strategies

08:42 - October 10, 2018
హైదరాబాద్ : తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపి పావులు కదుపుతోంది. ఎన్నికల ప్రచార బరిలోకి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిగారు. నేడు కరీంనగర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్న ఆయన.. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ తీరును ఎండగట్టనున్నారు. మరోవైపు అమిత్ షా పర్యటన తరువాత అభ్యర్ధుల జాబితా విడుదల చేసేందుకు బీజేపి కసరత్తు ముమ్మరం చేసింది. 
భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న షా.. ముందుగా బంజారాహిల్స్ లోని అగ్రశ్రేన్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత కాచీగూడలోని శ్యాంబాబా మందిర్ లో సాధువులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాలకు ఎగ్బిబిషన్ గ్రౌండ్ లో సికింద్రాబాద్, హైదరాబాద్, చేవేళ్ల, మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ కేంద్ర స్థాయి నాయకులను కలుస్తారు. మధ్యాహ్నం భోజన విరామం తరువాత ప్రత్యేక హెలీకాఫ్టర్లో కరీంనగర్ బయల్దేరతారు. బీజేపి తలపెట్టిన సమరభేరీ సభలో పాల్గొంటారు. 
 
అమిత్ షా పర్యటన తరువాత తమ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వెల్లడించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆరే కారణమని విమర్శించారు. ప్రజల తీర్పును వృథా చేయడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్లేనన్నారు.
 
అమిత్‌షా పర్యటనతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు దడపుడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, మోడీ ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. ముందుస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తామన్న లక్ష్మణ్.. కాంగ్రెస్ నేతలు.. తెలంగాణ ద్రోహులతో జత కట్టి మహాకూటమిగా ఏర్పడ్డారని మండిపడ్డారు.
08:01 - October 9, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కింగ్‌ మేకర్‌ కావాలని బీజేపీ భావిస్తోంది.టీఆర్‌ఎస్‌, మహాకూటమిల మధ్య హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్న కమల దళం.. టీఆర్‌ఎస్‌కు మెజారిటీ తగ్గితే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని యోచిస్తోంది! ఆ దిశగా దూకుడు పెంచింది! వ్యూహాలకు పదును పెడుతోంది! రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి దేశం నలుమూలల నుంచి నేతలను రప్పించాలని నిర్ణయించింది! అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నప్పటికీ.. 30 సీట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. కచ్చితంగా 15 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల వ్యూహాల అమలుకు పార్టీ, సంఘ్‌ పరివార్‌ ఉమ్మడి కార్యాచరణతో రంగంలోకి దిగుతున్నాయి. 
ఒకవైపు పార్టీ పొరుగు రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలను రంగంలో దింపుతుండగా, మరోవైపు సంఘ్‌ పరివార్‌ క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ప్రచారానికి 15మంది పార్టీ సీఎంలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 100మంది ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి నేతలు రానున్నారు. కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలనుంచి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ చేరుకున్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు, కర్ణాటక తరహాలో ఇంటింటికీ ప్రచారం చేసేందుకు సంఘ్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. 31 జిల్లాల నుంచి ఆరెస్సెస్ కు సంబంధించిన అన్ని అనుబంధ సంస్థల సభ్యులకు ఈ అంశంపై హైదరాబాద్‌లో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

15:56 - September 8, 2018

హైదరాబాద్‌ : ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో పలు సమస్యలను ఫేస్ చేస్తోంది. విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఐదు సంవత్సరాలు నిండకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించింది. దీంతో విపక్షాలు కూడా ఎన్నికలలో అవలంభించాల్సిన వ్యూహాలపై..పొత్తులపైనా కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీ.టీడీపీపై యోచించేందుకు హైదరాబాద్ కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుత రాజకీయ..పార్టీల విధి విధానాలపై నేతలతో ఆరా తీసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఆటుపోట్లు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదన్నారు. కమ్యూనిస్టు పార్టీలు, కో దండరాం పార్టీ వైఖరిపై నేతలను ఆరా తీశారు. తెలంగాణలో తెదేపా పట్ల ఆదరణ తగ్గలేదని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో 20 సీట్లలో 35 శాతం ఓటింగ్‌ పదిలంగా ఉందని.. తెదేపా బలం చెక్కు చెదరలేదని..ప్రజల్లో తెరాసపై తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

36 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు చూశామని అన్నారు. తెలుగు ప్రజల ఆదరాభిమానాలతో తెదేపాకు వన్నె తగ్గలేదన్నారు. వారి అభిమానమే పార్టీకి తరగని ఆస్తి అనీ..కార్యకర్తలే తెదేపా సంపదని వివరించారు. దేశంలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండాలన్నదే తన ఎప్పటికీ తన ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు తెలిపారు. 

06:31 - June 26, 2017

కర్నూలు : గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన భూమా నాగిరెడ్డి అధికార పార్టీలో చేరడంతో నంద్యాలలో స్ధానాన్ని కోల్పోయింది వైసిపి. భూమా నాగిరెడ్డి మరణం తరువాత అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. పోగొట్టుకున్న చోటే స్ధానం దక్కించుకోవాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తోంది వైసిపి.

