visakhapatnam

14:40 - November 13, 2018

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ పై విమానాశ్రయంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తనపై దాడి జరిగిందని జగన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని పిటిషన్ లో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఈ హత్యాయత్నంపై విచారణ జరిపించాలని పిటీషన్ లో జగన్  కోరారు. ఈ నేపథ్యంలో నేడు జగన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ సహా 8 మందికి నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లోగా ఈ విషయమై తమ ప్రతిస్పందనను తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు జరిపిన విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో సమర్పించాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. కాగా అక్టోబర్ 25న హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. 
 

15:45 - November 11, 2018

విశాఖపట్నం: మరో తుఫాను ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను కొనసాగుతోంది. ఈ తుఫానుకు శ్రీలంక సూచించిన ''గజ''గా నామకరణం చేశారు. పోర్ట్‌బ్లెయిర్‌కు పశ్చిమ వాయువ్య దిశగా 400 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 1050 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడుకు 900 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రకృతమైంది. ఈ నెల 15న పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీంతో తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాను తీరం సమీపించే కొద్దీ గాలుల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని.. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం ఓడరేవుల్లో ప్రమాద సూచికను జారీ చేశారు. తుఫాను ప్రభావంతో 13వ తేదీ నుంచి దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

15:57 - November 2, 2018

తూర్పుగోదావరి : ఏ విషయానైనా కుంబ బద్దలు కొట్టినట్లుగా మాట్లడే ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ అధినేత జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో చేసిన దాడిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా... వాటన్నింటినీ వదిలేసి, ఈ దాడిపైనే విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ సభలకు జనాలు బాగా వస్తున్నారని, ఈ పరిస్థితుల్లో తనపై తానే దాడి చేయించుకోవాల్సిన అవసరం జగన్ కు లేదని ఉండవల్లి అన్నారు. జగన్ కు ఏమైనా జరిగితే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియనంత అమాయికుడు కాదు చంద్రబాబు అని అటువంటి పరిస్థితులు వస్తే ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో చంద్రబాబుకు  తెలుసని, కాబట్టి జగన్ ను హత్య చేయించే పని ఆయన చేయరని చెప్పారు. జగన్ పై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు ఎందుకు ఆనందపడతారనీ? ప్రశ్నించారు.నిందితుడికి నార్కో అనాలిసిస్ పరీక్ష చేయిస్తే, వివరాలు బయటకు వస్తాయని చెప్పారు. ఈ విషయంపై అనవసర రాద్ధాంతాన్ని ఆపివేసి రాష్ట్రంలో వున్న సమస్యలపై నేతలు దృష్టి పెట్టాలని ఉండవల్లి సూచించారు. 
 

18:06 - October 31, 2018

విశాఖపట్నం: రాష్ట్రంలో మరోసారి ఏసీబీ దాడుల కలకలం చెలరేగింది. విశాఖలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు. ఏపీఐఐసీ సర్వేయర్‌ చిరంజీవిరావు ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంటిపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. విశాఖలో చిరంజీవి సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో మొత్తం పది చోట్ల ఈ దాడులు జరిగాయి.

ఇప్పటివరకు చిరంజీవికి రెడ్డిపల్లిలో 4 ఎకరాల వ్యవసాయ భూమి, భోగాపురంలో 300 గజాల స్థలం, రేవాళ్ళపాలెంలో 80 గజాల స్థలం, మురళీనగర్‌లో 200 గజాల్లో ఇల్లు, ఒక ప్లాట్‌ను గుర్తించారు. బ్యాంకు లాకర్లు పరిశీలించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. చిరంజీవిపై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఏపీఐఐసీలో చిరంజీవి 20ఏళ్లుగా సర్వేయర్‌గా పని చేస్తున్నారు. దీంతో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 

కాగా, విశాఖలో అవినీతి నిరోధక శాఖల వరుస దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, పేరం గ్రూప్స్‌ అధినేత పేరం హరిబాబుకు చెందిన ఆస్తులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించడం కలకలం రేపగా...తాజాగా ఏపీఐఐసీ సర్వేయర్‌ చిరంజీవి నివాసంలో దాడులు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

12:59 - October 26, 2018

విశాఖపట్నం :  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటి మహిళా స్పీకర్ గా వ్యవహరించిన ప్రతిభా భారతి గుండె పోటుకు గురయ్యారు. విశాఖలోని పినాకిని ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి జస్టిస్ పున్నయ్య చూసేందుకు ప్రతిభా భారతి ఆసుపత్రికి వచ్చారు. తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసిన ఆమె... తట్టుకోలేక, స్పృహ తప్పి పడిపోయారు. ఇదే సమయంలో ఆమె గుండె పోటుకు గురయ్యారు. దీంతో, ఆమెకు డాక్టర్లు హుటాహుటిన చికిత్సను ప్రారంభించారు. గుండె సంబంధిత పరీక్షలను నిర్వహించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా 1983, 1985 మరియు 1994 లోనూ మరియు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా 1998 లోనూ ఆమె  పనిచేశారు. 
 

