janasena party

16:37 - November 8, 2018

విజయవాడ: విజయవాడలో టీడీపీ,జనసేన పార్టీల మధ్య ఫ్లెక్సీల వివాదం ముదురుతోంది. గతంలో జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై టీడీపీ నాయకుడు కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి  కౌంటర్ గా  జనసేనపార్టీ అధికార ప్రతినిధి మండలి రాజేష్ పేరుతో తెలుగుదేశం పార్టీని ఘాటుగా విమర్శిస్తూ  నగరంలో  బుధవారం ఫ్లెక్సీలు వెలిశాయి. ఇన్నాళ్లు  సైలెంట్ గా ఉన్న  పోలీసులు  ఇరువురిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు. 
పవన్ కళ్యాణ్ మద్దతివ్వకపోతే చంద్రబాబునాయుడు 2014 లోనే రిటైరయ్యేవారని ఒక సభలో పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా  కాట్రగడ్డ బాబు..." పవన్ కళ్యాణ్ గారు మీరు మద్దతివ్వకపోతే చంద్రబాబు 2014 లోనే రిటైరయ్యేవారా? ఎందుకు అహంకారపు ప్రగల్భాలు, మీ అన్నదమ్ములంతా కలిసినా 2009లో మీకు వచ్చింది 18 సీట్లే,  ఇప్పుడు తల్లకిందులుగా తప్పస్సు చేసినా మీరు ఒకటో,రెండో సీట్లు గెలిస్తే గొప్ప, అంతకు మించి మీకు సీను లేదు, సినిమా లేదని" గతంలో బ్యానర్లు కట్టారు .
కాట్రగడ్డ బాబు వేసిన  పోస్టర్సకు కౌంటర్ గా విజయవాడలోని బెంజిసర్కిల్ తో సహా ప్రధాన కూడళ్లలో జనసేనపార్టీ అధికార ప్రతినిధి మండలి రాజేష్ పేరుమీద తెలుగుదేశం పార్టీని  ఘూటుగా విమర్శిస్తూ బుధవారం వెలిసిన పోస్టర్లతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. "పచ్చతమ్ముళ్ల పిచ్చిపురాణం, వెంటాడుతున్న ఓటమి భయం, టీడీపీని ఓడించే జనసైనికులం" అంటూ వెలసిన ఫ్లెక్సీలలో తెలుగు దేశం పార్టీపై ఘాటుగా విమర్శించారు. "2019లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీతో అక్రమసంబంధం పెట్టుకున్నారని, దమ్ముంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఒంటరిగా పోటీ చేయాలని" సవాల్ విసిరారు. "2019లో టీడీపీని సింగిల్ డిజిట్ కు పరిమితం చేయకపోతే మేము జనసైనికులం కాదని " జనసేన పోస్టర్లలో పేర్కోన్నారు. దీంతో పరిస్ధితి తీవ్ర రూపం దాల్చకుండా  పోలీసులు  రెండు పార్టీల నాయకులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిధ్దమయ్యారు.

19:16 - November 3, 2018

కత్తిపూడి: రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని,టీడీపీ నాయకులకు డబ్బే ప్రధానం అయిందని, వాళ్లను నిలదీసే పరిస్ధితి రావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయటానికి డబ్బులు ఉండవు కానీ, వైసీపీ ఎమ్మెల్యేలను కొనటానికి డబ్బులుంటాయి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తి లోకేష్ అడ్డదారిలో పంచాయతీ రాజ్ శాఖమంత్రి అయ్యారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గ్రామ,గ్రామాన అవినీతి పెరిగిపోయిందని జనసేన పార్టీ అవినీతిపై పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు అవినీతి రహిత పాలన అందించటమే జనసేన లక్ష్యం అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని గ్రామాల్లో కనీస వసతులు కరువయ్యాయని, సాగునీరు లేదు, ప్రభుత్వాసుపత్రిలు మూసివేస్తున్నారు అని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే విశాఖ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పోయారని, ప్రభుత్వం వెంటనే  జాగ్రత్త పడి వుంటే ఇద్దరు ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగేవారని...... మీ ఎమ్మెల్యేలను కాపాడలేకపోయిన మీరు ఒక ముఖ్యమంత్రా అని  సీఎం ను ఉద్దేశించి ప్రశ్నించారు. సభ ప్రారంభలో అభిమానులు పవర్ స్టార్ సీఎం ,పవర్ స్టార్ సీఎం, అంటూ నినాదాలు చేయగా... మీ ఆకాంక్ష భగవంతుడి ఆశీస్సులతో  త్వరలో నెరవేరుతుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.   

