telangana movement

15:34 - July 26, 2018

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా సాధించటంలో ఏపీలోని రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశాన్ని రాజీకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారు తప్ప ఏపార్టీ కూడా చిత్తశుద్ధితో పోరాడటంలేదని కడియం విమర్శించారు. హోదా కోసం తెలంగాణ ఉద్యం స్ఫూర్తితో ఏపీ పార్టీలు పోరాడాలని సూచించారు. తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ అందరితోను ఇష్టమున్నా లేకున్నా అందరితోను జై తెలంగాణ అనిపించారని అటువంటి స్ఫూర్తి ఏపీ పార్టీలకు వుండాలని కడియం సూచించారు. కాగా ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా కొనసాగుతున్న కడియం శ్రీహరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సీఎంగా వున్న సమయంలో ఆయన కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన విషయం తెలసిందే.

18:12 - June 9, 2018

హైదరాబాద్ : ఎన్నో ఉద్యమాలు త్యాగాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు అన్నిచోట్లా నిరాశే ఎదురైందని తెలంగాణ జనసమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.. హైదారాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు,.. వయోపరిమితిపై సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ నలుమూల నుంచి భారీ సంఖ్యలో విద్యార్ధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విషయంలో ప్రభుత్వం వయోపరిమితిని పెంచితే.... పేద నిరుద్యోగులకు ఉపయోగంగా ఉంటుందని కోదండరామ్ అభిప్రాయపడ్డారు..

 

21:05 - June 2, 2018

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్‌ ఆమ్రపాళి పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కడియం, అనంతరం కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన అధికారులను మంత్రి అవార్డులతో సత్కరించారు.

కరీంనగర్‌ జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించిన ఈటెల.. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రభుత్వం తరుపున ప్రతిభ పురస్కారాలు అందించారు. రామగుండం సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికులు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గనులపై త్రివర్ణ పతకాన్ని ఎగరవేసి మిఠాయిలు పంచుకున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పాల్గొన్నారు.

మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే అమరుల కుటుంబాలకు, ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు అవార్డులను బహుకరించారు. మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో డీప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. అమరులకు నివాళులర్పించి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు.

నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. వినాయక్‌ నగర్‌లో గల అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్‌తో కలిసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదాన్‌ జరిగిన వేడుకల్లో ఆబ్కారిశాఖ మంత్రి పద్మారావు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులర్పించారు. అనంతర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే సింగరేణి గనుల సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం గ్రౌండ్‌లో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగరేణి డైరెక్టర్‌ పవిత్రన్‌ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్యాపేట జిల్లాలో జరిగిన వేడుకల్లో విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నల్లగొండలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో మండలి డిప్యూటీ చైర్మన్‌ విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ జెండా ఆవిష్కరించారు.

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వికారాబాద్‌ పోలీసు గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో జాతీయ జెండా ఎగరవేసిన మంత్రి, అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు.

అలాగే హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్ రంగనాథన్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యలయంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ జెండా ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉస్మానియా యూనివర్శిటీలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా వర్శిటీ వీసీ ఆర్ట్స్ కళాశాల భవనంపై జెండా ఆవిష్కరించారు. 

18:26 - June 2, 2018

హైదరాబాద్ : యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ అభివృద్ధి చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్‌ పార్క్‌ వద్ద అమరులకు నివాళులు అర్పించారు సీఎం కేసీఆర్. అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రసంగించిన సీఎం రాష్ట్ర ఆవిర్భావం నుండి జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. సమైక్య రాష్ట్రంలో అణచివేతకు, దోపిడికి గురైన తెలంగాణలో ఉవ్వెత్తున ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్నాని తెలిపారు. తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను అర్థం చేసుకొని వాటి ఆలోచనల పునాదుల మీద మానిఫెస్టో రూపొందించామన్నారు. నిరంతర ప్రగతి శీల రాష్ట్రంగా.... తెలంగాణ యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని సవరించి... గోదావరి, కృష్ణ నదీజలాలను తెలంగాణ పొలాలకు తరలించే విధంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు సీఎం. రైతులు కన్న కలలను సాకారం చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నడుం బిగిందిందన్నారు. గోదావరి జలాల సమగ్ర వినియోగం కోసం తెలంగాణ ప్రభుత్వం... మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం 70 సంత్సరాలలో ఏ ప్రభుత్వమూ చేయలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీందించాలన్న దృఢ సంకల్పంతో ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్లో ఏటా 25 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు.