10:59 - October 26, 2018

విశాఖపట్నం : జగన్ పై కోడిపందాలకు వాడే కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావుపై గతంలోనే కొన్ని పోలీసు కేసులు నమోదయ్యాయి. నిందితుడిని ఘటన వెంటనే అదుపులోకి తీసుకున్నామని ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ తరువాత, శ్రీనివాసరావుపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 అంటే హత్యాయత్నం కేసును నమోదు చేసినట్టు పోలీస్ ఇనస్పెక్టర్ మల్లా శేషు వెల్లడించారు. కేసును విచారిస్తున్నామని తెలిపారు. కోడిపందాలపై ప్రేమతో చదువును  పదో తరగతితోనే  దూరం పెట్టిన శ్రీనివాసరావు కూలీ పనులు చేసుకునే తాతారావు, సావిత్రిల ఐదో సంతానం. దీంతో పలు గొడవలకు, ఘర్షణలకు పాల్పడుతుండేవాడని సమాచారం. గత సంవత్సరం కాగిత వెంకటేశ్ అనే యువకుడిపై దాడి చేశాడని ముమ్మిడివరం పోలీసు స్టేషన్ లో ఓ కేసు నమోదై ఉంది. ఇక శ్రీనివాసరావుకు గ్రామంలోని పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయమై గ్రామపెద్దలు పలుమార్లు శ్రీనివాసరావును మందలించినట్టు గ్రామస్తులు పేర్కొంటున్నారు. కాగా ఇవన్నీ పోలీస్ విచారణలో వెల్లడికావాల్సి వుంది. కాగా జగన్ పై దాడిని నిరసిస్తు వైసీపీ నేడు నిరసనలను వ్యక్త పరుస్తు ధర్నాలు, ర్యాలీలు చేపట్టింది. కాగా దాడికి గురైన జగన్ మాత్రం పెద్దగా ఏమీ మాట్లాడకపోవటం గమనించాల్సిన విషయం. ఈ దాడిపై పలు పార్టీలు పలు విధాలుగా అభిప్రాయాలను వ్యక్తపరుసస్తున్నాయి.
 

10:31 - October 26, 2018

విశాఖపట్నం : ఏపీలో జరుగుతున్న కీలక పరిణామాలు ఆందోళగొలుపుతున్నాయి. నిన్న అంటే గురువారం నాడు  విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు రెండు రాష్ట్రాల్లోను తీవ్రంగా కలకల రేపింది. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాసరావు జగన్ వద్దకు సెల్ఫీ కోసమని వచ్చిన కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. జగన్ పై అభిమానంతోనే సానుభూతి పెరగాలని ఇలా చేసానని శ్రీనివాస్ తెలిపాడు. కానీ దీనిపై పలు అనుమానాలు రేకెత్తించేలా వున్నాయి శ్రీనివాస్ వ్యవహారాలు. Image result for jagan attack
పక్కా ప్రణాళికతోనే జగన్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజుల క్రితం నిందితుడు కోడి పందేలకు వాడే కత్తిని ఓ తయారీదారు నుంచి కొనుగోలు చేసినట్లు స్థానికుడొకరు చెబుతున్నారు. ఈ సందర్భంగా తయారీదారుడు ‘ఇప్పుడు కోడి పందేలు లేవు.. కేవలం అవి సంక్రాంతి సీజన్ లో మాత్రమే ఆడతారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కత్తి కొనే సమయంలో శ్రీనివాస్ ను ఈ కత్తి నీకెందుకు?’ అని ప్రశ్నించాడని దానికి శ్రీనివాసరావు ‘నాకు ప్రత్యేకంగా పని ఉందని’ అని చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా కొన్నిరోజుల క్రితం శ్రీనివాసరావు సోదరుడు కుమార్తె పుట్టిన రోజును ఆ కుటుంబం ఘనంగా నిర్వహించిన సందర్భంగా శ్రీనివాసరావు తన స్నేహితులకు భారీగా పార్టీ ఇచ్చాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతటి ఆర్థిక స్థోమత లేని శ్రీనివాస్ అంత  భారీగా ఖర్చు చేయం పట్ల కూడా అనుమానులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పై దాడిలో కుట్ర కోణం దాగుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

13:19 - October 25, 2018

విశాఖపట్నం: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లాంజ్‌లో జగన్ కూర్చుని ఉండగా.. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చిన ఓ యువకుడు జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. కోడి పందెలకు ఉపయోగించే కత్తితో అతను జగన్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమైంది. ఊహించని పరిణామంతో అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. వెంటనే అప్రమత్తం అయిన సెక్యూరిటీ.. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. ఎయిర్‌పోర్టులోనే ప్రాథమిక చికిత్స అనంతరం వైఎస్‌ జగన్‌ విమానంలో హైదరాబాద్‌ బయలుదేరారు.

294వ రోజు పాదయాత్ర ముగించుకుని వైఎస్‌ జగన్‌ గురువారం హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. లాంజ్‌లో ఉన్న జగన్‌ వద్దకు వచ్చిన వెయిటర్ శ్రీనివాస్‌.. మన పార్టీకి 160సీట్లు వస్తాయా సార్? అని పలకరించాడు. ఆ తర్వాత సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్‌ వద్దకు వచ్చాడు. వస్తూనే.. జగన్‌పై కత్తితో దాడి చేశాడు. 

