wide angle

16:03 - November 3, 2018

చైనా : అభివృద్దిలో దూసుకుపోతున్న దేశం. ప్రపంచలోనే అంత్యంత అధిక జనాభా వున్నా టెక్నాలజీలో కూడా మాదే పైచేయి అంటోంది చైనా. బిగ్గెస్ట్ నిర్మాణాలే కాదు స్మార్ట్ లోను మేమే స్మార్ట్ అంటోంది చైనా. గత కొంతకాలంగా శామ్‌సంగ్‌, ఎల్‌జీ, హువావే లాంటి సంస్థలు మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటి మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను చైనాకు చెందిన రాయొలే కార్పొరేషన్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే వీటన్నింటిని అధిగమించి రాయొలే ఈ ఫోన్‌ను తొలిసారిగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘ఫ్లెక్స్‌పై’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. 7.8 అంగుళాలతో మినీ ట్యాబ్‌లా ఉండే ఈ ఫోన్‌ను సగానికి మడతబెట్టొచ్చు. మడిచిన తర్వాత ఇది డ్యుయల్‌ స్క్రీన్‌ స్మార్ట్‌ఫోన్‌లా కనిపిస్తుంది. 
బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు
20మెగాపిక్సెల్‌ టెలిఫొటో లెన్స్‌
16మెగాపిక్సెల్‌ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ కెమెరాలు
రెండు కెమెరాలు బ్యాక్ సైడ్ 
20మెగాపిక్సెల్‌ కెమెరా సెల్ఫీ కెమెరా

ఇతర ఫీచర్ల విషయానికొస్తే.. 
క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8150 ప్రాసెసర్‌
6జీబీ లేదా 8జీబీ ర్యామ్‌
128జీబీ/256జీబీ/512జీబీ అంతర్గత మెమొరీ
3,800ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం 
అయితే మడతబెట్టినప్పుడు 20మెగాపిక్సెల్‌ కెమెరా సెల్ఫీ కెమెరాగా ఉపయోగపడుతుంది. దాదాపు 2లక్షల సార్లు పరీక్షించి ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశామని కంపెనీ చెబుతోంది.

ఇప్పటికే అమెరికా మార్కెట్లో ఈ ఫోన్‌ ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి. 128జీబీ ఇంటర్నల్‌ మెమొరీ సామర్థ్యం గల ఫోన్‌ ధర 1,318 డాలర్లు, 256జీబీ ఇంటర్నల్‌ మెమొరీ సామర్థ్యం గల ఫోన్‌ ధర 1,469డాలర్లుగా నిర్ణయించింది. డిసెంబరులో ఫోన్ల డెలివరీ చేయనున్నారు. మరి ఈ ఫోన్‌ భారత మార్కెట్లోకి ఎప్పుడొస్తుందో వేచిచూడాలి. కొత్తగా ఏది వచ్చినా ముందుగా భారత్ లోనే ఎక్కువగా మార్కెట్ జరుగుతుంది. మరి భారత్ లోని స్మార్ట్ ప్రియులను ఈ ఫోల్డింగ్ స్మార్ట్ ఫోన్ ఎంతరవకూ ఆకట్టుకుంటుందో వేచి చూద్దాం.
 

20:39 - January 18, 2018

ఎట్టకేలకు పద్మావత్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగాయి. కొన్ని రాష్ట్రాలు సినిమా విధించిన నిషేధంపై సుప్రీం కోర్టు సీరియస్ గా స్పందించింది. మీ ఇష్టం వచ్చిన్నట్టు చేస్తే కుదరదని సుప్రీం స్పష్టం చేసింది. అయితే కర్ణిసేన మాత్రం టికెట్లు కొని అయిన సినిమా నిలుపుదల చేస్తామని ప్రకటించింది. 