విద్యారంగంలోనూ తెలంగాణ ముందడుగు వేస్తుందన్నారు సీఎం. కేజీ టు పీజి ఉచిత విద్యావిధానం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 542 కొత్త గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం బలీయమైన శక్తిగా ఎదిగిందన్నారు సీఎం కేసీఆర్. ప్రపంచంలోనే హైదరాబాద్‌ ప్రముఖ ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిందన్నారు. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టీ హబ్‌ ఎందరో ఔత్సాహికులకు ప్రేరణగా నిలిస్తుందన్నారు. కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అన్ని అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 7వేల 155 పరిశ్రమలు అనుమతి పొందాయన్నారు. లక్షా 29 వేల పెట్టుబడులు, 5 లక్షల 74 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయని గుర్తు చేశారు కేసీఆర్‌. సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సఫల రాష్ట్రంగా స్థిరపడిందన్నారు సీఎం. సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలనైనా అవలీలగా అధిగమించవచ్చని తెలంగాణ ప్రభుత్వం రుజువు చేసిందని చెప్పారు. రాబోయే రోజుల్లోనూ ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామన్నారు. అవిశ్రాంతంగా శ్రమించి బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడి...యావత్‌భారతావనికి దిక్సూచిగా నిలుద్దామన్నారు కేసీఆర్‌. 

07:36 - June 1, 2018

ఢిల్లీ : తెలంగాణ నాలుగో ఆవిర్భావ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ముస్తాబైంది. జాతీయ స్థాయిలో రాష్ర్ట ఘనతను చాటేలా రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి మూడు రోజులపాటు సాగే వేడుకలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది.

అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ర్ట నాలుగో ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్న ప్రభుత్వం. ఇవాళ నుంచి మూడో వతేదీవరకూ అంబరాన్నంటేలా సంబరాలు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 6గంటలకు తెలంగాణ భవన్‌నుంచి ఇండియా గేట్‌ వరకూ మూడు కిలోమీటర్ల మారథాన్‌ నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పాల్గొననున్నారు. తెలంగాణ ఆవిర్భావం పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. 

ఢిల్లీ వాసులకు తెలంగాణ గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్లు తెలిపేలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. రాష్ర్ట ఏర్పాటుకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.  చార్మినార్‌ను తలపించేలా ఏర్పాటు రూపొందించిన  తోరణంతో.. హైదరాబాద్‌ లాడ్‌ బజార్‌ను మరిపించేలా స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. చేనేత, హస్తకళలు, భూదాన్‌ పోచంపల్లి చీరలు, ఛార్మినార్‌ గాజులు, ముత్యాలు, కరాచీ బిస్కెట్లు, ప్యారడైజ్‌ బిర్యానీ స్టాళ్ళు కొలువుదీరాయి. సకినాలు, సర్వాప్పలు అందుబాటులో ఉంటాయి.  

ఇవాళ సాయంత్రం ఆరుగంటలకు తెలంగాణ ప్రముఖులకు సన్మానం చేయనున్నారు. ప్రధానంగా జూన్‌ 2న యాదగిరి గుట్ట ప్రధాన అర్చకులతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణాన్ని తెలంగాణ భవన్‌ అంబేడ్కర్‌ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. యాదాద్రి పండితులు  ఈ కళ్యాణం జరిపించనున్నారు.  మూడు రోజులపాటు వైద్య శిబిరం కూడా నిర్వహించనున్నట్లు రాష్ర్ట ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి తెలిపారు. రాష్ర్ట ఆవిర్భావ సంబరాలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు తెలంగాణ భవన్‌ను తీర్చదిద్దారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల అలంకరణలో... సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించనున్నారు. 

