట్లు తెలుస్తోంది.  

telangana cabinet
meeting
June 17th
KCR


మరిన్ని వార్తలు