19:46 - November 2, 2018

 తుని: ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు త‌న వ్య‌క్తిగ‌త ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని, రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకోవటం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ‌-తుని మ‌ధ్య చేసిన రైలు ప్ర‌యాణంలో ఆయన మాట్లాడుతూ.....ముఖ్య‌మంత్రికి అధికార దాహం మిన‌హా, ప్ర‌జాసంక్షేమం ప‌ట్ట‌దని....తెలుగుదేశం పార్టీ కేవ‌లం ఓట్ల రాజ‌కీయాలు మాత్ర‌మే చేస్తోందని ఆరోపించారు. "రాష్ట్రానికి జ‌రిగే అన్యాయం వారికి ప‌ట్ట‌దు. వారికి అధికారం చేతిలో ఉంటే చాలు. ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయి. పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి అంటున్నారు, కానీ కేవలం లక్షల కోట్ల అప్పులు మాత్రం మిగులుతున్నాయని" ఆరోపించారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని, బ‌ల‌మైన సంస్థాగ‌త మార్పు తీసుకురావ‌డానికి జ‌న‌సేన పార్టీ కృషి చేస్తుందని, రాజ‌కీయాల్లో జ‌వాబుదారీత‌నం తీసుకురావాల్సిన అవ‌స‌రం  ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలుతీసుకోవటానికి  తాను వ్యతిరేకమని, ప్రజలతో ఉండి వారి కష్టాలు, వారి బాధలు తెలుసుకుంటూ ప్రజలకోసం పనిచేయటం తనకిష్టమని అందుకే సామాన్యుడిలాగా రైలు ప్రయాణం చేసి అందరికష్టాలు తెలుసుకున్నానని చెప్పారు. "టీడీపీ అంతిమ ల‌క్ష్యం అధికారం అయితే, జ‌న‌సేన పార్టీ అంతిమ ల‌క్ష్యం మార్పు కోసం" అని ఆయన తెలిపారు. గ‌డ‌చిన నెలరోజుల్లో "జ‌న‌బాట కార్య‌క్ర‌మం ద్వారా 23 ల‌క్ష‌ల ఓట్లు ఎన్‌రోల్ చెయ్య‌గ‌లిగాం, ఎక్క‌డో ఒక చోట మార్పు రావాల‌న్న ల‌క్ష్యంతోనే ప్రజల్లోకి వచ్చాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.రాష్ట్రానికి జాతీయ పార్టీలు అన్యాయం చేశాయని 2019 ఎన్నిక‌ల్లో   ప్రజలు ఆకోపాన్ని చూపించ‌బోతున్నారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 

13:30 - October 31, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగున్నాయి.  2019లో ఎన్నికలు వస్తాయా ? లేక ముందుగానే ఎన్నికలు వస్తాయా ? అనే చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు రాకముందే ఆయా పార్టీలు ఇప్పటి నుండే రెడీ అవుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన, వామపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర పేరిట జనాలను కలుస్తున్న సంగతి తెలిసిందే. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరుయాత్ర పేరిట భారీ బహిరంగసభలు..ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తూ ప్రభుత్వం..నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 
ఇతర పార్టీలకు చెందిన నేతలు జనసేనలోకి వచ్చేందుకు ఆస్తకి చూపుతున్నారు. ఇటీవలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా తుని మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు కూడా పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. తుని నియోజకవర్గానికి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. పార్టీలో చేరాలని స్వయంగా జనసేన పార్టీ కీలక నేతలు ఆయన్ను ఆహ్వానించినట్లు సమాచారం. దీనికి అశోక్ బాబు ఒకే చెప్పారని, త్వరలో పార్టీలో చేరుతారని టాక్. మరి ఆయన పార్టీలో చేరుతారా ? లేదా ? అనేది చూడాలి. 