20:26 - January 12, 2018

మొత్తానికి కలిశారు.. కలిశారు. సరే.. దీనివల్ల ప్రయోజనమేంటి? ఏపీకి ఏం ఒరుగుతోంది? మూడున్నరేళ్లుగా విభజన తర్వాత అనేక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిందేంటి? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీయలేని రాష్ట్ర ప్రభుత్వం.., పైగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ల నోళ్లు నొక్కే రాష్ట్ర ప్రభుత్వం... ఏపీలో కనిపిస్తున్న తరుణం. ఇప్పుడు ఏడాది తర్వాత మోడీని కలిసిన చంద్రబాబు ఏపీకేమైనా ప్రయోజనాలు సాధించారా? లేక రాజకీయ ప్రయోజనాలకోసమే కలిశారా? ఈ అంశంపై టెన్ టివిలో ప్రత్యేక కథనం..

ప్రత్యేక హోదా కంటే ఎక్కువే సాయం చేస్తామంటూనే.. దాటవేత కబుర్లు.. కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ..పాడిందే పాడుతూ కేంద్రం ఏపీకి దారుణంగా మొండిచేయి చూపిందనే విమర్శలు. మరోపక్క ప్రజల పక్షాన ఉంటూ ప్రజల ఆకాంక్షలను కేంద్రానికి వినిపించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం సైలెంట్ గా చోద్యం చూస్తున్న తీరు స్పష్టం. ఈ క్రమంలో జరిగిన తాజా భేటీ ఆసక్తికరంగా మారింది. పోలవరానికి నిధులు ప్రవహిస్తాయా? రైల్వేజోన్ శాంక్షన్ అవుతుందా? రాజధానికి నిధులొస్తాయా? విద్యాసంస్థలు వచ్చేస్తాయా? చంద్రబాబు, మోడీ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? మోడీపై నమ్మకం, ఏపీ ప్రయోజనాలే ముఖ్యం అంటున్న చంద్రబాబు, ఏపీకి ఆశించిన ప్రయోజనం లేకుంటే బీజేపీతో తెగతెంపులకు సిద్ధమౌతారా? మోడీ అపాయింట్మెంట్ చంద్రబాబుకు కష్టంగా దొరికిందా? ఏపీకి న్యాయంగా రావలసిన వాటిని గట్టిగా అడగలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారా?కేంద్రంలో చక్రం తిప్పే నేతగా ప్రొజెక్ట్ అయిన చంద్రబాబు వాయిస్ ఎందుకు తగ్గింది? అసలీ పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసమా? లేక రాష్ట్ర హితం కోసమా? సమస్యలు స్పష్టంగా ఉన్నాయి..పరిష్కారం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు..న్యాయంగా రావలసింది ఆశిస్తున్నారు.. కానీ, మొండి చేయి.. చెంబుడు మట్టి కాసిన్ని నీళ్ళు ఇచ్చి వాటితో ఎడ్జస్ట్ కావాలన్న కేంద్రం మూడున్నరేళ్లు గడుస్తున్నా ఏపీకి ఒరగబెట్టింది ఏం లేదు.. మరి ఈ భేటీ తర్వాతేమైనా పరిస్థితి మారుతుందా? ఏపీకి కాస్తైనా ఉపయోగం ఉంటుందా?

సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు నిర్వచించబడే ఉంటాయి. అందులోనూ కొత్తగా ఏర్పడే రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధను కేంద్రం చూపెట్టాల్సిందే. కానీ, విభజన తర్వాత ఏళ్లు గడుస్తున్నా ఏపీని పట్టించుకోని కేంద్రాన్ని నిలదీసి తమ హక్కుగా రావలసింది సాధించుకోవాలి. కానీ, ఏపీ సర్కారు ఈ విషయంలో ఏ మాత్రం ముందుకు వెళ్లటం లేదు. ఇప్పుడు ఈ నామ్ కే వాస్తే మీటింగ్ తో ఒరిగేది అంతకంటే ఏ మాత్రం లేదు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:21 - January 11, 2018

