Kondagattu

21:01 - September 12, 2018

జగిత్యాల : కొండగట్టు బస్సు ప్రమాద ఘటనతో మూడు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడి 57 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. బస్సు ప్రమాదంలో  డబ్బుతిమ్మాయిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. వీరి మృతితో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తలు అంటున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాల్లో ఒక్కొరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. లేని ఎడల మూడు గ్రామాల ప్రజలందరం ధర్నా చేపడతామని హెచ్చరించారు. డొక్కు బస్సులు వేసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు.

జగిత్యాల జిల్లాలో కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 57 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల్లో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘాట్‌రోడ్డులో బ్రేక్ లు ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. 

16:53 - September 12, 2018

హైదరాబాద్ : కొండగట్టు బస్సు ప్రమాదంపై మానవ హక్కుల కమిషన్(హెచ్ ఆర్ సీ)లో ఫిర్యాదు నమోదు అయింది. బస్సు ప్రమాదంపై హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ హెచ్ ఆర్ సీలో పిటిషన్ వేశారు. ప్రమాదంలో 57 మంది చనిపోవడానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల బస్ డిపో మేనేజర్, సూపర్ వైజర్, ఆర్టీవోపై కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. అధికారులపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ డీజీపికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలని మానవ హక్కుల కమిషన్ ను అరుణ్ కుమార్ కోరారు.

జగిత్యాల జిల్లాలో కొండగట్టు వద్ద ఘాట్‌రోడ్డులో బ్రేక్ లు ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ప్రమాదంలో 57 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల్లో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 

 

08:54 - September 12, 2018

కరీంనగర్ : ఎన్నో ఏళ్ల అనుభవం...ప్రమాదమన్న సంగతే ఎరుగని డ్రైవర్.. దీనితో ఆర్టీసీ సంస్థ నుండి ఎన్నో రివార్డులు..అవార్డులు అందుకున్నాడు. ఇటీవలే ఆగస్టు 15వ తేదీన ఉత్తమ అవార్డు అందుకున్నాడు. కానీ కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ ఇతనే. 

కొండగట్టు ప్రమాదంలో 57 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదం తరువాత డ్రైవర్ అతి వేగంగా నడపడం..అజాగ్రత్తగా నడిపారనే ఆరోపణలు వినిపించాయి. కానీ ఆ బస్సు నడిపింది ఉత్తమ డ్రైవర్ శ్రీనివాస్. ఉత్తమ డ్రైవర్ గా ఇటీవలే అవార్డు కూడా అందుకున్నట్లు అతని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనలో అతను కూడా మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ధన పొదుపులో ఎన్నాళ్లుగానో ఉత్తమ డ్రైవర్ గా శ్రీనివాస్ ప్రతిభ చూపించాడని స్వయంగా ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. కానీ పని ఒత్తిడి, అధిక గంటలు పనిచేయడం వల్లే బస్సుపై నియంత్రణ కోల్పోయాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా పాత బస్సు కావడం...అధిక లోడ్ కావడం..దీనితో అదుపులోకి రాకపోవడంతో నియంత్రణ కోల్పోయాడని తెలుస్తోంది. ఏది ఏమైనా కొండగట్టు ప్రమాదం అందరినీ కలిచివేసింది. 

22:23 - September 11, 2018

జగిత్యాల : జిల్లా కొండగట్టు బస్సు ప్రమాదానికి కారణాలేంటీ ? భారీ స్థాయిలో మృతుల సంఖ్య పెరగడానికి...డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా ? లేదంటే ఘాట్ రోడ్డులోని చివరి మలుపు కొంపముంచిందా ? ఘాట్ రోడ్డయినప్పటికీ....పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నారా ? 

గతంలో ఎన్నడూ చోటు చేసుకొని...వినని విషాదమిది...ఒకరు కాదు ఇద్దరు కాదు...పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లోకి...జగిత్యాల జిల్లాలోనే అతి పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం...కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లు...బస్సు ప్రమాదానికి కారణాలెన్నో. బస్సు చాలా పాతది కావడంతో పాటు కండీషన్ లో ఉందా లేదా అనేక సందేహాలకు తావిస్తోంది. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు చాలా పాతది కావడంతోనే ప్రమాదం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.

మంగళవారం కావడంతో ఎక్కువ మంది భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో...పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఎక్కారు. కొండగట్టు చివరి మలుపు వద్ద ప్రయాణికులందరూ డ్రైవర్‌ వైపు ఒరగడంతో...ఒకవైపే బస్సులో బరువు పెరిగింది. దీంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. బస్సు మరో నిమిషంలో ప్రధాన రహదారికి చేరుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదం జరిగిన ఘాట్ రోడ్డులో....బస్సు వెళ్లేందుకు అనుకూల పరిస్థితులు లేవంటున్నారు. అయితే పోలీసులు మాత్రం....అలాంటిది ఏమీ లేదని చెబుతున్నారు.

మరోవైపు ప్రమాదం సమయంలో బస్సును డ్రైవింగ్ చేసిన శ్రీనివాస్...ఘాట్ రోడ్ల డ్రైవింగ్ లో మంచి ప్రావీణ్యం ఉంది. తెలంగాణ ఆర్టీసీ నుంచి ఉత్తమ డ్రైవర్ గా ఇటీవలే అవార్డు కూడా అందుకున్నారు. బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో...ముందువైపు మొత్తం ధ్వంసమైంది. డ్రైవర్ సీట్లో కూర్చున్న శ్రీనివాస్ తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించినా...ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ డ్రైవర్ శ్రీనివాస్ మృతి చెందారు.  

