karimnagar

09:51 - September 20, 2018

కరీంనగర్‌ : పట్టణంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. పట్టణంలోని తెల్లవారుజామునే టవర్ సర్కిల్ దగ్గర ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. బీఎస్‌ఎన్ఎల్ ఆఫీసులోకి చొరబడింది. టవర్ సర్కిల్ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. అధికారులు బీఎస్‌ఎన్ఎల్ ఆఫీసు చుట్టూ ఆవరించి ఉన్నారు. ఎలుగుబంటికి అధికారులు ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచారు. భల్లూకాన్ని పట్టుకుని సమీపంలోని అడవిలోకి వదిలిపెట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. 

 

07:42 - September 9, 2018

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో లుకలుకలు మొదలయ్యాయి. అసెంబ్లీ రద్దై...ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. టికెట్ వస్తుందని ఆశించిన నేతలకు టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశనిస్పృహలో ఉన్నారు. కేసీఆర్‌.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యే టిక్కెట్లను ప్రకటించడంతో ఆశావహులంతా కారు దిగేందుకు సిద్ధమయ్యారు. ఇంతకాలం పార్టీని నమ్ముకున్న నేతలంతా ఇప్పుడు అధినేత కేసీఆర్ నిరసన గళం వినిపిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 13 స్థానాల్లో 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో మంథని, రామగుండంలో నిరసనలు మొదలయ్యాయి. 

టీఆర్‌ఎస్‌లో ఇంతకాలం టికెట్‌ కోసం ఎదురు చూసిన నేతలంతా ఇప్పుడు కండువా మార్చేందుకు రెడీ అవుతున్నారు. 
సిట్టింగ్‌లకు టికెట్‌ ఇచ్చి కేసీఆర్‌ తమను మోసం చేశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణపై సొంత పార్టీ నేతలే ఇప్పటికే తిరుగుబాటు ప్రకటించారు. ఎమ్మెల్యే హఠావో.. పార్టీ బచావో అంటూ వ్యతిరేకవర్గం ఏకమైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై  కోరుకంటి చందర్‌  ఫైర్‌ అవుతున్నారు. పార్టీ టికెట్ కోసం ఆయన శతవిధాలా ప్రయత్నాలు చేశారు. చందర్‌కు పార్టీ టికెట్‌ రాకపోవడంతో ఆయన అభిమాని ఒకరు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి హంగామా సృష్టించారు. చందర్‌ కూడా పార్టీ తనకు అన్యాయం చేసిందంటూ కన్నీరుపెట్టుకున్నారు.

రామగుండం జెడ్పీటీసీ సంధ్య దంపతులు కూడా ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించారు. రెండేళ్లుగా క్షేత్రస్థాయిలో పనులు కూడా చేస్తున్నారు. చివరికి అధినేత సోమారపుకే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడం, సంధ్యారాణి దంపతులకు టికెట్‌ ఇవ్వకపోవడంతో సాగర్‌ , సంతోష్‌ అనే యవకులు కిరోసిన్‌ పోసుకుని  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఇక మంథనిలోనూ సేమ్‌ టూ సేమ్‌ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రామ్‌రెడ్డి కుమారుడు టీఆర్‌ఎస్‌ యువజన రాష్ట్ర కార్యదర్శి సునీల్‌రెడ్డి మరోసారి ఆశాభంగం ఎదురైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోటలో పుట్ట మధుకు టికెట్‌ ఇవ్వడంతో సునీల్‌రెడ్డి మద్దతుదారులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. రామ్‌రెడ్డిని కాదని పుట్టా మధుకు టికెట్‌ ఇవ్వడంపై ఇరువురి నేతల మధ్య విభేదాలు పెంచాయి.  ఇలా ప్రతి చోటా నేతల మధ్య టికెట్లు కుంపట్లు కొనసాగుతున్నాయి. మంథని, రామగుండం నియోజకవర్గాల్లో టికెట్‌ రాని ఆశావహులంతా కాంగ్రెస్‌, జనసమితిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