గేట్లెత్తేశారు..తలుపులు బార్లా తెరిచారు..రావటానికి పోవటానికి ఎలాంటి అడకడంకులు లేకుండా చేసేశారు. దీని ఫలితం ఎలా ఉండబోతోంది? రిటెయిల్ రంగంపై ఇది చావుదెబ్బ కొట్టుందా? మన ఎయిర్ ఇండియాపై విదేశీ శక్తులు పట్టు బిగిస్తాయా? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీయనుంది ? ఈ అంశంపై టెన్ టివి ప్రత్యేక కథనం… ఓడమల్లన్న బోడిమల్లన్న సామెతను అక్షరాలా పాటిస్తున్నారు..విపక్షంలో ఉన్నంతకాలం వ్యతిరేకిస్తున్నాం.. అంటూ కబుర్లు చెప్పి..ఇప్పుడు ఏకంగా అన్ని అడ్డంకులు తొలగించేస్తున్నారు. బడాకంపెనీల సేవల మత్తులో, పెద్దన్న పూజలో పడి.. మన వ్యాపారుల బతుకులను, వారి ఉపాధిని ప్రశ్నార్ధకం చేస్తున్నారు. రిటెయిల్ రంగంపై మోడీ క్యాబినెట్ నిర్ణయం తీవ్రప్రభావం చూపనుందా? చిల్లర వ్యాపారులు, వర్తకుల ఉపాధిపై దెబ్బకొట్టే ప్రమాదం పొంచి ఉందా? బడాకంపెనీలు విచ్చలవిడిగా విస్తరించనున్నాయా? స్థానిక వ్యాపారుల పొట్ట కొట్టే నిర్ణయాలు మోడీ సర్కారు తీసుకుంటోందా?

మాటలకు స్వదేశీ.. చేతలకు విదేశీ..నోరుతెరిస్తే దేశభక్తి వరదలా ప్రవహిస్తుంది.. కానీ, నిర్ణయాల్లో మాత్రం విదేశీ భక్తి అడుగడుగునా స్పష్టమౌతుంది. కాకులను కొట్టి గద్దలకు వేసే ఈ నిర్ణయాలు ఎవరికోసం? ఎవరి ప్రయోజనాల కోసం..? మన వ్యాపారాలను, మన ఉపాధిని ప్రశ్నార్ధకం చేసే తప్పుడు నిర్ణయాలు ఎందుకోసం?

మన ఇంటి తాళాలు ఊరు పేరు తెలియని వారికివ్వటానికి, నూరుశాతం ఎఫ్డీలకు అనుమతింటానికి పెద్ద తేడా ఏం లేదు. నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులకు తావిస్తే జరిగే పరిణామాలు అత్యంత ప్రమాదకరం.. దేశాన్ని నడిరోడ్డున నిలబెట్టి.. ఎవడిదారిన వాడు రావచ్చు పోవచ్చు అంటే నష్టం ఎవరికి? ఇది దేశ సుస్థిరతను, ఆర్ధిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తుందనటంలో సందేహం లేదు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:57 - January 10, 2018

సంక్షుభిత సమయాలు పరిష్కారాలకోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తాయి. అణచివేత ఆకాశాన్నంటితే పాతాళాన్ని చీల్చుకుంటూ కత్తుల చేతులు, నిప్పుల స్వరాలూ దూసుకొస్తాయి. వివక్షను బోధించిన విలువలతో దేశాన్ని అధోగతి పాల్జేస్తామంటే నిజమైన దేశభక్తి అంటే ఏంటో కొత్త పాఠాలు మొదలవుతాయి. పరిష్కారాల దిశగా దూసుకెళ్లే పావన నవజీవన బృందావన నిర్మాతలుగా కొందరు నవయువకులు తెరపైకివస్తారు.. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాయా లేక మనుస్మృతిని నెత్తిన పెట్టుకున్నాయా అనే సందేహం వచ్చినపుడు యువ హుంకార్ అంటూ ఏకమవుతారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం గురించి ప్రత్యేక కథనం..ఓ చేతిలో రాజ్యాంగం.. మరో చేతిలో మనుస్మృతి..ఏది కావాలి? ఏది అనుసరిస్తారు..?

