supreme court

15:45 - September 19, 2018

ఢిల్లీ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్రంలో గడువు కంటే ముందే ఎన్నికలు నిర్వహించడం వల్ల పౌరులకు నష్టమని పేర్కొంటూ సిద్ధిపేటకు చెందిన పోతుగంటి శశాంక్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

తెలంగాణలో సాధారణ ఎన్నికల సమయానికి దాదాపు 20లక్షల మందికి పైగా యువత ఓటుహక్కు పొందేందుకు అవకాశముంటుందని... ముందస్తు ఎన్నికల వల్ల వారంతా ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసే విధంగా ఉందన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న ప్రభుత్వమే అధికారంలో ఉందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. స్వయంగా ముఖ్యమంత్రే.. ఎన్నికల సంఘంతో మాట్లాడిన తర్వాతే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పడం అర్థరహితమన్నారు. ఫలానా సమయంలో ఎన్నికలు జరుగుతాయని, మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి, రాజకీయ సంక్షోభం లేకపోయినా... కేవలం రాజకీయ పరమైన లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైందని పిటిషనర్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలను దృష్టిలోకి తీసుకుని తెలంగాణలో గవర్నర్‌ పాలన విధించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని.. అప్పటివరకు గవర్నర్‌ పాలన అమల్లో ఉండటం వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందని పిటిషనర్‌ అభిప్రాయపడ్డారు.

14:36 - September 12, 2018

న్యూఢిల్లీ: వరవరరావు సహా ఇతర నలుగురు మానవ హక్కుల నేతలకు గృహనిర్బంధాన్ని వచ్చే సోమవారం (సెప్టెంబరు 17) వరకు కొనసాగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.  ఐదుగురు మానవ హక్కుల నేతల విడుదల కోసం దాఖలైన పిటీషన్ ను విచారించిన కోర్టు వారి గృహనిర్బంధాన్ని పొడిగించాలని ఆదేశాలు జారీచేసింది.

చరిత్రకారుడు రోమిల థాపర్ హక్కుల నేతలు ఐదుగురిని విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తెలుగ రచయిత వరవరరావు, హక్కుల నేతలు వెర్నాన్, అరుణ్ ఫెర్రీరా, లాయర్ సుధా భరధ్వాజ్, పౌరహక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను మహారాష్ట్ర పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.   

08:19 - September 7, 2018

ఢిల్లీ : స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. స్వలింగ సంపర్కం ఇకపై నేరం కాదు.. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అందరిలాగే స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించడం విశేషం. తాజా తీర్పుతో సెక్షన్‌ 377పై కొనసాగుతున్న వివాదానికి తెరపడింది.
సుప్రీంకోర్టు తుది తీర్పు
స్వలింగ సంపర్కంపై ఐపిసి సెక్షన్‌ 377 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు  తుది తీర్పును వెల్లడించింది. పరస్పర అంగీకారంతో జరికే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు వెలువరించింది. 
జంతువులతో లైంగిక చర్య, చిన్నారులతో అసహజ శృంగారం నేరం 
వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కని...స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. లైంగిక స్వభావం ఆధారంగా ఒకరిపై పక్షపాతం చూపడమంటే వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేననే తెలిపింది. ఎల్‌జిబిటి సముదాయాన్ని అందరూ గౌరవించాలని...వీరిపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ప్రచారం నిర్వహించాలని సూచించింది. సుప్రీం తీర్పుతో సెక్షన్‌ 377పై 150 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెర పడింది. జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారం మాత్రం నేరంగానే పరిగణించాలని కోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును ఎల్‌జిబీటీ కార్యకర్తలతో పాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కొత్త శకానికి నాందిగా పేర్కొన్నారు. ఈ విషయంలో తనను తప్పు పట్టిన బిజెపి ఎంపీలకు ఈ తీర్పు చెంప పెట్టులాంటిదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ అన్నారు.
377 సెక్షన్‌ను సవాల్‌ చేస్తూ పిటిషన్ 
సెక్షన్‌ 377 ప్రకారం స్వలింగ సంపర్కం, జంతువులతో లైంగిక చర్యలు, అసహజ శృంగారానికి పాల్పడినవారికి పదేళ్ల వరకు జైలుశిక్ష, జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది. 377 సెక్షన్‌ను సవాల్‌ చేస్తూ నాజ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ 2001లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇద్దరు వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్యను నేరంగా పరిగణించకూడదని 2009లో ఢిల్లీ  హైకోర్టు తీర్పు చెప్పింది. 2013లో ఈ తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.  సెక్షన్‌ 377 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జులై 17న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తాజా తీర్పునిచ్చింది.

