లాంఛనం పూర్తి : బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు

Submitted on 20 June 2019
tdp four rajya sabha mps join bjp

తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ సమావేశాల తొలి రోజే టీడీపీ నిలువునా చీలింది. అధిష్టానంపై నలుగురు రాజ్యసభ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్ తో నలుగురు ఎంపీలు టీడీపీకి ఝలక్‌ ఇచ్చారు. తాము టీడీపీని వీడినట్టు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడుకి ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేష్ లేఖ ఇచ్చారు. ఇకపై తమను టీడీపీ సభ్యులుగా కాకుండా ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని వెంకయ్యను కోరారు.

టీడీపీని వీడి ఈ నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. అనర్హత వేటు పడకుండా ఫిరాయింపు ఎంపీలు కొత్త ఎత్తు వేశారు. తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలంటూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యకి లేఖ అందించారు. ఈ నలుగురు ఎంపీలు ఇకపై బీజేపీ అనుబంధ సభ్యులుగా కొనసాగనున్నారు.

రాజ్యసభ సభ్యులు పార్టీ వీడటంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను చంద్రబాబు తప్పుబట్టారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ బీజేపీతో పోరాడిందన్నారు. పార్టీకి సంక్షోభాలు కొత్త కాదన్నారు. నేతలు, కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ టీడీపీలో సంక్షోభం నెలకొంది. పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి వెళ్లిపోయారు. నలుగురు సభ్యులు టీడీపీని వీడటంతో రాజ్యసభలో ఆ పార్టీకి ఇక మిగిలింది ఇద్దరు ఎంపీలే. దీంతో టీడీపీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోనుంది.రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రాజ్యసభలో బలం పెంచుకునేందకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో తమకు మద్దతిచ్చే ఏ ఎంపీని, పార్టీని వదులుకునేందుకు బీజేపీ ఇష్టపడటం లేదు. తమకు మద్దతిస్తామనే వాళ్లని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ 123. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం 75. ప్రస్తుతం నలుగురు ఎంపీలు ఖాళీ అయ్యారు. అమిత్ షా, స్మృతీ ఇరానీ లాంటి వాళ్లు రాజ్యసభ నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. ఎన్డీయే సంఖ్యా బలం 102గా ఉంది. 123 కావాలంటే ఇతర సభ్యుల మద్దతు కూడా కావాలి. కీలక బిల్లులు పాస్ అవ్వాలంటే రాజ్యసభలోనూ మెజార్టీ కావాలి. అందుకే ఇతర పార్టీల ఎంపీలను తమవైపు మళ్లించుకునే దిశగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. బీజేపీలోకి వస్తామంటే వెల్ కమ్ చెబుతోంది.

TDP
four mps
join
BJP
Sujana Chowdary
CM Ramesh
tg venkatesh
garikapati mohan rao

మరిన్ని వార్తలు