హక్కులను, రక్షణలను, సమానత్వాన్ని ప్రసాదించిన రాజ్యాంగాన్నా లేక వివక్షను, అణచివేతను బోధించిన సమాజాన్ని పీడనతో నింపిన మనుస్మృతినా? ఏది కావాలి మీకు? ఇదే యువ హుంకార్ వేసిన ప్రశ్న..హస్తినలో యువ హుంకార్‌ ర్యాలీ గర్జించింది. మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసింది. అవినీతి, పేదరికం, నిరుద్యోగం లాంట ప్రధాన సమస్యలను పక్కన బెట్టి.. ఘర్‌ వాప్‌సి, లవ్‌ జిహాద్‌ లాంటి అంశాలకు ప్రాధ్యనత నిస్తోందని మండిపడింది. దేశానికి మనువాదం ముప్పు పొంచి ఉందని యువతను హెచ్చరించింది. సామాజిక న్యాయం కోసం తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

అడుగడుగునా పోలీసుల నిర్బంధం.. వాటర్ కెనాన్లు, బారికేడ్లు, లాఠీలు...భాష్పవాయుగోళాలు.. వీటన్నిటి మధ్య పార్లమెట్ స్ట్రీట్ లో పెద్ద సంఖ్యలో యువత ఏకమయింది. దళిత, మైనార్టీ వర్గాలపై వివక్ష ఆపాలని, యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని, విద్యార్థి హక్కులను కాపాడాలని, లింగ సమానత్వం కావాలని..., భీమ్‌ కొరెగావ్‌లోని దళితులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాజధానిలో యువత ఏకస్వరమయింది.

మాకు స్వాతంత్ర్యం కావాలి. విముక్తి కావాలి. దేశంలోపల కోట్లాది ప్రజలను పట్టి పీడిస్తున్న సకల సమస్యలనుండి మాకు విముక్తి కావాలి. ప్రజలంతా సమానమనే వ్యవస్థ సిద్ధించాలి. దానికి అడ్డుగా ఉన్న విలువలు, నమ్మకాలు వాటి మూల సిద్ధాంతాలపై పోరాటం చేస్తూనే ఉంటాం.. గెలుపు దక్కేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ క్రమంలో సకల రోగాలకు కారణమైన మనుస్మృతిని వ్యతిరేకిస్తాం.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం.. ఇదీ యువ హుంకార్ ర్యాలీ ఇస్తున్న సందేశం.. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:39 - January 3, 2018

సమాజం చిమ్మ చీకట్లో మగ్గే కాలంలో వెలుగు వైపు నడిపించే క్రాంతదర్శి కావాలి..బానిస సంకెళ్లు పట్టి పీడించే కాలంలో వాటిని తెగ్గొట్టే ధీరులు కావాలి.. స్త్రీలోకాన్ని దురాచారాలు అణచివేసే కాలంలో ధైర్యంగా తలెత్తి చూసే యోధురాలు కావాలి.. అక్షర జ్ఞానం అందని కాలంలో బతుకులో వెలుగు నింపే ఉపాధ్యాయురాలు కావాలి. అలా మన చదువుల తల్లి.. మెరిసిన మొదటి అక్షరం.. మన చదువుల దేవత.. ఈ దేశ మహిళలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అక్షర జ్ఞానమే బతుకునిస్తుందని చెప్పని త్యాగశీలి సావిత్రీ బాయ్ ఫూలే... 187వ జయంతి సందర్భంగా వైడాంగిల్ ప్రత్యేక కథనం..

ఆమె కదిలితే అక్షరం మెరిసింది. ఆమె మాట్లాడితే స్వేచ్ఛా గానం వెల్లివిరిసింది. ఆమె అంటే చదువు.. ఆమె అంటే వెలుగు.. ఆమె అంటే ముందడుగుఆమె అంటే తిరుగుబాటు.ఆమెఅంటేపోరాటం.ఆమెమనతొలిఉపాధ్యాయురాలు తొలిఅధ్యాపకురాలు.సామాజిక సేవకురాలు..సమాజం మారాలని మాటలు చెప్పకుండా చేతలతో చూపిన వనిత..స్త్రీలోకపు ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ధీర..మాతృహృదయంతో సమాజానికి ప్రేమ పంచిన మహనీయురాలు సావిత్రీ బాయ్ ఫూలే..ఆకాశంలో సగం అంటూ మాటలకే పరిమితమౌతున్న కాలం..

