prices

14:43 - September 20, 2018

ఢిల్లీ : ప్రస్తుత రోజుల్లో అన్నింటి ధరలు సామాన్యుడి చుక్కలు చూపిస్తున్నాయి. అసలే పెట్రోలు ధరలు పెరిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్న నేపథ్యంలో సామాన్యుడి ప్రయాణ సాధనాల్లో ఒకటి అయిన రైల్‌లో కనీసం ఒక్క టీగానీ, కాఫీగానీ తాగాలంటే కూడా అదనపు డబ్బులు చెల్లించుకుంటేనే గానీ గొంతులో టీ నీళ్లు పడే అవకాశం లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియాలోని రైళ్లలో టీ, కాఫీల ధరను పెంచుతున్నట్టు ఐఆర్సీటీసీ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రస్తుతం రూ. 7గా ఉన్న ధరను రూ. 10కి పెంచుతున్నామని తెలిపింది. డిప్ టీ కాకుండా, మామూలు టీని రూ. 5కే అందిస్తామని రైల్వే బోర్టు పేర్కొంది. 

 

16:12 - September 14, 2018

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన ధరలు ఇవాళ ఇంకాస్త పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 28పైసలు, డీజిల్‌ పై 22పైసలు ధర పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 81.28 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 77.82 రూపాయలకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 88.39 రూపాయలు కాగా, లీటర్ డీజిల్ 77.82 రూపాయలు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 84.49, డీజిల్ రూ.77.49 లకు పెరిగాయి. కోల్‌కత్తాలో పెట్రోల్ రూ. 83.14, డీజిల్ రూ. 75.15లకు పెరిగింది. పెట్రో ధరలపై వాహనదారులు  భగ్గుమంటున్నారు. 

14:29 - September 7, 2018

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల నెత్తిన అదనపు భారాలు పడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరుగతు సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించటంలేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగి సామాన్యులకు సవాల్ విసురుతున్నాయి. దీంతో ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. రూపాయి విలువ పతనమవుతుండటం పెట్రో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి తోడు ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ రోజు కూడా పెట్రోలియం కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ముంబైలో పెట్రోల్ ధర ఆల్ టైమ్ హైని తాకింది. ఈరోజు ఏకంగా లీటర్ కు 52 పైసలు పెరిగి రూ. 87.39కి చేరుకుంది. డీజిల్ ధర రూ. 79.99కి చేరింది. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 84.91, డీజిల్ ధర రూ. 78.48కి పెరిగింది.   

18:27 - September 4, 2018

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం తారాస్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్ పై 16 పైసలు, డీజిల్ పై 19 పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోలు లీటరు ధర రూ.84.09 కు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకోకపోతే లీటరు ధర వంద రూపాయలకు చేరుకొన్నా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎటవంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. పైగా బీజేపీ నేతలు పెట్రో ధరల పెరుగుదలపై వ్యంగ వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిస్తోంది.  
పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదన ముందుకు కదలడం లేదు. పిల్లికి ముందుగా ఎవరు గంట కడతారు అన్న చందంగా కేంద్రం రాష్ట్రాల వైపు చూస్తోంది. ఈ ధరల భారాన్ని మోయలేక సామాన్యడు కుదేలవుతున్నాడు. 

10:11 - July 31, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. గ్రామాలతోపాటు రహదారులు, జాతీయ రహదారుల వెంబడి ఉన్న భూముల ధరలు నింగిని తాకనున్నాయి. ఆగస్టు1 నుంచే కొత్తధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

29 గ్రామాల్లో శరవేగంగా రాజధాని నిర్మాణం
రాజధానిగా అమరావతిని ప్రకటించాక అక్కడి భూముల ధరలు చుక్కలంటుతున్నాయి. తాజాగా భూముల ధరలు పెంచేందుకు సర్కార్ మొగ్గు చూపుతోంది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో రాజధాని నిర్మాణంలో వేగం పెంచిన ప్రభుత్వం.. రాజధానితో పాటు.. కొన్ని ప్రాజెక్టులకు కూడా భూములు అవసరమని నిర్ణయించింది. దీంతో రియల్ ఎస్టేట్ ధరలు అందనంత ఎత్తుకు చేరే అవకాశం కనిపిస్తోంది.