21:51 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి...లోయలోకి దూసుకెళ్లడంతో 57 మృతి చెందారు. గాయపడ్డ క్షతగాత్రులకు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాదంపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు.
తప్పి లోయలో పడిన బస్సు 
కొండగట్టు ఘాట్ రోడ్డు నుంచి కిందికి దిగుతున్న బస్సు....చివరి మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడింది. దీంతో పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి కొందరి తీవ్ర గాయాలు కావడంతో...ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కరీంనగర్, హైదరాబాద్ కు తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతులు బంధువులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటన స్థలంలో తమ బంధువులను చూసి....కన్నీరుమున్నీరయ్యారు.
ఊపిరాడక పలువురు అక్కడికక్కడే మృతి 
బస్సు లోయలో పడటంతో ఊపిరాడక పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది పెద్దపల్లి, జగిత్యాల జిల్లా వాసులు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక యువకులు సహాయ చర్యల్లో పాల్గొని...ఆసుపత్రులకు తరలించారు. జగిత్యాల ఆస్పత్రి మొత్తం మృతుల బంధువులతోనే నిండిపోయింది. తమ వారి మృతదేహాలను...కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. 
ప్రమాదంపై కేసీఆర్, గవర్నర్ దిగ్భ్రాంతి 
కొండగట్టు రోడ్డు ప్రమాదంపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహాన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన కేసీఆర్...క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతులకు కుటుంబాలకు 5లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. తాజా మాజీ మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, మహేందర్ రెడ్డిలు...క్షతగాత్రులను పరామర్శించి...వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆర్టీసీ తరపున 3లక్షల రూపాయలు సాయం అందిస్తామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ , మహేశ్వర్ రెడ్డిలు పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పోస్టు మార్టం పూర్తి కావడంతో మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు ట్రాక్టర్ లో తరలించారు.

 

20:44 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 58 కు చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పలువురికి గాయాలు అయ్యాయి. ఘాట్‌రోడ్డులో బ్రేక్ లు ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎక్కువ మంది ఊపిరాకడ చనిపోయినట్లు తెలుస్తోంది.

ప్రమాద ఘటనపై తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఏపీ మంత్రి నారా లోకేశ్‌  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని గవర్నర్‌ నరసింహన్‌, అద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

12:08 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టు హాహాకారాలతో మారుమోగింది. తమ వారు ఎక్కడున్నారు ? జీవించి ఉన్నారా ? అంటూ ఆర్తనాదాలు పెడుతున్న దృశ్యాలు కంటతడి పెట్టించాయి. పవిత్ర ఆలయం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు లోయలో పడిపోవడంతో 10 మంది దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన మంగళవారం చోటు చేసుకుంది. 
కొండగట్టును దర్శించుకొనేందుకు పలువురు జగిత్యాల జిల్లాకు వస్తుంటారు. మంగళవారం నాడు పలువురు దర్శనం చేసుకుని బస్సులో కిందకు బయలుదేరారు. ఆ సమయంలో బస్సులో 80 మంది ఉన్నట్లు సమాచారం. లోయ వద్ద మలుపు తీసుకుంటుండగా ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీనితో పది మంది అక్కడికక్కడనే మృతి చెందారు. ఇందులో వృద్దులు, చిన్నారులున్నారు. వారి వారి మృతదేహాల వద్ద బంధువులు రోదించారు. ఈ ఘటనపై సీఎం దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మరో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

09:42 - March 31, 2018

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన కొండగట్టు అంజేయస్వామి ఆలయంలో చిన్న హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జై శ్రీరామ్‌, జై హనుమాన్‌ భక్తుల నామస్మరణతో కొండగట్టు పరిసరాలు ఆధ్మాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయ పరిసరాలలో 20 చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. గతం కంటే ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు పేర్కొంటున్నారు. 

16:48 - January 22, 2018

జగిత్యాల : జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దర్శించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి పార్టీ ముఖ్యనేతలతో భారీ కాన్వాయ్‌తో కొండగట్టు చేరుకున్న పవన్‌కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అంజనేయ స్వామికి పవన్‌ ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి 11 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌. హైదరాబాద్‌ నుంచి కొండగట్టుకు చేరుకునే మార్గంలో పవన్‌ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానంతరం పవన్‌ కరీంనగర్‌కు వెళ్లారు. కాసేపట్లో జనసేన కార్యకర్తలతో పవన్‌ కల్యాణ్‌ భేటీ కానున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

07:56 - January 22, 2018

హస్తినలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేలుగా ఉంటూ లాభదాయక పదవులు అనుభవించిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలంగాణలో రాజకీయ యాత్ర చేపట్టనున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు నుండి ఈ యాత్రను ప్రారంభించనున్నారు. తెలంగాణలో నాలుగు రోజుల పాటు మూడు జిల్లాల్లో పర్యటించి జనసేన కార్యకర్తలతో సమావేశం అవనున్నారు. మరోవైపు టిడిపి ప్రజాప్రతినిధులతో జరిగిన ఒక రోజు వర్క్ షాప్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు ఆదేశించారు. శాసనసభ్యులు ప్రజలను మెప్పించగలితే 175 సీట్లలో  టీడీపీ విజయానికి ఢోకా ఉండదని బాబు పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), దినకరన్ (టిడిపి), కోటేశ్వరరావు (బీజేపీ), జంగా కృష్ణమూర్తి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - Kondagattu