west godavari

09:25 - September 8, 2018

తూర్పు గోదావరి : ఓట్లేశారు.. కానీ వారి పాట్లు పట్టించుకునే వారే కనిపించడం లేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలొస్తున్నాయి. ఎవరికి ఓటేయాలో కూడా తెలియని సందిగ్ధంలో పడ్డారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణా నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలిపేయడంతో ఇప్పుడు 6మండలాల ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని విలీన మండలాల పరిస్థితి ఆయోమయంగా ఉంది.
తెలంగాణలోని ఆరు మండలాలు ఏపీలో విలీనం
ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణాకి చెందిన భద్రాచలం డివిజన్ లోని ఆరు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపేశారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాలను పశ్చిమ గోదావరిలో విలీనం చేయగా, చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాలను తూర్పు గోదావరిలో కలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంకి రాకుండా కేంద్రం ఆర్డినెన్స్ రూపంలో తీసుకున్న ఈ నిర్ణయానికి తాను పట్టుబట్టడమే కారణమని చంద్రబాబు అప్పట్లో పదే పదే చెప్పుకున్నారు.
గందరగోళంగా ఆ నియోజకవర్గాల పరిస్థితి 
ఐతే.. నాలుగేళ్లు గడిచిపోయినా ఆ నియోజకవర్గాల పరిస్థితి మాత్రం ఇంకా గందరగోళంగానే ఉంది. భద్రాచలం నియోజకవర్గంలో ఓట్లేసిన వారిని ఏపీలో కలిపేయడంతో అటు తెలంగాణా నుంచి నిధులు రాక, ఇటు ఏపీ సర్కారు పట్టించుకోక రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యారు. చివరకు విద్య, వైద్య అవసరాలు తీర్చడానికి కూడా తగిన నిధులు లేకపోవడంతో మన్యం వాసులు నరకం అనుభవించారు. వచ్చే ఎన్నికల తర్వాతైనా తమకు కొంత ఉపశమనం దక్కుతుందని ఆశించిన విలీన మండలాల ప్రజలకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మరింత షాక్‌నిస్తున్నాయి. తాజాగా తెలంగాణా అసెంబ్లీ రద్దయ్యింది. ఎన్నికలకు సిద్దమవుతోంది. దీంతో భద్రాచలం నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చింతూరు డివిజన్ జాబితాను చేర్చడం కలకలం రేపుతోంది. తమను మళ్లీ తెలంగాణాలో ఓటేయాలని చెప్పడం ఏవిధంగా సమంజసమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చివరకు రద్దయిన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన సున్నం రాజయ్య కూడా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. విలీన మండలాల ప్రజల ఓట్లను ఆంధ్రప్రదేశ్ జాబితాలో చేర్చడంలో చేసిన జాప్యం కారణంగానే ప్రస్తుత పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నాయి. 
విలీన మండలాల వ్యవహారంపై అస్పష్టత
విలీన మండలాల వ్యవహారంలో స్పష్టత లేకపోవడం చాలామందిని గందరగోళానికి గురి చేస్తోంది. కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని రెవెన్యూ పరంగా ఏపీలో ఉన్న మండలాల ఓట్లను ఏపీలోనే కలపాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి భిన్నంగా ఓట్లను తెలంగాణా అసెంబ్లీకి వేసి, పాలన ఏపీలో అంటే ఎటూ కానివాళ్లుగా ముంపు మండలాల ప్రజలు మిగిలిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఈ విషయంలో ఏ ప్రభుత్వం తీసుకుంటుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. 

 

09:21 - August 31, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన తంగెళ్లమూడి కబాడిగూడెంలో చోటు చేసుకుంది. సతీష్ అనే వ్యక్తిపై గురువారం రాత్రి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. నలుగురు దాడి చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. తీవ్రగాయాలపాలైన సతీష్ ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

15:43 - August 23, 2018

పశ్చిమగోదావరి : భీమవరంలో జివిఎన్‌ కాలువకు గండి పడింది. యనమదుర్రు డ్రైవ్‌ నుంచి వరద నీరు జివిఎన్‌ పం టకా లు వలోకి ప్రవహించడంతో భారీ గండి పడింది. దీంతో పంటకాలువకు సమీపంలోని సుమారు 200 ఎకరాలు నీటమునిగాయి. ప్రస్తుతం వరద నీరు భీమవరంలోని బ్యాంక్‌ కాలనీవైపు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గండి పడ్డ ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గ్రంధి శ్రీనివాస్‌ సహాయక చర్యలుచేపట్టాలని కోరారు. 

