తందూరి చాయ్‌ : కరీంనగర్‌లో కొత్త ట్రెండ్

Submitted on 12 February 2019
Tandoori Chai in Karimnagar

కరీంనగర్‌ : ఉదయం నిద్రనుంచి మేల్కొనగానే ప్రతిఒక్కరు తాగేది చాయ్. పని ఒత్తిడిలో రిలీఫ్‌ కోసం, తలనొప్పి నుంచి ఉపశమనం కోసం కూడా చాయ్ తాగుతారు. ఇందులో అల్లం చాయ్, ఇరానీ చాయ్, మసాల చాయ్ లాంటి వెరైటీలున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మరోరకం చాయ్ ఫేమస్ అయింది. కరీంనగర్‌లో కస్టమర్లను క్యూ కట్టిస్తోంది. ఇంతకీ ఆ చాయ్ ఏంటంటారా..? అయితే ఓ లుక్కేయండి..
              
తందూరి రోటి, తందూరి చికెన్ లాంటి పేర్లు విన్నాం.. వాటి టేస్ట్ కూడా చూశాం. తాజాగా తందూరి జాబితాలోకి మరో సరికొత్త ఐటమ్ చేరింది. అదే తందూరి చాయ్. కరీంనగర్‌ మంకమ్మతోటలో తందూరి చాయ్ పేరిట ఉన్న ఈ హోటల్‌... పేరుకు తగ్గట్టే చాయ్ తయారుచేసి కొత్త  ట్రెండ్ సృష్టించింది. పట్టణంలో తెగ ఫేమస్ అయిపోయింది.
 
పట్టణానికి చెందిన హర్షద్, అసద్ సోదరులు... ఈ తందూరి చాయ్‌ని నగరవాసులకి రుచి చూపించారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ దీనికి ఫిదా అయిపోయారు. దీంతో ఈ హోటల్ నిత్యం కస్టమర్లతో కళకళలాడుతోంది.

తందూరి అంటే అరబిక్‌లో నిప్పులు అని అర్థం. నిప్పులపై తయారుచేస్తారు కాబట్టే దీనికి తందూరి చాయ్‌ అనే పేరొచ్చింది. ఓ కుంపటిలో బొగ్గులతో మంటపెట్టి..ఆ మంటల్లో చిన్నచిన్న కుండలను పెట్టి బాగా వేడిచేస్తారు. ఆ కుండ పూర్తిగా వేడెక్కాక... బాగా మరిగించిన చాయ్‌ని దానిలో పోస్తారు. అపుడు... ఆ కుండ నుంచి చాయ్ పొంగి బయటకు వస్తుంది. ఇలా పొంగిన చాయ్‌ని మట్టితో తయారు చేసిన ముంతల్లో పోసి కస్టమర్లకు అందిస్తారు. 

తందూరి చాయ్‌ టేస్టే వేరంటున్నారు చాయ్ ప్రియులు. మట్టిగ్లాసుల్లో చాయ్ తాగితే వచ్చే మజానే వేరంటున్నారు. చాయ్ ఎంత వేడిగా ఉన్నా.. మట్టి గ్లాసులో పోయడంవల్ల సులభంగా తాగ గలుతున్నామంటున్నారు మరికొందరు. మట్టి పాత్రలను ఉపయోగించడం ద్వారా శరీరానికి కూడా మేలు జరుగుతోందని చెబుతున్నారు. ఇఫ్పటివరకు చాయ్‌ని ప్లాస్టిక్ లేదా గాజు గ్లాసులలో తాగిన కరీంనగర్ జనం ప్రస్తుతం ఇలా మట్టి గ్లాసులో తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. 
 

Tandoori Chai
Karimnagar
costemor
fida

మరిన్ని వార్తలు