13:51 - September 1, 2018
13:48 - September 1, 2018

కరీంనగర్ : ప్రగతి నివేదన సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున జన సమీకరణకు మంత్రి ఈటెల తన యత్నాలకు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ళ అభివృద్ధిని ప్రజలకు ఈ సభ ద్వారా వివరిస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. భారీ జన సమీకరణతో హుజురాబాద్ లో ట్రాక్టర్ ర్యాలీని ఈటెల జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతు..వచ్చే ఎన్నికల్లో 119 స్థానాలు టీఆర్ఎస్ సాధిస్తుందని..విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా 119స్థానాలు మావేనని ఈటెల ధీమా వ్యక్తంచేశారు. ఈ సభపై కాంగ్రెస్ ఆరోపణలో ఎటువంటి వాస్తవాలు లేవని ఆయన స్పష్టంచేశారు. ప్రతీ ఇంటింటికి ప్రతీవారు ఈ సభకు రావాలనే సంకల్పంతో వున్నారని..దీని కోసం 100 ట్రాక్టర్లను, ప్రతీ గ్రామానికి రెండేసి బస్సుల చొప్పున 360 బస్ లను ఏర్పాటు చేశామన్నారు. ఈ బస్సులలో 60 వేల మంది ప్రజలు..ఇంకా ఇతర వాహనాలలో కలిపి మా అంచనాలను మించి ప్రజలు కొంగరకలాన్ సభకు తరలిపోయేందుకు సిద్ధంగా వున్నారని..వారికి అన్ని ఏర్పాట్లను చేశామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.  

14:01 - August 31, 2018

కరీంనగర్‌ : ప్రేమలో మరో యువతి మోస పోయింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రేమ హత్యలు, ప్రేమ పేరిట మోసాలు అధికమౌతున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగిస్తుంటారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి...మరో యువతితో పెళ్లి సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళితే...జిల్లా రామడుగు మండలం కొక్కెరకుంటలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. మహేందర్‌ అనే వ్యక్తి తనను ఆరు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది. మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని బాధితురాలు ఆరోపించింది. మహేందర్‌ పెళ్లి చేసుకుంటే.. తననే పెళ్లి చేసుకోవాలని.. వేరే వాళ్లను పెళ్లి చేసుకోవాటానికి వీలులేదని బాధితురాలు తేల్చిచెప్పింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:21 - August 27, 2018

కరీంనగర్ : కొంగర కలాన్‌లో జరగబోయే ప్రగతినివేదన సభ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎన్నికల వాతావరణం నెలకొంది. సభకు భారీగా జనసమీకరణ చేయడమే లక్ష్యంగా పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానానికి తమ సత్తాను చూయించేందుకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. ప్రగతి నివేదన సభకు జనసమీకరణ చేస్తూ మరో వైపు అభివృద్ధి మంత్రం జపిస్తూ అధికార పార్టీ నేతలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. సభను విజయవంతం చేయడానికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

జిల్లాలోని 13 నియోజకవర్గాలు 12 టీఆర్‌ఎస్‌వే కావడంతో కాంగ్రెస్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న జగిత్యాల జిల్లా నుండి పెద్ద ఎత్తున జనాలను సభకు తరలించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. మొత్తం రెండున్నర లక్షల మందిని సభకు తీసుకెళ్లేందుకు మంత్రులు ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం పార్టీ క్యాడర్‌ ను అలర్ట్‌ చేసి నేతలంతా విబేధాలు వీడి పని చేయాల్సిందిగా మంత్రులు ఉపదేశం చేస్తున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలని రద్దు చేసే అవకాశం ఉందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో ప్రగతి నివేదన సభకు జనసమీకరణ కోసం జరిగే సమావేశాలు, కార్యక్రమాలను ఎన్నికల సమాయత్తానికి కూడా వినియోగించుకోవాలని వ్యూహం రచించారు. గ్రామ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి....నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని నిర్ణయించారు. అలాగే తాగు, సాగు నీటి ప్రాజెక్టుల ప్రగతిని వివరిస్తూ ప్రజలను ఓటర్లుగా మార్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే ఈ సారి నలుగురు శాసనభ్యులకు టికెట్లు లభించకపోవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగైదు సీట్లు మార్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీంతో ఆశావహులు పార్టీ అభివృద్ధి కోసం పని చేయాల్సిందిగా జిల్లా మంత్రులు గులాబీ శ్రేణులకు సూచనలు చేస్తున్నారు. తమకు బలమైన పోటీనిచ్చే కాంగ్రెస్‌ నేతలను ప్రగతినివేదన సభల ప్రచారంలో తిప్పికొట్టాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి ఈటల రాజేందర్‌...

కేసీఆర్‌ సెంటిమెంట్‌ జిల్లాల్లో అధిక సీట్లు సాధించేందుకు పట్టు వదలకుండా టీఆర్‌ఎస్‌ ముందుగానే ప్రచారం మొదలు పెట్టింది. ప్రగతి నివేదన సభకు రెండున్నర లక్షల మందిని తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్‌ నేతలు చేస్తున్న సభ ఏర్పాట్లు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. ముందస్తు లేదంటూనే ప్రతిపక్షాలను మభ్య పెడుతూ విజయాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్న టీఆర్‌ఎస్‌ ఎత్తులు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. 