ఎకరా ధర రూ. 5.50లక్షల నుంచి రూ.5.77లక్షలు..
ఉండవల్లి, నవులూరు, కృష్ణాయపాలెం, కురగల్లు, నిడమర్రు, పెనుమాక, వెంకటాయపాలెం పరిధిలో ప్రాంతాన్ని బట్టి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎకరా ధర 5లక్షలా 50వేల నుంచి 5లక్షలా 77వేలకు, 6లక్షలా 60వేలనుంచి, 6 లక్షలా 93వేలకు, 9లక్షలా 90వేలనుంచి, 10 లక్షలా 39వేలకు , 11లక్షలనుంచి 11లక్షలా 55వేలకు, 19లక్షలా 80వేలనుంచి, 20 లక్షలా79వేలకు చేరనున్నాయి. చెన్నై-కోల్‌కతా హైవేను ఆనుకుని ఉన్న.. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, ఆత్మకూరు, పెదవడ్లపూడి, చినవడ్లపూడి, కుంచనపల్లి, నూతక్కి, రామచంద్రాపురం, విప్పటం, కొలనుకొండ, గుండిమెడ, పెదరావూరు, చిర్రావూరు గ్రామాల్లోనూ ఒక్కోచోట ఒక్కో ధర ఉంది.

గుండిమెడలో రూ. 27. 50లక్షలు నుంచి రూ. 28.87లక్షలు..
గుండిమెడలో ప్రస్తుతం ఎకరా 27లక్షలా 50వేలు ఉండగా.. 28లక్షలా 87వేలకు చేరుకోనుంది. మంగళగిరిలో 33 లక్షలు ఉన్నభూమి 34లక్షలా 65వేలు కానుంది. కుంచనపల్లిలో ప్రస్తుతం 50 లక్షలు ఉండగా.. 52లక్షలా 56వేలకు వెళ్లనుంది. చిన్నవడ్లపూడి 46లక్షలా 20వేలు కాగా, 48 లక్షలా 51 వేలకు, నూతక్కిలో 19 లక్షలా 80వేలనుంచి 20 లక్షలా 79వేలకు పెరుగనున్నాయి. చిర్రావూరు 16 లక్షలా 50వేలు కాగా.., 17 లక్షలా 32వేలకు, కొలనుకొండ 40 లక్షలు కాగా 42 లక్షలకు చేరనుంది.

ఎకరా రూ.6.60లక్షలు నుంచి 6.93లక్షలు కానుంది..
మందడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో మందడం, తాళ్లాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, మోదుగుల లంకపాలెం, మల్కాపురం, వెలగపూడి, కొండమరాజుపాలెంలో.. ఎకరా 6లక్షలా 60వేలు ఉండగా.. 6 లక్షలా93వేలకు చేరుకోనుంది. తుళ్లూరు కార్యాలయం పరిధిలోని తుళ్లూరు, నేలపాడు, దొండపాడు, పిచ్చుకులపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూడి గ్రామాల పరిధిలో ఏరియాను బట్టి ధర ఉంది. 3లక్షలా 30వేలనుంచి 3లక్షలా 46వేలు, 4లక్షలా 40వేల నుంచి 4లక్షలా 62వేలు, 6లక్షలా 60వేల నుంచి 6లక్షలా 93వేలు, 8లక్షలా 80వేల నుంచి 9లక్షల 24వేలు ధర పలుకుతోంది.అనంతవరం సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని అనంతవరం, నెక్కల్లు, ఐనవోలు, శాఖమూరు గ్రామాల్లో 3లక్షలా 30వేలున్న ఎకరా భూమి.. 3లక్షలా 46 వేలకు చేరుకోనుంది. ఈ నిర్ణయం రాజధాని ముఖ్య ప్రాంతాలను దృష్టిలో పెట్టుకునే తీసుకున్నారు. 29 గ్రామాలతోపాటు రాజధాని సమీపంలోని ప్రముఖ ప్రాంతాల్లోని ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. 

07:08 - November 10, 2016

హైదరాబాద్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో... బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. మరోవైపు నోట్ల రద్దు ఎఫెక్ట్ తమ వ్యాపారంపై పడుతోందని బంగారం వ్యాపారులు వాపోతున్నారు.

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ప్రధాని నిర్ణయం
నల్లధనం నియంత్రణకు ప్రధాని తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడంతో ఆ ఎఫెక్ట్ పసిడి బిజినెస్‌పై పడింది.

నోట్ల రద్దు నిర్ణయం తమ బిజినెస్‌కి దెబ్బేనంటున్న గోల్డ్ వ్యాపారులు
చాలా మంది... పెద్ద నోట్లను బంగారు ఆభరణాలు, గోల్డ్‌ బిస్కెట్లు కొనేందుకు వినియోగిస్తుండడంతో పసిడి మార్కెట్‌ ఊపందుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు కూడా చాలా చోట్ల పెద్దపెద్ద స్వర్ణాభరణాల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. దీంతో వ్యాపారులు బంగారు ధరలను అమాంతంగా పెంచేశారు. అయినా ప్రజలు బంగారు కొనేందుకే ఉత్సాహం చూపారు.