అందని ఆకాశం కాదు.. కింద నేలమీద సగం కావాలి..అలాంటి స్ఫూర్తిని తన జీవితం ద్వారా రగిలించారు సావిత్రీ బాయ్ ఫూలే..హక్కులను నిరాకరిస్తూ.. మహిళల పట్ల చిన్న చూపు చూసే సమాజంలో మార్పు రావాలని తపించిన తొలి అధ్యాపకురాలు సావిత్రీ బాయ్ ఫూలే..మార్పు సాకారమయిందా?మహిళలు వివక్షను అధిగమించి దూసుకెళ్తున్నారా..?పైపైన చూస్తే చాలా మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ, రూపు మార్చుకునే వివక్ష స్త్రీని వస్తువులా చూస్తూనే ఉంది. అలాంటి సమయంలో సావిత్రీ బాయ్ ఫూలు జీవితం మనకు ఆదర్శం కావాలి. ఆమె అడుగు జాడల్లో మహిళా లోకం, ఈ సమాజం ఉద్యమించాలి. స్వేచ్ఛా సమానత్వాలకోసం పోరాడాలి. 

20:55 - January 2, 2018

నా దారి రహదారి.. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా... దేవుడు శాసిస్తాడు.. నేను చేస్తాను..ఇవన్నీ రజనీ దశాబ్దాలుగా చెప్తున్న మాటలు. ఇప్పుడు మాటలనుంచి చేతల సమయం వచ్చింది. పొలిటికల్ ఎంట్రీ ప్రకటనతో ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లో కలకలం రేగింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి తమిళ రాజకీయాల్లో రజనీ ఎలాంటి ప్రభావం చూపిస్తారు.సూపర్ స్టార్ రజనీకాంత్....సినిమాల్లోనే కాదు.. తమిళనాట ఈ పేరు అన్నిరకాలుగా ప్రభంజనమే. కోట్లాది అభిమానులున్న ఈ సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ప్రకటనతో సీన్ ఒక్కసారిగా వేడెక్కింది. జయ మరణం తర్వాత అనేక మలుపులు తిరుగుతున్న తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యాన్ని ఇప్పుడు రజనీ భర్తీ చేస్తాడా? ఆయన దారి రహదారి. సినిమా డైలాగే కానీ... రజనీ తీరుని చెప్తుందని ఫ్యాన్స్ నమ్మకం. మరి ఇది సినిమాల వరకేనా, లేక పాలిటిక్స్ లో కూడానా? ఇప్పుడు రజనీకాంత్ ఎంట్రీ తో పరిస్థితులు ఎలా మారతాయి..? డీఎంకే, అన్నా డీఎంకే లను చావు దెబ్బతీస్తారా? లేక విపరీతమైన హైప్ తో వచ్చి చతికిల పడిన కొందరు నటుల్లా రజనీ మిగిలిపోతారా? ప్రకటించేశాడు..వెబ్ సైట్ ప్రారంభించేశాడు..అభిమానులను సన్నద్ధం కావాలంటూ పిలుపునిచ్చాడు..ఏం చేస్తానో చెప్తాను.. చేయలేకపోతే రాజీనామా చేస్తాను అంటున్నాడు.. రెండు దశాబ్దాల ఉత్కంఠకు తెరదింపాడు..