 

Image result for attack on jagan

08:21 - October 25, 2018

విశాఖపట్నం : నగరంలో భారీ అవినీతి సోదాలు జరగనున్నాయి. ఈ దాడుల అనుబంధంగా విజయవాడ, నెల్లూరు,గుంటూరు నగరాలలో కూడా ఐటీ సోదాలు జరిగే అవకాశమున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఐటీ బృందాలు ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్న క్రమంలో ఈరోజు తెల్లవారుఝామునుండే ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గాజువాక, దువ్వాడ ఎస్ఈజెడ్ లో సోదాలు కొనసాగుతున్నాయి. దువ్వాడలోని టీజీఐ కంపెనీ, ట్రాన్స్ వరల్డ్ బీచ్ శాండ్ కంపెనీలలో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. 
ఇప్పటికే ఏపీలోని పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. విశాఖలోని పారిశ్రామికవేత్తలు, టీడీపీకి చెందిన కీలక నేతలు, చిట్ ఫండ్ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఐటీ అధికారులు ఇప్పటికే విశాఖకు చేరుకుని తనిఖీలను కొనసాగిస్తున్నారు. 
 

10:46 - October 24, 2018

విశాఖపట్నం : బుధవారం భారత్-వెస్టిండీస్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డే భారీ స్కోరును చేజ్ చేసిన టీమిండియా....రెండో వన్డేలోనూ విజయం సాధించాలని తహతహలాడుతోంది. మరోవైపు విశాఖలో ఇప్పటి వరకు 8 వన్డే మ్యాచ్‌లు జరిగితే...ఇందులో ఒకే ఒక్క దాంట్లో మాత్రమే ఓడిపోయింది. టీమిండియాకు లక్కీ గ్రౌండ్‌గా పేరున్న విశాఖలో మ్యాచ్ జరగనుండటంతో....అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా భారత్ జట్టు అత్యధిక వన్డేలు ఆడిన జట్టుగా రికార్డు సృష్టించనుంది.
ఇండోర్‌లో జరగాల్సిన భారత్‌-వెస్టిండీస్‌ మధ్య రెండో వన్డే... ఊహించని విధంగా విశాఖపట్నానికి తరలి వచ్చింది. దీంతో విశాఖ సాగర తీరంలో క్రికెట్ సందడి మొదలైంది. బుధవారం మధ్యాహ్నం భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. భారత క్రికెట్‌ జట్టుకు బాగా కలిసొచ్చిన విశాఖ మైదానంలోనూ విజయం సాధించి...సిరీస్‌లో ముందంజ వేయాలని భావిస్తోంది. తొలి వన్డేలో విండీస్ జట్టు 322 పరుగులు చేసినప్పటికీ...టీమిండియా బ్యాట్స్‌మెన్లు సునాయాసంగా టార్గెట్‌ను చేజ్ చేశారు. తొలి వన్డేలో సెంచరీలతో అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు...ఈ మ్యాచ్‌లోనూ విజృంభించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో ఇప్పటి వరకు టీమిండియా 8 వన్డేలాడితే...ఇందులో ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమి పాలయింది. అదే విధంగా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ లాంటి స్టార్‌ ఆటగాళ్లకు ఈ మైదానంలో మంచి రికార్డులున్నాయి. 2005లో ఇక్కడే పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోని.. 148 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో తన పేరు మారుమ్రోగేలా చేశాడు. ఇప్పుడు ఇక్కడే వన్డే జరగనుండటంతో అందరి కళ్లు ధోనిపైనే ఉన్నాయి.
ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా మరో రికార్డును సృష్టించనుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియాకిది 950వ వన్డే మ్యాచ్‌. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లాడిన జట్టుగా భారత్‌ అరుదైన రికార్డును తన పేరుతో లిఖించుకోనుంది. ఇప్పటివరకూ వన్డే ఫార్మాట్‌లో 949మ్యాచ్‌లాడిన భారత్‌.. 490మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే...మరో 411మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. విశాఖ పిచ్‌ ఎప్పట్లాగే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండొచ్చని. నగరంలో నిన్నటి నుంచి మంచు పడటంతో టాస్‌ కూడా కీలకం కానుంది. వర్షం కురిసినా మ్యాచ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా రెండు సూపర్‌ సాఫర్‌ యంత్రాలను మైదాన సిబ్బంది సిద్ధం చేశారు.
వన్డే మ్యాచ్‌కు 2వేల మంది పోలీసులతో అధికారులు  పటిష్ట భద్రత ఎర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మ్యాచ్ ముగింపు వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అభిమానులు తాకిడి ఎక్కువగా ఉండటంతో... స్టేడియం చుట్టు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. టిక్కెట్ పాస్‌పై ఉన్న గేట్లలో మాత్రమే అభిమానులు వెళ్లాలని పోలీసులు సూచించారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా మూడు ప్లేసుల్లో పార్కింగ్ ఎర్పాటు చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - visakhapatnam