ఢిల్లీలో రూ.900 పెరిగి రూ.31,750కి చేరిన 10గ్రా.బంగారం ధర
పెద్దనోట్లను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల.. దేశవ్యాప్తంగా బంగారు వ్యాపారం బాగా పుంజుకుంది. దేశరాజధానిలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.900 పెరిగి రూ.31,750కి చేరింది. వెండి ధర కూడా భారీగా పెరిగి రూ.45వేల మార్కును తాకింది. కేజీ వెండి రూ.1,150 పెరిగి రూ.45వేలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4.8శాతం పెరిగి 1,337.38 డాలర్లకు చేరింది.

బంగారు వ్యాపారానికి ఇబ్బందేనంటున్న వ్యాపారులు
ప్రస్తుతం.. తమ వ్యాపారం పుంజుకున్నట్లు కనిపిస్తున్నా.... ఇది తమ బిజినెస్‌కి పెద్ద దెబ్బేనని అంటున్నారు గోల్డ్ షాప్ యజమానులు. కొన్ని నెలలుగా పసిడి వ్యాపారం స్తబ్దుగా ఉందని, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఇప్పుడిప్పుడే బంగారం కొనుగోళ్లు పుంజుకుంటున్నాయని, మధ్యతరగతి ప్రజలు తమ వద్ద కూడబెట్టుకున్న మొత్తంతో బంగారు కొనేందుకు వస్తుంటారని, అయితే ప్రధాని నిర్ణయం వల్ల.. వారివద్దనున్న నగదు చెల్లుబాటు కాని పరిస్థితి ఏర్పడిందని స్వర్ణవ్యాపారులు చెబుతున్నారు. ఇది తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడం కూడా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా పరిణామాలతో పసిడి ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. 

18:43 - July 27, 2016

ఢిల్లీ : నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై రాజ్యసభలో సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. గత రెండేళ్లలో పప్పుల ధరలు వందశాతం పెరిగాయని సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి అన్నారు. ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 106 డాలర్లుంటే 2016 జనవరి నాటికి 26 డాలర్లకు పడిపోయినా భారత్‌ పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గించలేదన్నారు. మోది సర్కార్‌ అధికారంలోకి వచ్చాక పెట్రోల్‌ డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని 9 సార్లు విధించడం ద్వారా వినియోగదారులపై భారం మోపిందని ఏచూరి పేర్కొన్నారు. ధరల పెరుగుదలకు ప్రభుత్వం పరోక్షంగా పన్నులు విధించడమే కారణమన్నారు.

15:51 - July 11, 2016

హైదరాబాద్ : సామాన్యుడిపై ధరలు దరువేస్తున్నాయి. కిరాణా షాపు కెళ్తే పర్సులు ఖాళీ అవుతున్నాయి. వంటింట్లోకి వెళ్తే ఏడుపొస్తోంది. ఎవరిని పలకరించినా ఇదే బాధ. ఇదే ఆవేదన. రోజురోజుకీ ఇలా ధరలు పెరుగుతుంటే ఏం తినాలి? ఎలా బతకాలి? ఇదే ప్రశ్న. అందరిలోనూ ఇదే ఆగ్రహం.

గడిచిన రెండేళ్లలో పెరిగిన ధరలు ....
పంచదార 45..శనగపప్పు 88..పెసరపప్పు 100..కందిపప్పు 150..పల్లీలు 150..మినపప్పు 180..ఇలా ఏది కొనాలన్నా ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. సంచుల్లో డబ్బులు తీసుకెళ్లి, హ్యాండ్ బ్యాగ్ లో సరుకులు తెచ్చుకోవాల్సిన దారుణమైన రోజులొచ్చాయి.

వంద రోజుల్లో ధరలు నియంత్రిస్తామన్న మోదీ...
2014 ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ధరలు నియంత్రిస్తామంటూ అప్పట్లో నరేంద్ర మోడీ ప్రచారం చేశారు. బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ధరలు తగ్గలేదు. పై పైకి ఎగబాగుతున్నాయి .