13:13 - October 16, 2018
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందనే మాటను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు.గత ఎన్నికల్లో పెట్టుకున్నపొత్తుల వల్లే అధికారంలోకి వచ్చామనే విషయాన్ని మేము ఒప్పుకున్నామని, మీరు ప్రచారం చేసిన విషయాన్నిమేము కాదనటం లేదని సోమిరెడ్డి అన్నారు. రాజకీయ నాయకుడిగా మాట్లాడేటప్పుడు కాస్త సంయమనం పాటించి మాట్లాడాలని మంత్రి పవన్ కళ్యాణ్ కు సూచించారు. గ్రామీణాభివృధ్ది శాఖ మంత్రి లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వటంపట్ల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సోమిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తిత్లీ తుపాను తర్వాత శ్రీకాకుళంలోనే ఉండి ప్రజల అవసరాలు గుర్తిస్తూ గ్రామాల్లో సాధరాణ పరిస్ధితులు నెలకొనేందుకు లోకేష్ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. ఏమి అనుభవం ఉందని మీఅన్నయ్య చిరంజీవిగారు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేశారని సోమిరెడ్డి పవన్ ను ప్రశ్నించారు. ఛాయ్‌వాలాగా ఉన్న మోదీ ప్రధాని అయ్యారని సోమిరెడ్డి గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ చేసే చేతలకు,మాట్లాడే మాటలకు పొంతన ఉండటంలేదని, రాజకీయ నాయకుడిగా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సోమిరెడ్డి సూచించారు. పవన్ కళ్యాణ్ తనకు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశ్యం లేదంటారు,అభిమానులతో కాబోయే సీఎం అనిపించుకుంటారని, ఒకోసారి హింసకు వ్యతిరకం అంటారు,యుద్దంచేస్తానని మరోసారి అంటూ గందరగోళంగా మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. 
10:18 - October 13, 2018

విజయవాడ:ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతిని ప్రశ్నిస్తూ, ప్రభుత్వంలోని అవకతవకలు ఎత్తి చూపుతూ నిత్యం జనంతో మమేకమై రోడ్ షోలు నిర్వహిస్తున్న జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  విజయవాడ పార్టీ కార్యాలయాన్నిశనివారం ప్రారంభించారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో  కలిసి  బెంజిసర్కిల్ లో  ఏర్పాటు  చేసిన కార్యాలయాన్నిఈఉదయం ఆయన ప్రారంభించారు. ఈకార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు గట్టి పోటీ ఇవ్వనున్న జనసేన పార్టీలోకి ఇప్పటికే  ఇతర పార్టీల నుంచి నాయకుల వలసలు మొదలయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సరికి ఇంకెంత మంది జనసేన పార్టీలో చేరతారో వేచి చూడాలి.  

19:50 - October 10, 2018

పట్టిసీమ : తూర్పుగోదావరి జిల్లాలోని సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం వద్ద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 15న ధవళేశ్వరం బ్యారేజీ వద్ద చేపట్టనున్న కవాతుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీతోపాటు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. 
ఈ సందర్భంగా పట్టిసీమలోని గెస్ట్‌ఇన్ అతిధి గృహంలో కవాతుకు సంబంధించిన మ్యాపును జనసేనాని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగ సభకు ముందు విజ్జేశ్వరం నుంచి భారీ ర్యాలీని వందలాది కార్యకర్తలతో ప్రారంభించి ధవళేశ్వరం దగ్గర ఉన్న కాటన్ విగ్రహం వద్ద ప్రజలనుద్దేశించి పవన్ ప్రసంగించనున్నారు. 
ఈ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను సైతం పవన్ కళ్యాణ్ పరిశీలించారు.

22:57 - September 12, 2018

హైదరాబాద్ : ఉత్తరాంధ్రలో పర్యటనతో సెగ పుట్టించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ .. చల్లబడ్డారు. పశ్చిమలో భారీ బహిరంగ సభ నిర్వహించి కాక రేపిన జనసేనాని.. మళ్లీ కనుమరుగైపోయారు. సీరియస్‌గా పాలిటిక్స్ మొదలుపెట్టారని అనుకున్నంతలోనే.. తన తీరు మారలేదని నిరూపించుకుంటున్నారు. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కుతున్న సమయంలో పవన్‌ తెరమరుగు అవడం సంచలనం కలిగిస్తోంది. 