రేపెవరిది... ఇదే తమిళనాడులో వినిపిస్తున్న ప్రశ్న. ఈ రోజు ఎవరేంటో అందరికీ తెలుసు..కానీ, రేపటిని గెలుచుకునేదెవరు? ప్రజల గుండెల్లో పాగా వేసేదెవరు? అధికార పీఠాన్ని అధిరోహించేదెవరు? ఇవే తమిళనాడులో వినిపిస్తున్న ప్రశ్నలు. ఈపీఎస్, ఓపీఎస్, శశికళ, స్టాలిన్ మొదలైన రెగ్యులర్ ప్లేయర్స్ తో పాటు, లేటెస్ట్ గా రజనీ, ఈ మధ్యే ఉత్సాహంగా మారిన కమల్ లాంటి స్టార్ హీరోలు.. కనిపిస్తున్న ఫీల్డ్ లో పైచేయి ఎవరు సాధించబోతున్నారు? ఆల్రెడీ ఈ బాటలో ఉన్న నటులు ఏం సాధించారు. అది ఇప్పటి చరిత్ర కాదు.. దశాబ్దాల నుండి పీఠంపై సినీ తారలనే కూర్చోబెడుతున్నారు. అక్కడ ఫిల్మ్ స్టార్స్ కే పట్టంకడుతున్నారు. దక్షిణాదినే కాదు.. ఆ మాటకొస్తే, దేశం మొత్తంమీద కూడా ఆ రాష్ట్ర రాజకీయాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ వరుసలో రజనీ పాలిటిక్స్ లో ఎంటరైతే దుమ్మురేపటం ఖాయమా? సినీ నటుల తళుకుబెళుకులే ప్రధానంగా నిలుస్తున్నతమిళ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నవాళ్లంతా ఇమేజ్ వాడిపోయిన తారలే. ఇలాంటి సందర్భంలో రజనీ ఎంట్రీ ఇస్తే అది... చెప్పుకోదగ్గ మార్పులకు కారణం అవుతుందా...రాజకీయ శూన్యం నుండి కొత్త శక్తులు పుట్టుకురావటం కొత్త విషయం కాదు.. వివిధ రాష్ట్రాల రాజకీయాల్లో దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాట అదే దృశ్యం కనిపిస్తోంది. మరి దీనిని రజనీకాంత్ తనకు అనుకూలంగా మలుచుకుంటాడా, అభిమానుల ఆశలు నెరవేరుస్తాడా అనే అంశం త్వరలో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

21:53 - December 29, 2017

హిట్టనుకున్నారు.. ఫట్టయింది. చిన్న సినిమా అనుకున్నారు.. కలెక్షన్లలో భారీ అని రుజువయింది. ఆ హీరో కథ ముగిసింది అనుకున్నారు..కాదు.. మళ్లీ మొదలయిందని తేలింది.కసిపెట్టి తీశారు.. ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు...టాక్ నెగెటివ్ గా వినపడింది.. కలెక్షన్లు పాజిటివ్ గా వచ్చాయి.. ఇదీ సింపుల్ గా తెలుగు సినిమాకు 2017 మిగిల్చిన గుర్తులు.. ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. 2017లో రెండు సినిమాలు విపరీతమైన హైప్ తో వచ్చాయి. ఒకటి మెగాస్టార్ 150 వ చిత్రం.. మరొకటి బాహుబలి2. కట్టప్పను చంపిందెవరో తెలుసుకోటానికి ప్రేక్షకులు ఆరాటపడ్డారు. ఫలితం మెగా హిట్ గా నిలిచింది బాహుబలి. ఇక పోస్టర్ నుంచి సినిమా రిలీజ్ వరకు... ఆ తర్వాత. ఆద్యంతం వివాదాస్పదంగా నిలిచిన అర్జున్ రెడ్డి అనూహ్యంగా ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఈ ఏడాది సత్తా చాటిన మరో భారీ చిత్రం ఖైదీ నంబర్ 150. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి తన కలెక్షన్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక జనతా గ్యారేజ్ లాంటి భారీ విజయం తరువాత ఎన్టీఆర్ నటించిన సినిమా జై లవకుశ రిలీజ్ కు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టు కథా కథనాలు సాగటంతో ఈ సినిమా ఘనవిజయం సాధించింది.

టాక్ తో సంబంధం లేదు.. టాక్ ఫ్లాప్ అంటుంది. కలెక్షన్లు మాత్రం రివర్స్ లో ఉంటాయి. అవును.. 2017లో టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు తమ అభిమాన హీరోలపై కనకవర్షం కురిపించారు. సినిమాలకు ఫ్లాప్ టాక్.. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం తగ్గలేదు.. ఈ ఏడాది చిన్న సినిమాలకు బాగా కలిసొచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. ఎవరూ ఊహించని విధంగా 50 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టి స్టార్ హీరోలకు కూడా షాక్ ఇచ్చాయి. అదే సమయంలో చాలా కాలంగా హిట్ చూడని హీరోలు కొందరికి 2017 బంపర్ హిట్ లను అందించింది. ఓ పక్క రొటీన్ సినిమాలు వెల్లువెత్తుతున్నా, మంచి సినిమా వచ్చిందంటే ప్రేక్షకులు ఆదరించటం సహజంగా జరిగే విషయం. 2017లోనూ అదే జరిగింది. కొన్ని అంచనాలు మించాయి. కొన్ని బోల్తా కొట్టాయి. కొన్ని ఓ రేంజ్ లో కలెక్షన్ల వర్షం సాధించాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు లైఫ్ ఉందని ప్రూవ్ అయింది. ఈ ఉత్సాహంతో ఇండస్ట్రీ 2018వైపు ఆశావహంగా అడుగులు వేస్తోంది.

