తెలంగాణను వదలా : ఐదు పార్లమెంట్ సీట్లలో టీడీపీ పోటీ!

Submitted on 15 March 2019
TDP may field with 5 to 6 candidates in Telangana in Lok Sabha elections

ఇప్ప‌టికే తెలంగాణ‌లో లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ప్ర‌ధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్.. అభ్యర్ధులను రెడీ చేసుకుంటుంటే టీడీపీ మాత్రం తెలంగాణ ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆంధ్రలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీ అధిష్టానం తెలంగాణ ఎన్నికల మీద దృష్టి పెట్టలేదని అంటున్నారు. మహాకూటమి ఏర్పాటు చేసి దెబ్బ తిన్న నేపథ్యంలో ఈసారి అసలు తెలుగుదేశం పోటీ చేస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ‌లో పోయిన ప‌ట్టును కాపాడుకునేందుకు తెలుగుదేశం ప్రయత్నాలు మొదలుపెట్టింది.  లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఐదు స్థానాలలో ఒంటరిగా పోటీ చేయాలని తెలుగుదేశం భావిస్తుంది. మొత్తం 16పార్లమెంటు నియోజకవర్గాల్లో 5 లేదా 6 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తుంది.
Read Also: వైఎస్ వివేకా మృతి : అభ్యర్థుల ప్రకటన వాయిదా

లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరి స్థానాన్ని గెలుచుకోవాలని టీడిపి ప్ర‌త్యేక వ్యూహాంతో ముందుకెళ్తోంది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్లారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరపునే పోటీచేసి గెలిచినవారే. అలాగే మల్కాజ్‌గిరితో పాటు ఖమ్మం, మహబూబాబాద్, సికింద్రాబాద్, నాగర్‌కర్నూల్ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని టీడీపీ యోచిస్తుంది. ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కూడా కొలిక్కి వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో సీనియర్ నేత దేవేందర్‌గౌడ్‌ను నిలబెట్టాలని భావిస్తున్న టీడీపీ, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, సికింద్రాబాద్ నుంచి టీడీపీ సీనియర్ నేత విజయరావుకు టికెట్ ఇవ్వాలని భావించింది.

నామా కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇక్కడ మరో వ్యక్తిని తీసుకునే అవకాశం ఉంది. మ‌హబూబాబాద్, నాగ‌ర్ క‌ర్నూల్ అభ్య‌ర్థుల‌ ఎంపికపై చర్చలు జరుగుతున్నాయి. మ‌రో రెండు రోజుల్లో పార్టీ అధినేత చంద్ర‌బాబుతో స‌మావేశమై తెలంగాణ నేతలు పార్లమెంటు అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ కూడా ఇక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. మల్కాజిగిరి, ఖమ్మంలలో తెలుగుదేశం సపోర్ట్ ఉండే కాంగ్రెస్ అభ్యర్ధులను రంగంలోకి దింపుతుంది. ఖమ్మం నుంచి మాజీ తెలుగుదేశం ఎంపీ నామాను, మల్కాజిగిరి నుంచి మాజీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని దింపాలని భావిస్తుంది. 
Read Also: కత్తితో నరికారు : వివేకానందరెడ్డిని చంపేశారు

TDP
Telangana
Lok Sabha Elections
Elections2019

మరిన్ని వార్తలు