 

16:38 - September 4, 2018

ఢిల్లీ : కొంతమందికి డ్రైవ్ చేయటంలో మజా ఫీలవుతుంటారు. ఈ క్రమంలో వారు ర్యాష్ గా..స్టైల్ గా..కేర్ లెస్ గా డ్రైవ్ చేస్తుంటారు. దీంతో వాహనాలు పలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు వున్నాయి. ఈ క్రమంలో వాహనం పూర్తిగా డేమేజ్ కావచ్చు. ఆ ఏముందిలే..బీమా వుందిగా..మనకెందుకు చింత అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు యాక్సిలేటర్ మీద కాలేసినట్లే. ర్యాష్ డ్రైవింగ్ చేసిన సమయంలో యాక్సిడెంట్ అయిన వాహనాలకు బీమా వర్తించదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి గురైన వారు బీమా క్లెయిమ్‌ చేసుకోవద్దని చెప్పింది. జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. అయితే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి ‘పర్సనల్‌ యాక్సిడెంట్‌’ పాలసీ కింద పరిహారం అందుతుందని కోర్టు వెల్లడించింది.

జాతీయ బీమా కంపెనీ దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై విచారణ చేప్టిన సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. దిలీప్‌ భౌమిక్‌ అనే వ్యక్తి 2012 మే 20న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబసభ్యులు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన స్వయం తప్పిదం వల్లే ప్రమాదానికి గురయ్యారని బీమా కంపెనీ వాదించింది. అయితే త్రిపుర హైకోర్టు మృతుడి కుటుంబసభ్యులకు రూ.10.57లక్షల ఇన్స్యూరెన్స్‌ చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. దీనిపై బీమా కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిపుర హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. మృతుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసినట్లు గుర్తించింది. స్వయం తప్పిదంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ప్రమాదానికి గురైతే బీమా ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అటువంటి సందర్భాల్లో మోటార్‌ వాహనాల చట్టం సెక్షన్‌ 166 ప్రకారం బాధిత కుటుంబసభ్యులు కూడా ఇన్స్యూరెన్స్‌ కోరొద్దని పేర్కొంది. అయితే పర్సనల్‌ యాక్సిడెంట్‌ కవర్‌ కింద భౌమిక్‌ కుటుంబానికి రూ.2లక్షల బీమా ఇవ్వాలని కోర్టు జాతీయ బీమా కంపెనీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

15:55 - August 24, 2018

ఢిల్లీ : గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. 20,158 సీట్లకు మళ్లీ ఎన్నికలు జరిపించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మేలో జరిగిన పశ్చిమ బెంగాల్‌ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 20,178 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఎన్నికల్లో అధికార టిఎంసి బెదిరింపులు, హింసాత్మక ఘటనలకు పాల్పడిందని, నామినేషన్లు వేయనీయ లేదని విపక్షాలు ఆరోపించాయి. 20,158 సీట్ల ఫలితాలపై ఉన్న స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ స్థానాలకు మళ్లీ ఎన్నికలు జరిపించాలని విపక్షాలు చేసిన డిమాండ్‌ను పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. 

20:44 - August 21, 2018

ఏపీలో మెడికల్ ప్రవేశాలపై వివాదం కొనసాగుతోంది. జీవో నంబర్ 550ను ఉల్లంఘిస్తున్నారనీ..550 జీవోను పరిరక్షిస్తు ప్రవేశాలు చేపట్టాలని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేస్తు ఆందోళన చేపట్టాయి. ఎంబీబీఎస్ సీట్ల కౌన్సిలింగ్ లో జరిగిన అక్రమాలు..రిజర్వేష్ అభ్యర్థులకు జరిగినటువంటి అన్యాయంపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని యువజన, విద్యార్థి సంఘాలు ముట్టడికి యత్నించాయి. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. అసలు జీవో నంబర్ 550లో వున్న అంశాలేమిటి? దీని ఉల్లంఘన వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మెడికల్ అభ్యర్థులకు జరిగే నష్టాలేమిటి? అనే అంశంపై 10టీవీ చర్చా కార్యక్రమం. ఈ చర్చలో డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ అంబటి నాగరాజారత్నం పాల్గొన్నారు.

11:28 - August 2, 2018

ఢిల్లీ : భారత రాజ్యాంగంలో స్త్రీ, పురుషులు ఇరువురికి సమాన హక్కులను కల్పించింది. చదువు, సమాన జీవనం, హక్కులు వంటి పలు అంశాలలో సమాన హక్కులను కల్పించింది. కానీ రాజ్యాంగంలో న్యాయం వుంటుంది. కానీ సంప్రదాయంలో న్యాయం వుండదు. ఈ క్రమంలోనే న్యాయం వేరు, సంప్రదాయం వేరు అంటు మహిళలకు కొన్ని ఆలయాలలోకి నిషేధం విధించారు. న్యాయం అయినా..సంప్రదాయం అయినా మనుషులు సృష్టించుకున్నవే.. కల్పించుకున్నవే. కానీ భారతదేశంలో మాత్రం కొన్ని ఆలయాలలోకి మహిళలను నిషేధించటంపై కొందరు హేతువాదులు, మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగంలోని హక్కుల ప్రకారం పురుషులతో సమానంగా స్త్రీలకు అన్ని హక్కులు వున్నాయనీ..నిషేధం వంటివాటిని సహించేది లేదని నినదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయం, శని సింగనాపూర్ లోని శనీశ్వరుని ఆలయం వంటి కొన్ని ఆలయాలలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలంటు కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