13:41 - May 5, 2018

హైదరాబాద్ : తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా  పాల్గొన్న  నేతలకు ఇప్పుడు  టెన్షన్ పట్టుకుంది.  ఉద్యమ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై కోర్టు ఓ  యువనేతకు శిక్ష విధించడం  అధికార పార్టీ నేతలను కలవరపెడుతోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసులు ఎత్తి వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో... ఉద్యమ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 
ఉద్యమ సమయంలో కార్యకర్తలపై కేసులు 
టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, నేతలకు  కేసుల భయం పట్టుకుంది.  రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ సంమయంలో ఎంతో మంది గులాబి పార్టీ కార్యకర్తలపై పోలీసు కేసులు నమోదయ్యాయి. తెలంగాణా వ్యాప్తంగా జరిగిన వివిధ ఆందోళనల్లో  వారు ప్రత్యక్షంగా పాల్గొనడంతో పోలీసులు అప్పట్లో కేసులు నమోదు చేశారు.  ఉద్యమ ఆకాంక్ష నెరవేరింది. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గులాబి పార్టీకి తెలంగాణాలో అధికార పగ్గాలు దక్కాయి. కాని ఉద్యమకారులపై ఉన్న కేసులు మాత్రం ఇంకా  కొలిక్కి రాలేదు. 
అమలుకు నోచుకోని కేసుల ఎత్తివేత నిర్ణయం 
అప్పట్లో నమోదైన కేసులను పూర్తిగా ఎత్తి వేయాలన్న ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నా అది ఇంకా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకో లేదు. కొంత మందిపై ఉన్న కేసులు  మాత్రమే  నిబంధనల ప్రకారం ఎత్తి వేసేందుకు పోలీసులు, న్యాయశాఖ చొరవ చూపాయి. ఇంకా వందలాది మంది గులాబి పార్టీ కార్యకర్తలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.   మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విద్యార్థి విభాగం నేత మున్నూరు రవికి కోర్టు ఇటీవల ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా విధించింది. దీంతో  కేసులు ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో మరోసారి  టెన్షన్  మొదలైంది.  రాష్ట్ర ఆకాంక్ష నెరవేరినా....రాష్ట్ర సాధన కోసం తాము చేసిన  పోరాటంలో దోషులుగా నిర్ధారణ కావడంతో  జీవితాంతం తాము నేరగాళ్లుగా ముద్రవేసుకున్నట్లు అవుతుందన్న ఆందోళన ఉద్యమ నేతలను వెంటాడుతోంది. 
4ఏళ్లయినా కొలిక్కిరాని కేసులు 
టీఆర్‌ఎస్‌ అధికార పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్నా...  ఉద్యమ కారుల కేసులు కొలిక్కి రాకపోవడం వెనుక పార్టీలో  ఉన్న గ్రూపు రాజకీయాలు కూడా  ఓ కారణమన్న వాదన వినిపిస్తోంది. గులాబిపార్టీలో చేరిన బయటి నేతలు .. ఉద్యమ కారులపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రభుత్వ పరంగా జరుగుతున్న జాప్యం , పోలీసు శాఖ వ్యవహరిస్తున్న తీరుతో  ఉద్యమ నేతలపై ఉన్న కేసుల వ్యవహారం  అధికార పార్టీలో మరోసారి  చర్చనీయంశంగా మారింది.