 

20:21 - December 28, 2017

ఆకాశాన్నంటుతున్న ధరలు.. భారమైపోయిన సామాన్యుడి బతుకు... హక్కుల కోసం ఉద్యమాలు.. అస్థిత్వం కాపాడుకునే ఆరాటం.. ప్రజల బాగోగులు చివరి ప్రాధాన్యతగా పెట్టుకున్న ప్రభుత్వాలు.. పైపై మెరుగులు తప్ప సామాన్యుడి బతుకును నిర్లక్ష్యం చేసే విధానాలు..దళితులపై పెరుగుతున్న దాడులు.. పరువు కోసం హత్యలు...విదేశీ సదస్సుల ఆడంబరాలు... పరిమళించిన తెలుగు ఉత్సవాలు.. పరుగులెత్తుతున్న మెట్రో రైలు, రికార్డుల బాహుబలి2 ఇవీ 2017లో తెలుగు ప్రజలు చూసిన అనుభవాలు.. ఇలాంటి ఘటనల సమాహారంగా రెండు రాష్ట్రాల్లో జరిగిన ముఖ్యాంశాలపై ప్రత్యేక కథనం..

హోరెత్తే ప్రచారం.. ఘాటైన విమర్శలు..పదునైన కామెంట్లు..దుమ్మురేపిన రోడ్ షోలు.. మీటింగ్ లు..వెరసి గెలుపుకోసం అంతులేని ఆరాటం.. సెమీఫైనల్ గా భావించిన నంద్యాల ఉపఎన్నిక ఏపీలో హడావుడి చేసింది. ఎప్పుడెప్పుడా అని నగరవాసి ఎదురు చూసిన మెట్రో రైలు నగరంలో పరుగులు తీస్తోంది. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా, కాలుష్యానికి దూరంగా, సౌకర్యవంతమైన ప్రయాణంతో, మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మెట్రో టికెట్టు ధరలపై మాత్రం విమర్శలు ఎక్కువవుతున్నాయి..పాదయాత్రలు అధికారాన్ని తెచ్చిపెట్టాయి. ప్రజలకు దగ్గరచేశాయి.. పాదయాత్ర పునాదిగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అది చరిత్ర. ఇప్పుడు ఏపీలో మహాసంకల్ప యాత్ర నడుస్తోంది.. దీంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రజాసంకల్ప యాత్రతో తన సంకల్ప సాధన కోసం జగన్ ప్రయత్నాలు 45 రోజులుగా సాగు

హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న మహాసభలకు ప్రపంచ నలుమూలలా నుంచి అనేకమంది భాషాభిమానులు, సాహితీవేత్తలు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై... జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాలనుంచి 400 మంది భాషాభిమానులు.. మొత్తం ఉత్సవాలకు 8 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారయ్యారు. పవిత్ర సంగమం కాస్తా విషాద సంగమమయింది. గతేడాది గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలిగొన్న ఘటన ఇంకా కళ్లముందు నుంచి చెరిగిపోలేదు. దానిపై విచారణ ఇప్పటికీ అతీగతీ లేదు. ఈ లోగా కృష్ణా నదిలో ఈ ప్రమాదం జరిగింది.. ఇక కార్తీక మాసంలో పవిత్ర సంగమం వద్ద జనం పోటెత్తుతారని తెలిసినా యంత్రాంగం అప్రమత్తం కాని తీరు స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో బినమా పేర్లతో అక్రమ అనుమతులతో బోట్లు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నేతల తీరు కూడా తెరపైకి వచ్చింది.