శతాబ్ధాలుగా శనీశ్వరిని ఆలయంలో మహిళల నిషేధం..
ని శింగనాపూర్‌లో స్వయంభూగా వెలసిన శనీశ్వరుని నల్లటి రాతి విగ్రహం ఉన్న చోట పూజలకు కేవలం మగవారిని మాత్రమే అనుమతిస్తారు. శతాబ్ధాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. గత ఏడాది నవంబర్‌లో ఓ మహిళ గట్టుపైకి ఎక్కి విగ్రహానికి అభిషేకం చేయడం కలకలం రేపింది. అనంతరం ఆలయ నిర్వాహకులు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించడం వివాదస్పదమైంది. దీనికి నిరసనగా మహిళా వివక్షపై పోరాడుతున్న భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ వందలాది మహిళలతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసున్నారు. ముఖ్యమంత్రి తన భార్యతో కలిసి శని ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించి మహిళల పక్షాన నిలవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ముస్లిం సంప్రదాయంలో దర్గాలలోకి కూడా మహిళలను రానివ్వని విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ముస్లిం మహిళల్లో కూడా చైతన్యం కలిగి దర్గాలలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని అక్కడక్కడా పోరాటాలు చేస్తున్నారు. ఇక పోతే అయ్యప్ప స్వామి ఆలయం..

మహిళల నిషేధం అంటరానితనం కాదా?..
కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రత్యేకంగా ఓ వయోవర్గానికి చెందిన మహిళలకు మాత్రమే ఆలయ ప్రవేశం వుంటుంది. దీనిపై మహిళలకు ప్రవేశం కల్పించాలంటు గత కొంతకాలంగా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతందో. ఈ నిషేధం మహిళల హక్కులను నిరాకరించడం పలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడంతో పాటు అంటరానితనం కిందకూ వస్తుందన్నారు.

ఆలయంలో పూజలు మహిళల రాజ్యాంగ హక్కు : సుప్రీంకోర్టు
కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించి, పూజలు చేసుకోవడం మహిళల రాజ్యాంగ హక్కు అనీ, ఈ విషయంలో లింగ వివక్షకు తావులేదని సుప్రీంకోర్టు విస్పష్టం చేసింది. రుతుస్రావం కారణంగానూ వివక్ష కారణంగా 10,50 మధ్య వయసు బాలికలు, మహిళలకు ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తూ సదరు దేవస్థానం తీసుకున్న నిర్ణయంపై భారత యువ న్యాయవాదుల సంఘం తదితర పార్టీలు దాఖలుచేసిన వ్యాజ్యం విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలతో కూడిన రాజ్యంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘‘పురుషుడు ఆలయంలోకి వెళ్లగలిగినప్పుడు… మహిళ కూడా వెళ్లగలుగుతుంది. రాజ్యంగంలోని ఆర్టికల్‌ 25, 26 ప్రకారం పురుషులకు వర్తించేవన్నీ మహిళలకు కూడా వర్తిస్తాయి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

మహిళలకు ఆలయ ప్రవేశంపై ప్రభుత్వం మద్దతు..కోర్టు వ్యాఖ్యలు..
మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించేందుకు మద్దతు పలుకుతూ కేరళ ప్రభుత్వం 2015లో సుప్రీంకు తొలి అఫిడవిట్‌ను దాఖలుచేసింది. దానికి విరుద్ధమైన అభిప్రాయం వ్యక్తంచేస్తూ 2017లో ఇంకో అఫిడవిట్‌ను సమర్పించింది. దీంతో ఇదేమిటని ధర్మాసనం ప్రశ్నించగా, తొలి అఫిడవిట్‌కే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ రాష్ట్రం తరఫు న్యాయవాది సమాధానమిచ్చారు. దీంతో ‘సమయానుకూలంగా మారిపోతున్నారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సుప్రీంకోర్టుతో భేష్' అనిపించుకు న్యాయవాది దీపక్ ..
కేరళలోని పరమ పవిత్ర శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలకు ప్రవేశం కల్పించాలా? వద్దా? అన్న విషయమై, సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన హైదరాబాద్ న్యాయవాది సాయి దీపక్, ధర్మాసనంతో 'భేష్' అనిపించుకున్నారు. తనను తాను దేవుడి తరఫు న్యాయవాదిగా ప్రకటించుకున్న న్యాయవాది దీపక్ 10 నిమిషాల సమయం ఇచ్చిన ధర్మాసనం సమయం ప్రకారం తన వాదనలను వినిపించాడు. తన వాక్పటిమ, లాజిక్ తో సాయి దీపక్ వాదన రెండు గంటల పాటు సాగింది. ఆయన వాదన జ్ఞాన బోధకంగా ఉందని న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారిమన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