వ్యూహాలతో ముందుకెళ్తున్న టిడిపి, వైసిపి

నంద్యాల ఉప ఎన్నికపై అధికార టిడిపి, వైసిపి ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. నంద్యాల స్ధానాన్ని దక్కించుకోవాలని టిడిపి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా భూమా కుటుంబానికి అవకాశం ఇచ్చారు సీఎం చంద్రబాబు. భూమా నాగిరెడ్డి అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇచ్చారు. మరోవైపు ఉప ఎన్నికలో ఏకగ్రీవానికి రావాలని, చనిపోయిన వారి కుటుంబానికి అవకాశం ఇవ్వాలన్న సంప్రదాయాన్ని కొనసాగిద్దామని ప్రతిపక్ష నేత జగన్‌తో మంతనాలు ప్రారంభించారు టిడిపి నేతలు. ఈ నేపథ్యంలోనే నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధిగా ఇటీవల పార్టీలో చేరిన శిల్పా మోహన్‌రెడ్డిని ప్రకటించారు జగన్.

నంద్యాల గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్న జగన్

మొదటి నుంచి నంద్యాల స్ధానం మాదే అన్న వాదనను వినిపిస్తోంది వైసిపి. బిఫామ్‌తో గెలిచిన స్ధానం కనుక ఆ స్ధానం మాదే అంటున్నారు వైసిపి నేతలు. ఈ నేపథ్యంలోనే వైసిపి తమ అభ్యర్ధిని ప్రకటించింది. అంతేకాకుండా ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదల వ్యూహాలు రచిస్తున్నారు జగన్. త్తానికి నంద్యాల ఉప ఎన్నికకు రెండు పార్టీలు సిద్ధం అవుతున్నాయి. మరి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారో? ఎవరిని విజయం వరిస్తుందో? వేచి చూడాల్సిందే.

21:18 - January 17, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ అభ్యర్థుల జాబితా ప్రకటనలో. టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ క్రమంలో.. ఆఖరు క్షణం వరకూ ఉత్కంఠను కొనసాగించింది. నామినేషన్‌ల గడువు ముగియడానికి గంట ముందు మాత్రమే.. ఆపార్టీ అభ్యర్థుల జాబితాను వెలువరించింది. అవకాశం దక్కని ఆశావహులు.. పార్టీ నిర్ణయంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకున్నారంటూ.. రోడ్డెక్కారు. చర్చోపచర్చలు.. తర్జన భర్జనలు.. ఆశావహుల అలకలు.. అధినాయకుల అనునయాలు.. ఇలా రసవత్తర సన్నివేశాల నడుమ.. తెలుగుదేశం పార్టీ గ్రేటర్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. బీజేపీతో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చాక.. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌ ఆధ్వర్యంలో.. టీడీపీ తెలంగాణ నాయకులు.. గ్రేటర్‌ అభ్యర్థుల ఎంపికపై దాదాపు 24 గంటల పాటు ఏకధాటిగా కసరత్తు చేశారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకూ మల్లగుల్లాలు పడి జాబితాను ఖరారు చేశారు.

భారీ కసరత్తు..
సామాజిక న్యాయం విషయంలోనూ టీడీపీ భారీ కసరత్తు చేసినట్లు జాబితాను బట్టి అర్థమవుతోంది. బీసీ ముస్లింలకు 14 స్థానాలు, యాదవులకు పది, గౌడ కులస్థులకు 9, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు ఏడేసి డివిజన్‌లను కేటాయించారు. మున్నూరు కాపులకు 6, ముదిరాజ్‌లకు నాలుగు, వడ్డెరలకు రెండు డివిజన్‌లను కేటాయించారు. వెలమలు సహా.. మిగిలిన ప్రధాన కులాల వారికి ఒక్కో డివిజన్‌ను కేటాయించారు.

సెటిలర్స్ కు ప్రాధాన్యత..
డిప్యూటీ మేయర్‌ పదవిని సెటిలర్స్‌కు ఇస్తామని ప్రకటించిన టీడీపీ-బీజేపీ కూటమి.. అభ్యర్థుల ఎంపికలోనూ సెటిలర్స్‌కు ప్రాధాన్యతనిచ్చింది. రాజేందర్‌నగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సోదరుడు ప్రేమదాస్‌గౌడ్‌ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌నుంచి పోటీ చేస్తున్నారు. అటు స‌నత్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇంచార్జి కూన వెంక‌టేష్ గౌడ్ స‌తీమ‌ణి సత్యక‌ళాగౌడ్.. బేగంపేట డివిజ‌న్ నుంచి బ‌రిలో నిలిచారు. శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆశించి భంగ‌ప‌డ్డ.. బండి ర‌మేశ్‌ గ్రేటర్‌ ఎన్నికల్లో... మియాపూర్ డివిజ‌న్ నుంచి బరిలో నిలుస్తున్నారు. టీడీపీ ఆశించిందే జరిగితే.. రమేశ్‌ పేరును డిప్యూటీ మేయర్‌ పదవికి ప్రతిపాదించే అవకాశాలున్నాయి.