మే 20న ఇచ్ఛాపురం నుంచి పోరాట యాత్ర మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్‌.. రెండు విడతల్లో దాదాపు 40 రోజుల పాటు జనం మధ్యే గడిపారు. మధ్యలో రంజాన్‌ పేరుతో కొన్ని రోజులు, కంటి సమస్య పేరుతో మరికొన్ని రోజులు విరామం తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ పర్యటించిన పవన్.. ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా మౌనం దాల్చారు. పవన్ కళ్యాణ్‌పై చాలా ఆశలు పెట్టుకున్న ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు  తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

07:54 - July 10, 2018

హైదరాబాద్ : మెగా అభిమానులు జనసేన పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇన్నాళ్లు మెగా అభిమానాన్ని చాటిచెప్పిన అభిమానులు.. ఇక నుంచి జనసేనానికి నీరాజనం పట్టబోతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి రాజకీయ ఆరంగేట్రం చేయడంతో.. ఆయనకు బాసటగా నిలవబోతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన మెగా అభిమానుల ఆత్మీయ సమావేశంలో వారంతా జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
జనసేనలోకి వలసలు
జనసేన పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలువురు జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు మెగా అభిమానులు సైతం జనసేన వైపు చూస్తున్నారు. ఇన్నాళ్లు చిరంజీవి అభిమానులుగా ఉన్న వారంతా.. ఇప్పుడు జనసేనాని వెంటనడువబోతున్నారు. అన్నను అందలం ఎక్కించిన ఫ్యాన్సే.. ఇప్పుడు తమ్ముడి కి బాసటగా నిలవబోతున్నారు.
మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం
హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మెగా అభిమానులు భారీగా తరలివచ్చారు. సమావేశంలో పాల్గొన్న పవన్‌.. అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. పదేళ్లు సక్సెస్‌ లేకున్నా... ప్యాన్స్‌ అభిమానమే తనను నిలబెట్టిందని అన్నారు. ఎప్పటికీ అన్న చిరంజీవి మీద ప్రేమ, అభిమానం పెరిగేవే తప్ప.... తగ్గబోవన్నారు. తాను ఈ స్థాయిలో నిలబడటానికి కారణం మెగా అభిమానులేనని పవన్‌ స్పష్టం చేశారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా అండగా ఉండే పార్టీ జనసేన ఒక్కటే అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో జాతీయ భావం కలిగిన పార్టీ జనసేన మాత్రమేనన్నారు. ఒక విత్తు మొక్కగా మారి... చెట్టుగా ఎదిగేందుకు ఎన్నో కష్టాలు పడాలి.. ఎంతో యుద్ధం చేయాలని.. అటాంటి యుద్ధాన్నే ఇప్పుడు జనసేన చేస్తోందన్నారు. మెగా అభిమానుల ఆత్మీయ సమావేశానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. పవన్‌ సమక్షంలో మెగా అభిమానులు జనసేన పార్టీలో చేరిపోయారు. పవన్‌ కల్యాణ్‌ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

12:07 - May 13, 2018

చిత్తూరు : సంచలనాలకు మారు పేరైన పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకున్నారు. అందరి నేతలు..ప్రముఖల్లా కాకుండా సామాన్య భక్తుడిలా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం అర్ధరాత్రి తిరుమలకు చేరుకున్న పవన్ ఆదివారం ఉదయం రూ. 300 టికెట్ కొని క్యూ లైన్ లో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శించుకున్న అనంతరం ఆయన బస చేసే ప్రాంతానికి వెళ్లిపోయారు. తిరుపతిలో రాజకీయాలు వద్దు అంటూ మీడియాకు చెబుతూ వెళ్లిపోయారు. సాధువులు ఉండే మఠంలో పవన్ బస చేయనున్నారని, మూడు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారని తెలుస్తోంది. ఈ మూడు రోజుల పాటు సమీక్షలు జరిపి ఏపీ యాత్ర షెడ్యూల్ ను పవన్ ప్రకటించనున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - janasena party