దేవుడికి వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీ వున్నాయి: దీపక్
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ఆలయ యజమాని అయిన దేవుడికి, తన ఇంట్లో వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీ వున్నాయని, నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని కాపాడుకోవడం అందులో భాగమేనని దీపక్ వాదించారు. దేవుడు కూడా న్యాయబద్ధమైన వ్యక్తిగా గతంలో కోర్టు గుర్తించిందని గుర్తు చేశారు. మహిళల హక్కుల సంగతి సరే..మరి దేవుడి విశ్వాసాలకు విలువ లేదా? ఆయనకూ హక్కులన్నీ ఉంటాయి. బ్రహ్మచారిగా ఉండే హక్కు ఆయనకుంది. దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆలయానిదే" ననీ..రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) కింద ప్రజలకు తమ ధర్మాన్ని పాటించే హక్కు ఉన్న విధంగానే, దేవుడికి కూడా తన ధర్మాన్ని పాటించే స్వేచ్ఛ ఉందన్న దీపక్ వాదన సాక్షాత్తు ధర్మాసనంతో సహా అందరినీ ఆకట్టుకుంది.
ఏడు రోజుల్లోగా వాదనను తెలిపాలి : సుప్రీం
ఆపై కేసుకు సంబంధించిన వాదనలు పూర్తయ్యాయని చెప్పిన ధర్మాసనం, ఉభయపక్షాల న్యాయవాదులు మరేదైనా చెప్పాలనుకుంటే, ఏడు రోజుల్లోగా తమ వాదనను సంక్షిప్తంగా తెలియజేయాలని ఆదేశిస్తూ, తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఇలా వుంటే మహిళలకు ఆలయం ప్రవేశం రాజ్యాం హక్కుగా స్పష్టం చేసిన దేశ అత్యున్నత న్యాయం అయిన సుప్రీంకోర్టు దీపక్ వాదనలను ప్రశంసిచంతో మరోసారి మహిళా హక్కులు డైలమాలో పడ్డాయి. దీనిపై అటు మహిళా హక్కుల్ని, మరోపక్క న్యాయాన్ని పరిరక్షించాల్సిన బాద్యతపై సుప్రీంకోర్టు స్పష్టతనివ్వాల్సిన అవసరముంది.  

07:59 - July 24, 2018

ఢిల్లీ : హస్తినలో జంతర్‌ మంతర్‌, బోట్‌ క్లబ్‌ వద్ద ఆందోళనలపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఢిల్లీ వ్యాప్తంగా ప్రదర్శనలపై స్టే విధించ లేమని కోర్టు స్పష్టం చేసింది. కాలుష్యం కారణంతో జంతర్‌ మంతర్‌, బోట్‌ క్లబ్‌ వద్ద ధర్నాలపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ 2017లో స్టే విధించింది. అప్పటి నుంచి పోలీసులు ప్రదర్శనలకు అనుమతించడం లేదు. సెంట్రల్‌ ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హక్కుల కోసం ధర్నా చేయడం తమ ప్రాథమిక హక్కుగా పేర్కొంది. 

 

12:46 - July 23, 2018

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పోలవరం నిర్మాణం వల్ల సమస్యలేంటో చెప్పాలని ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. తమ సమస్యలు చెప్పాలని ఎన్నిసార్లు కోరినా... ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి ఏపీ తీసుకువచ్చింది. దీంతో ఈనెల 30లోగా ఏయే అంశాలపై విచారణ చేపట్టాలో చెప్పాలని తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గడ్‌ ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది... లేకపోతే ఏయే అంశాలను విచారణకు చేపట్టాలో నిర్ణయిస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. 

 

20:52 - July 17, 2018

గో సంరక్షణ పేరుతో జరుగుతున్న దాడులను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది.. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకునే హక్కు లేదని చెప్పింది. గుంపుగా దాడి చేయడాన్ని ఆపాల్సిన బాధ్యత ఆయ రాష్ట్రాలదేనని తెలిపింది. దాడులకు పాల్పడే వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టం తేవాలని సూచించింది. ఇదే అంశంపై నిర్వహించిన 'దాడులు ఆపండి' కార్యక్రమంలో ప్రముఖ అడ్వకేట్ సురేష్ పాల్గొని, మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని దాడులను అరికట్టాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

Pages

Don't Miss

Subscribe to RSS - supreme court