 

07:11 - April 30, 2018

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి అధికారంలోకి రాగానే.. అవినీతి అధికారులపై విచారణ జరిపిస్తామని ఆపార్టీ అధినేత ప్రొఫెసర్‌ కోదండరామ్ అన్నారు. సరూర్‌నగర్‌ టీజేఎస్‌ ఆవిర్భావ సభలో ప్రసంగించిన కోదండరామ్... ప్రస్తుత పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం కాకుండా.. నేతల మాటలు వినే అవినీతి అధికారులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రాజకీయ నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ పరిసరాల్లోని వేలాది ఎకరాల భూములను జప్తు చేస్తే.. నగరంలోని పేద, మధ్యతరగతి ప్రజలతోపాటు.. పాత్రికేయులు, న్యాయవాదులకు ఇళ్లు కట్టించడం అసాధ్యం కాదన్నారు. గల్లీల్లోని గరీబులు సైతం గౌరవంగా బతికే రోజులు రావాలని కోదండరామ్‌ ఆకాంక్షించారు. 

21:32 - April 29, 2018

హైదరాబాద్ : అందరూ కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ జరిగింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా కోదండరాం ఎన్నికయ్యారు. పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ సభ జయప్రదం కావాలనే కోరిక ప్రజల్లో బలంగా ఉందన్నారు. అనేక గ్రామాల నుంచి ప్రజలు సభకు తరలివచ్చారు. సభకు వచ్చిన వారిని చూస్తుంటే పాలపిట్టల గుంపును చూసినట్టుగా ఉందని అభివర్ణించారు. చందాలతోటి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. సభకు భారీ హాజరైన జనాన్ని చూస్తే ఇది విజయానికి నాంది అని పిలుస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో, వంటా వార్పు, సకల జనుల సమ్మె చేపట్టామని తెలిపారు.

 

13:23 - April 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర జనం కోసమే 'జనసమితి' పార్టీ ఏర్పాటు చేసినట్లు ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. సోమవారం ఆయన పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి రావడంపై రాజనీతిజ్ఞులతో మాట్లాడడం జరిగిందని 'తెలంగాణ జనసమితి పార్టీ'ని ప్రకటిస్తున్నట్లు, తెలంగాణ ఏర్పడ్డాక ప్రజల ఆకాంక్షలకు గౌరవం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థకు గౌరవం లేకుండా పోయిందని, అన్ని నిర్ణయాలు సచివాలయం నుండే జరుగుతున్నాయన్నారు. తెలంగాణ కోసం అనేక మంది బలిదానాలు చేసుకున్నారని, బతుకుదెరువు..ఆత్మగౌరవం కోసం బలిదానాలు చేసుకున్నారన్నారు. ఏ వర్గానికి కూడా ఎలాంటి న్యాయం జరగడం లేదని విమర్శించారు. పార్టీ పతాకం రూపకల్పనకు కళాకారుల సహాయం తీసుకోవడం జరిగినట్లు ఈనెల 4న పార్టీ పతాకం ఆవిష్కరిస్తామన్నారు. 29వ తేదీన హైదరాబాద్ లో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ ఉంటుందని, సమన్వయ కమిటీ అన్ని కమిటీలను సమన్వయపరుస్తుందన్నారు. 12 సబ్ కమిటీలు పనులు మొదలు పెట్టాయని, ఆవిర్భావ సభ విజయవంతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈనెల 5 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు..సమావేశాలు..సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రొ.కోదండరాం ప్రకటించారు. 

06:40 - April 1, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించనుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొత్త పార్టీ పెడతామన్న తెలంగాణ JAC ఛైర్మన్‌ కోదండరామ్‌ నేతృత్వంలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. కొత్త పార్టీ కోసం JAC దరఖాస్తు చేసుకున్న తెలంగాణ జనసమితి పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌ 2న కోదండరామ్‌ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఏప్రిల్‌ 4న పార్టీ పతాకం ఆవిష్కరించి, పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. మరోవైపు ఏప్రిల్‌ 29న భారీ బహిరంగ సభ ఏర్పాటుకు JAC నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - telangana movement