2014 మే నెలలో కిలో పెసరపప్పు ధర 87..ఇప్పుడు వంద దాటింది..
2014 మే నెలలో కిలో పెసరపప్పు ధర 87 రూపాయలు వుండేది. అదిప్పుడు వంద రూపాయలు దాటింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాక ముందు 39 రూపాయలున్న శనగపప్పు ధర 88 రూపాయలైంది. మోడీ అధికారంలోకి రాకముందు 72 రూపాయలు పెడితే కిలో కందిపప్పు వచ్చేది. ఇప్పుడు 150 రూపాయలు పెట్టందే కందిపప్పు దొరకడం లేదు. రెండేళ్ల క్రితం నెలకు రెండు కిలోల కంది పప్పు వాడిన కుటుంబాలు ఇప్పుడు కేవలం ఒకే ఒక్క కిలోతో సరిపెట్టుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రతి రోజూ ముద్దపప్పు , నెయ్యి ఆరగించిన ఇళ్లలో ఇప్పుడు వారానికోసారి హాలిడే అకేషన్ గా మాత్రమే వాటిని తిన్నామనిపిస్తున్నారు.

చుక్కలు చూపిస్తున్న బ్రేక్ ఫాస్ట్...
రెండేళ్ల క్రితం కిలో మినపప్పు ధర కేవలం 72 రూపాయలు. ఇప్పుడు 180 దాటింది. రెండొందలు దాటినా ఆశ్చర్యపోవద్దన్నది మార్కెట్ టాక్. గతంలో వారంలో కనీసం ఒక్కరోజైనా ఇడ్లీలు, దోసెలు ఆరగించిన కుటుంబాలు ఇప్పుడు నెలకోసారి కూడా వాటి జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే మినపప్పుతో పాటు పల్లీల ధరలు కూడా అమాంతం పెరిగాయి. ఇడ్లీకైనా, దోసెలకైనా పక్కన పల్లీ చెట్నీ వుంటేనే టేస్ట్. కానీ, మార్కెట్లో పల్లీల ధర వెక్కిరిస్తోంది. ఈ రెండేళ్లలో 50 రూపాయలున్న పల్లీల ధర మూడు రెట్లు పెరిగి 150 రూపాయలైంది. అందుకే హోటల్స్ లో కూడా ఇడ్లీ, దోసె, పూరీ, చపాతీ అన్నింటి ధరలూ పెరిగాయి. ఇద్దరు స్నేహితులో, భార్యాభర్తలో హోటల్ కెళ్లి టిఫిన్ చేస్తే మినమిమ్ వంద రూపాయల కాగితం ఎగిరిపోతోంది.

కాకపుట్టిస్తున్న 'ఛాయ్'...
టిఫిన్ తినగానే వేడివేడిగా ఘుఘుమలాడే చాయ్ తాగాలనిపిస్తుంది. కానీ, హోటల్లో కప్పు కాఫీ తాగాలన్నా భయమేస్తోంది. రెండేళ్ల క్రితం నాలుగైదు రూపాయలున్న కప్పు టీ ధర ఇప్పుడు పది రూపాయలైంది. చాలాకాలం నిలకడగా వున్న పంచదార, టీ పొడి ధరలకు రెక్కలు రావడమే ఇందుకు కారణం. నిన్న మొన్నటి దాకా 33 రూపాయలున్న పంచదార ఇప్పుడు 42 దాటింది. కనీసం రెండొందలు పెట్టందే పావు కిలో టీ పొడి రావడం లేదు.

మూడు రెట్లు పెరిగిన ధరలు...
ఈ రెండేళ్లలో వంటింట్లో వాడే నిత్యావసరాల ఖర్చు రెండు మూడు రెట్లు పెరిగింది. దీంతో టీలు, టిఫెన్ లు, పప్పన్నాలు మానేస్తున్నాయి చాలా కుటుంబాలు. పచ్చడి, ముద్దపప్పు, నెయ్యి ఈ మూడింటి కాంబినేషన్ కి అలవాటు పడ్డవారు కూడా ఇప్పుడు వట్టి పచ్చడి మెతుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు 280 రూపాయలున్న కిలో నెయ్యి ధర ఇప్పుడు 480 దాటింది.