ఆందోళన..
మరోవైపు టీడీపీ టికెట్‌ ఆశించి భంగపడ్డ పలువురు నాయకులు.. జాబితా విడుదల కాగానే.. పార్టీ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. టిక్కెట్లు అమ్ముకుంటున్నారంటూ పలువురు ముఖ్య నేతలపై విమర్శలు గుప్పించారు. సలీమ్ న‌గ‌ర్, మన్సురాబాద్ డివిజ‌న్ల సిట్టింగ్ కార్పొరేట‌ర్ల‌కు టిక్కెట్లు ఇవ్వకపోవడంతో వారి అనుచ‌రులు నిర‌స‌న‌కు దిగారు. సీతాఫ‌ల్ మండి కార్యకర్తలు కూడా త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ ఆందోళ‌న‌కు దిగ‌డంతో పార్టీ నేత‌లు నచ్చ చెప్పారు. కొన్ని డివిజ‌న్ల‌ను బీజేపీకి కేటాయించ‌డంపైనా ప‌లువురు టీడీపీ కార్యకర్తలు నిర‌స‌నకు దిగారు.

తలనొప్పి...
ఎఎస్ రావ్‌ నగర్‌, చందానగర్‌, రామచంద్రాపురం, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, మోండా మార్కెట్‌ డివిజన్‌లకు అభ్యర్థుల ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇక్కడ ఆశావహుల మధ్య విపరీతమైన పోటీ ఉండడంతో... తొలుత ఆశావహులతో నామినేషన్‌లు వేయించి.. ఆ తర్వాత ఎంపిక చేసిన వారికి బీ-ఫాం ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తానికి గతానుభవాల దృష్ట్యా, వలసలను నిలువరించేందుకు... ఇతర పార్టీల జాబితాలు వెలువడ్డాకే తమ అభ్యర్థుల పేర్లు ప్రకటించాలన్న టీడీపీ వ్యూహం ఫలించిందనే చెప్పాలి. అయితే... పార్టీ అభ్యర్థిత్వం ఆశిస్తూ ఇప్పటికే నామినేషన్‌లు దాఖలు చేసిన వారిచేత ఉపసంహరింప చేయడం పార్టీ నేతలకు ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. 

22:42 - December 31, 2015

కోల్ కతా : ఎ్రరజెండా మరింత ఎరుపెక్కింది. ఎదురీతను అధిగమించి దమ్ము చూపించటానికి మార్క్సిస్టులు ముందడుగు వేస్తున్నారు. సరికొత్త పంథాలో సమరం చేయటానికి సంసిద్ధమయ్యారు. ప్రజాపోరాటాలతో మమేకమై.. స్వతంత్ర పోరాటాలతో పదునెక్కాలని ప్రతిన పూనారు. వామపక్షాల ఐక్యతకు ప్రాధాన్యతనిచ్చి  లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ను బలపర్చుకునే దిశగా పయనించాలని సీపీఎం ప్లీనం నిర్ణయించింది.

పార్టీ నిర్మాణం, ఎత్తుగడలపై సీపీఎం ప్లీనం
ఎన్నో ఎత్తుగడలు .. మారుతున్న పరిస్ధితుల్లో ఎదురవుతున్న కొత్త సవాళ్లు.. ప్రజాపునాదిని పెంచుకోవటానికి.. పార్టీ నిర్మాణాన్ని, ఎత్తుగడల పంథాలను పునఃసమీక్షించుకోవటానికి సీపీఎం కోల్‌కతాలో ప్లీనం నిర్వహించింది. 27 నుంచి 31 వరకు ఐదురోజులపాటు జరిగిన ఈ ప్లీనంలో.. నిర్మాణ ముసాయిదా నివేదికపై చర్చించారు.

ముసాయిదా నివేదికకు 191 సవరణలు
ముసాయిదా నివేదికకు 191 సవరణలను ప్రతినిధులు ఈ ప్లీనంలో సూచించారు. వాటిలో 36 సవరణలు ఆమోదం పొందాయి. అలాగే నిర్మాణంపై ముసాయిదా తీర్మానానికి 73 సవరణలు రాగా, ఆరు ఆమోదం పొందాయి. ముసాయిదా నివేదికపై పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్‌ వివరణ ఇవ్వగా, నిర్మాణ ముసాయిదా తీర్మానంపై పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చర్చకు బదులిచ్చారు.

ప్రజా సమస్యలపై స్వతంత్ర పోరాటాలు
పార్టీని బలోపేతం చేయాలని, ప్రజాపోరాటాలను స్వతంత్రంగా నిర్వహించేలా సమర్ధతను పెంపొందించుకోవాలని ప్లీనం నిర్ణయించింది. సామాజిక ఆర్ధిక సమస్యలపై విస్తృతంగా పోరాటాలను నిర్మించాలని సీపీఎం భావించింది. మొత్తం మీద భారతదేశంలో సీపీఎం బలమైన పార్టీగా రూపొందడానికి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన వ్యూహంతో ప్రజల ముందుకొస్తోంది.

Don't Miss

Subscribe to RSS - strategies