నగరవాసులంతా ఇవాంకా రావా మా వంక అని పిలిచారు. ఇవాంక వస్తే చాలు.. తమ ప్రాంత చిత్రంలో కాస్తయినా మార్పు వస్తుందని భావించారు. ఇన్నేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నం.. అప్పుడెప్పుడో బిల్ క్లింటన్ వస్తున్నాడని చంద్రబాబు హడావుడి చేసిన తర్వాత.. మళ్లీ ఇప్పుడు కెసీఆర్ హయాంలో ఈ హడావుడి కనిపిస్తున్నదని చెవులు కొరుక్కుంటున్నారు నగర వాసులు.. జీఈఎస్ ఘనంగా నిర్వహించారని తెలంగాణ సర్కారు క్రెడిట్ పొందినా, నగరంలో మౌలిక సదుపాయాల విషయంలో మామూలు సమయంలో చూపే నిర్లక్ష్యం కూడా తెరపైకి వచ్చింది.

ఇండియన్ సెల్యులాయిడ్ పై ఆవిష్కృతమైన భారీ చిత్రం.. కనీవినీ ఎరుగనంత భారీ బడ్జెట్.. ఎన్నో అంచనాల మధ్య.. మరెంతో ఉత్కంఠను రేకెత్తించి, లక్షలాది ప్రేక్షకులను అలరించింది. మగధీర, ఈగ బాటలోనే బాహుబలి వన్ బాటలోనే బాహుబలి2 కూడా సత్తా చాటింది. 2017 ఏప్రిల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. పోలవరం ప్రాజెక్టు అంచనాలు దాటుతోంది. టార్గెట్ సమయం దాటుతోంది..నిధుల కొరత వేధిస్తోంది..పనులు ఆగిన పరిస్థితి కనిపిస్తోంది.. మొత్తానికి 2017లో పోలవరం పరిస్థితి అంతంత మాత్రంగానే సాగిందని చెప్పాలి.. తెలుగు రాష్ట్రాల్లో దళితులపై, బహుజనులపై దాడులు మరింత పెరిగాయి.. కులం దన్ను, రాజకీయ బలం, ఆర్ధిక బలాన్ని చూసుకుని కొందరు పేట్రేగి పోతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో పరువు హత్యలు కూడా పెరుగుతున్నాయి. 2017లో నరేశ్, మధుకర్ ల హత్యలతో పాటు, గరగపర్రు ఘటన సంచలనం కలిగించాయి..

చంద్రన్న మాల్స్‌ ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు, గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు తక్కువ ధరలకు వస్తాయా? అలా వస్తాయంటూ చెప్తున్న సీఎం మాటల్లో నిజమెంత? చంద్రన్న మాల్స్‌తో ప్రజలకు జరిగే మేలు కన్నా, కార్పొరేట్లకు చేకూరే లబ్ధి ఎక్కువా? రిలయన్స్ లాంటి సంస్థలు ఒక్క రూపాయి పెట్టుబడి కూడా పెట్టకుండా గ్రామీణ ప్రాంతాల్లో దందాకు దిగుతున్నాయా? దానికి ఏపీ సర్కారు వత్తాసు పలుకుతోందా? ప్రజాపంపిణీ వ్యవస్థకు తూట్లు పొడిచే పనికి 2017లో ఏపీ సర్కారు దిగింది.
ఇవీ 2017లో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ముఖ్య ఘటనల వివరాలు. గుర్తు చేసుకోవలసిన అంశాలు.. అనంత కాల గమనంలో మరో వసంతం గడిచిపోతోంది. 2018 రెండు రాష్ట్రాల్లో శాంతి, సామరస్యాలు నెలకొని, ప్రజలకు మంచి జరగాలని ఆశిద్దాం. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

20:49 - December 27, 2017

ఈ సంవత్సరంలో ఏడు రాష్ర్టాల్లో ఎన్నికలు జరగడం, శశికళ జైలు వెళ్లాడం, లాలూ జైలు వెళ్లాడం, దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోవడం, జీఎస్టీ అమలు పై రివైండ్ 2017. గత సంవత్సంర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థనే క్షిణించింది. గుజరాత్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప తేడా గెలిచింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - wide angle