21:39 - August 22, 2018

అమరావతి : భారీ వర్షాలు, వరదలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. హెక్టారుకు పాతికవేల రూపాయల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ పైర్ల సాగుకు సహాయం చేస్తామని తూర్పుగోదావరి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.

తూ.గో. జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే
ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎరియల్‌ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. గ్రామాల్లో నిలిచివున్న వరదనీటిని చూసి చలించిపోయారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను అన్ని విధాల ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

తూ.గో.జిల్లాలో 6,600 హెక్టార్లలో పంటనష్టం
తూర్పుగోదావరి జిల్లా 19 మండల్లాలోని 45 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరార్శించిన చంద్రబాబు.. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాజమండ్రి విమానాశ్రయంలో వరద నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం 6,600 హెక్టార్లలో పంటనష్టం జరిగినట్టు నివేదించారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు పాతికవేల రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఉభయగోదావరి జిల్లాల్లో 600 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్టు అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎర్రకాల్వ పొంగిపొర్లడంతో ఎక్కువ నష్టం జరిగినట్టు తేల్చారు. ఎర్రకాల్వ ముంపు సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆర్‌ అండ్‌ బీ రోడ్ల మరమ్మతులకు 35 కోట్ల రూపాయాలు కేటాయిస్తున్నట్టు చెప్పారు.

ఇంతవరకు 1500 టీఎంసీల గోదావరి నీరు సముద్రం పాలు
కోస్తా జిల్లాలు వరదలతో తల్లడిల్లుతుంటే.. రాయసీమ నాలుగు జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరవు ఉన్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ సీజన్‌లో ఇంతవరకు 1500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంపాలు కావడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో పోలవరం పనులకు ఆటంకం ఏర్పడిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. వచ్చే ఏడాది మే నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇంతవరకు 57.5 శాతం పనులు పూర్తైన విషయాన్ని ప్రస్తావించారు. పోలవరం కోసం చేసిన ఖర్చులో కేంద్రం నుంచి ఇంకా 2,600 కోట్ల రూపాయల రావాల్సి ఉందన్నారు. నిర్మాణ బాధ్యతలను పూర్తిగా కేంద్రం తీసుకున్నా అభ్యంతరంలేదని చంద్రబాబు చెప్పారు.

ప్రాజెక్టు నిర్మానానికి ప్రతిపక్షాలు అవరోధాలు : చంద్రబాబు
మరోవైపు ప్రాజెక్టు నిర్మానానికి ప్రతిపక్షాలు అవరోధాలు సృష్టిస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో 57 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని, 16 పూర్తయ్యాయని చంద్రబాబు వివరించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు విపక్షాలకులేదని మండిపడ్డారు.వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే, పంటనష్టంపై సమీక్ష నిర్వహించిన తర్వాత చంద్రబాబు రాజమండ్రి నుంచి అమరావతి బయలుదేరి వెళ్లారు. 

20:18 - August 22, 2018

తూర్పుగోదావరి : వరదలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. హెక్టారుకు పాతిక వేల రూపాయల పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన చంద్రబాబు... ముంపును పరిశీలించారు. మొత్తం 6,600 హెక్టార్లలో పంటనష్టం జరిగినట్టు అధికారులు నివేదించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులను ముఖ్యమంత్రి పరామర్శించారు. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎర్రకాల్వ ప్రాజెక్టు పొంగిపొర్లడంతో ఎక్కువ నష్టం జరిగిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, కాజ్‌వేలు మరమ్మతులుకు నిధుల కేటాయిస్తామని చెప్పారు. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి విపక్షాలు సృష్టిస్తున్న అడ్డంకులను అధిగమించి... ముందుకుసాగుతున్నామని చంద్రబాబు చెప్పారు. 