అధిక ధరలతో పెరుగుతున్న రక్తహీనత...
పప్పు, కూర, పచ్చడి,నెయ్యి, చారు, పెరుగు, అప్పడం ఇలా షడ్రషోపేత వంటకాలతో కళకళలాడిన డైనింగ్ టేబుల్స్ ఇప్పుడు చాలా ఇళ్లలో బోసిపోయి కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి మనిషీ రోజుకి సగటున కనీసం 80 గ్రాముల పప్పు దినుసులు తినాలి. కానీ, మన దేశంలో తలసరి అందుబాటు 40 నుంచి 45 గ్రాములు మాత్రమే. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు ఈ మాత్రం భాగ్యానికి కూడా దూరం చేస్తున్నాయి. ఆహారంలో పప్పు ధాన్యాలు తగ్గించుకోవడం వల్ల దాని ప్రభావం ఆరోగ్యం మీద పడుతోంది. గర్భీణీలు సరైన మోతాదులో మాంసక్రుత్తులు తీసుకోకపోతే, పుట్టే పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది. పిల్లల బాడీ ఫంక్షన్స్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఆడ, మగ, పిల్లలు, యువకులు, వ్రుద్ధులు అనే తేడా లేకుండా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. చిన్న పుండు పడినా అది మానడానికి చాలాకాలం పడుతుంది. జుత్తు రాలిపోయే అవకాశం వుంది. శరీరం నిస్సత్తువగా మారుతుంది. పప్పుధరల పెరుగుదల కుటుంబ బడ్జెట్ నే కాదు కుటుంబ ఆరోగ్యాన్నీ ఘోరంగా దెబ్బతీస్తుంది. 

07:41 - June 1, 2016

ఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెద్దగా పెరగకపోయినా ఎన్డీయే సర్కార్ పెట్రో, డీజిల్ ధరలను పెంచేసింది. పెట్రోల్‌పై 2 రూపాయలా 58 పైసల మేర, డీజిల్‌పై 2 రూపాయల 26 పైసల మేర పెంచారు. ఈ పెంపుతో హైదరాబాద్‌లో ప్రస్తుతం పెట్రోల్‌ ధర 69 రూపాయల 75 పైసలుకు, డీజిల్‌ 58 రూపాయలా 52 పైసలుకు చేరింది. 

 

15:25 - May 14, 2016

హైదరాబాద్ : వేసవి అనగానే గుర్తుకొచ్చే ఫలం మామిడిపండే.. నోరూరించే ఫలరాజు మామిడిని ఎవరు కాదనుకుంటారు. ఎగబడి మరీ కొనుక్కుంటారు. అయితే ఈసారి మామిడి పళ్ల ధర మరింత పెరగనుంది. మామిడి దిగుబడి తగ్గడంతో మార్కెట్లు కళ తప్పాయి. కరవు కారణంగా పళ్ల దిగుబడి తగ్గినట్లు ఉద్యానవన శాఖ చెబుతోంది.

తగ్గిన దిగుబడితో పెరిగిన మామిడి ధరలు....

ఈ ఏడాది మామిడి పళ్ల ధరలు పెరగనున్నాయి. కరవు, తోటల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఈసారి దిగుబడి తక్కువగానే ఉంది. దీనికితోడు అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా మామిడికాయలు చాలావరకు రాలిపోయాయి. తెలంగాణలో లక్షన్నర ఎకరాల్లో మామిడితోటలున్నాయి. సాధారణంగా ఏడాదికి 8లక్షల టన్నుల వరకూ మామిడి దిగుబడులు రావాలి. కాని అంత దిగుబడి ఈ ఏడాది రాలేదు. గతేడాది టన్ను మామిడి 15వేలనుంచి 35వేల రూపాయల ధరపలికితే , ఈ ఏడాది 30 వేల నుంచి 60వేల రూపాయల వరకు పలుకుతోంది. మరోవైపు హైదరాబాద్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు భారీగా తగ్గాయి.

కిలో 50 రూపాయల నుంచి 60దాకా ...

హైదరాబాద్‌ గడ్డి అన్నారం మార్కెట్లో మామిడికాయలను కిలో 50 రూపాయల నుంచి 60దాకా కొంటున్నారు. చిల్లర మార్కెట్‌లో 70 రూపాయల నుంచి 90 దాకా అమ్ముతున్నారు. ఇక నాణ్యమైన మామిడి రేటు వంద నుంచి రెండొందల పైమాటే పలుకుతోంది. పళ్ల దుకాణాల్లో నాణ్యమైన పెద్దరసాలు, బంగినపల్లి,అల్ఫోన్సా రకాలు తక్కువగా ఉండటంతో అమ్మకాలు ఎక్కువగా జరగడం లేదు. దీంతో వ్యాపారస్తులు ఎక్కువ ఖరీదు పళ్లను అమ్మడానికి ఆసక్తి చూపడం లేదు. మామిడి ధరల పెరగడంతో ,వాటిని కొనడానికి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక సామాన్య ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. అమ్మకాలు సరిగ్గా జరగక వ్యాపారస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - prices