10:21 - August 16, 2018
14:47 - August 10, 2018

కరీంనగర్‌ : జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో 4k ఫ్రీడమ్‌ రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ ప్రమోద్‌, సిపి కమలాసన్‌ రెడ్డి, ఎమ్మెల్యే గంగల కమలాకర్‌లు పాల్గొన్నారు. నగరంలోని అంబేద్కర్‌ స్టేడియం నుంచి SRR కాలేజీ వరకు జరిగిన ఈ రన్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలందరిలో దేశభక్తిని.. జాతీయ భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ రన్‌ను నిర్వహించినట్టు సీపీ తెలిపారు. విభిన్న మతాలకు చెందిన పెద్దలతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి దేశభక్తిని చాటుకున్నారన్నారు. రన్‌లో భాగంగా విద్యార్థులు నృత్యపదర్శన చేశారు. రన్‌లో ఎన్‌సీసీ విద్యార్థులు ప్రదర్శించిన 100 అడుగుల జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

16:59 - July 25, 2018

కరీంనగర్ : లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. కరీంగనర్‌ జిల్లా బొమ్మకల్‌లో లారీ యజమానులు చేస్తున్న సమ్మెకు కోదండరాం సంఘీభావం తెలిపారు. డీజిల్‌, ఇన్సూరెన్స్‌, టోల్‌ గేట్‌, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల లారీ యజమానులపై భారం పడుతుందన్నారు. రెండు రోజుల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశమై కార్యచరణ రూపొందిస్తామని కోదండరాం వెల్లడించారు. 

12:55 - July 10, 2018

కరీంనగర్ : ఆలోచన.. ఆయుధం కంటే పదునైనదని నిరూపించాడు ఓ యువకుడు. సాధించాలనే సంకల్ప ఉంటే ఏదైనా చేయొచ్చు అంటున్నాడు. కుల వృత్తులు అంతరించిపోతున్న తరుణంలో... తమకు ప్రోత్సాహం కల్పిస్తే ఏదైనా సాధిస్తామని.. అగ్గిపెట్టెలో పట్టే పని ముట్లను తయారు చేసి నిరూపించాడు. ఇంతకు ఎవరా యువకుడు ? ఏంటా కథా  ? అనే దానిపై ప్రత్యేక కథనం. 

రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కులవృత్తులు అంతరించిపోతున్నాయి. దీంతో చేతివృత్తుల వారు కులవృత్తులు వీడి.. వలసపోతున్నారు. గ్రామాల్లో కొన్ని కొన్ని వృత్తులు చేసేవారు అంతరించిపోతున్నారు. మరోవైపు ఉన్నవారికి ఉపాధి లేక.. కుటుంబాలు పోషించలేక అవస్థలు పడుతున్నారు. దీంతో ఓ యువకుడు ఓ కొత్త ఆలోచన చేశాడు. అంతరించిపోతున్న తమ కులవృత్తులకు గుర్తింపు తీసుకురావాలనుకున్నాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే తమ కళతో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తామని కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి చెందిన సంపత్‌ రుజువు చేస్తున్నాడు. 

ఇంటర్‌ వరకు చదివిన సంపత్‌ విశ్వబ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవాడు. ఊర్లలో వ్యవసాయ పనిముట్లు తయారుచేస్తూ జీవనం కొనసాగిస్తుంటారు. అయితే... రానురాను ఈ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది. దీంతో కుటుంబాలు పోషించడం భారంగా మారుతోంది. దీంతో సంపత్‌ అగ్గిపెట్టెలో పట్టే నాలుగు వ్యవసాయ పనిముట్లను తయారుచేశాడు. 7 గంటల్లోనే ఈ వస్తువులను తయారు చేయడం విశేషం. తమలో ఉన్న కళను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తాను ఈ వస్తువులు తయారు చేశానంటున్నాడు సంపత్‌. 

అగ్గిపెట్టెలో వస్తువులను తయారు చేసిన సంపత్‌ను స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందిస్తే సంపత్‌ లాంటి వారు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని కొనియాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంతరించిపోతున్న చేతివృత్తుల వారిని బతికించాలని ప్రజలు కోరుతున్నారు. సరైన ప్రోత్సాహం అందిస్తే ప్రతి వృత్తిలో అద్భుతాలు సృష్టిస్తారంటున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - karimnagar