20:16 - August 21, 2018

పశ్చిమగోదావరి : గోదవరి జిల్లాలో భారీ వర్షాలకు ఎర్రకాలువ పొంగి పొర్లుతోంది. దీంతో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, వారికి భరోసానిచ్చేందుకు మంత్రులు వరద ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు మంత్రులకు ఓ ట్రాక్టర్ ను ఏర్పాటు చేశారు. దీనిపై ప్రయాణిస్తుండగా ట్రాక్టర్ ఓ పక్కకి ఒరిగిపోయింది. దీంతో మంత్రులు పై నుండి మోకాలు లోతులో వున్న వరద నీటిలో పడ్డారు. నల్లజర్ల మండలం చోడవరం లోని ముంపు ప్రాంతాలోని వరద నీటిలోనే మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, జవహర్ తమ పర్యటనను కొనసాగించారు. అనంతరం స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తామని..వరదనీటికి పాడైపోయిన పంటలకు నష్టపరిహారం ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.

16:40 - August 21, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో వరదలు పోటెత్తాయి. జల్లేరు, ఎర్రకాలువ పొంగటంతో.. నల్లజర్ల మండలం చోడవరం గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది. అర్ధరాత్రి ఒక్కసారిగా వరద నీరు రావడంతో.. గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు రాత్రిసమయంలోనే సహాయక చర్యలు చేపట్టారు. సుమారు ఐదువేల మంది నిరాశ్రయులయ్యారు. చోడవరం గ్రామంలోని ముంపు ప్రాంతాలను ఎంపీ మురళీమోహన్‌ పరిశీలించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీ తెలిపారు. కేవలం చూసి వెళ్తున్నారు తప్ప ఎలాంటి సాయం చేయడం లేదని గ్రామస్థులు ఎంపీ, ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

15:43 - August 20, 2018

పశ్చిమ గోదావరి : జంగారెడ్డిగూడెం మండలం చేపలపేట వరదల్లో మునిగిపోయింది. అర్ధరాత్రి ఒక్కసారిగా ఎర్రకాలవ, జల్లేరు పొంగటంతో గ్రామం మొత్తం నీట మునిగింది. 100 కుటుంబాలు కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఇళ్ళు మొత్తం నీటిలో మునిగిపోవడంతో నిరాశ్రయులైన గ్రామస్తులను చుట్టుపక్క ఉన్న గ్రామ ప్రజలు ఆదుకున్నారు. చేపలపేటలో వరద పరిస్థితితో ఆల్లాడిపోతున్నారు. కట్టుబట్టలతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బైటపడ్డారు. 

14:14 - August 20, 2018

పశ్చిమగోదావరి : గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు వంతెనలు కూలిపోతున్ న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఓ వంతెన కూలిపోయింది. ఖమ్మం, రాజమహేంద్రవరం ప్రదాన రహదారిపై బ్రిటషర్లు 1933లో బయనేరు వాగులపై నిర్మించిన ఈ పురాతన వంతెన జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయింది. 8 దశాబ్దాల సుదీర్ఘకాలంగా బ్రిటీషర్లు నిర్మించిన బయనేరు వాగు వంతెన ఆ ప్రాంత ప్రజలకు సేవలందించింది. తమ్మిలేని, ఎర్రకాలువలు పొంగి పొర్లుతుండటంతొ గేట్లు ఎత్తివేయటంతో ఈ వంతెనకు ప్రమాదం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. కాగా వంతెన కూలిపోతున్న సమయంలో ఓ వ్యక్తి వంతెన దాటిన మరుక్షణం వంతెన కూలిపోయవటంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బైటపడటం విశేషంగా చెప్పుకోవచ్చు..కాగా జంగారెడ్డి గూడెంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన గుబ్బల మంగమ్మ గుడి ప్రాంతంలో దాదాపు 500 వందలమంది భక్తులు చిక్కుకుపోయినవారిని సహాయక సిబ్బంది కాపాడారు. 

21:42 - August 14, 2018

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దూకుడు పెంచారు. పార్టీ మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ని విడుదల చేశారు. భీమవరంలో పార్టీ సిద్ధాంతాలు, హామీలను ప్రకటించారు. జనసేన అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని అన్నారు. సోమవారం పార్టీ గుర్తును ప్రకటించిన పవన్‌, ఇవాళ జనసేన విజన్‌ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి, టీడీపీ నేత పట్టాభిరామ్, జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Pages

Don't Miss

Subscribe to RSS - west godavari