indian politics

21:42 - May 4, 2018

కర్ణాటక : కర్నాటకలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంటోంది. వారం రోజుల్లో పోలింగ్‌ జరగనున్న కన్నడనాట.. అగ్రనేతల పర్యటనలు.. వారి వాగ్యుద్ధాలు.. రాజకీయ వాతావరణాన్ని పతాకస్థాయికి తీసుకు వెళుతున్నాయి. కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ప్రధాని మోదీ.. ఆయన మాటలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరోవైపు.. సొంత జిల్లా బళ్లారిలో ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా చక్రం తిప్పాలనుకున్న గాలి జనార్దనరెడ్డికి చుక్కెదురైంది.

కర్ణాటకలో ఎన్నికల వేడి
కర్నాటకలో ఎన్నికల వేడి.. మండువేసవిలోని భానుడి భగభగలను మించిపోయింది. ప్రధాని నరేంద్రమోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సిలికాన్‌ వ్యాలీని పాపాల లోయగా మార్చేశారని గార్డెన్‌సిటీని గార్బేజీ సిటీగా మార్చారంటూ ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీనిపై కాంగ్రెస్‌ అధినాయకత్వం మండిపడుతోంది.

మోదీ విమర్శలకు, ట్వీట్ల ద్వారా బదులిచ్చిన రాహుల్‌..
మోదీ విమర్శలకు, ట్వీట్ల ద్వారా బదులిచ్చిన రాహుల్‌.. కర్నాటక నగరాలకు బీజేపీ కన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వమే 11 వందల శాతం అధిక నిధులు కేటాయించిందన్నారు. అంతేకాకుండా, కర్నాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నభాగ్య, క్షీరధారె, కృషియంత్రధారె, సూర్యరైత లాంటి పథకాలు రైతులకు ఎంతలా ఉపయోగపడ్డాయో కూడా ట్వీట్లలో వివరించారు. ప్రధాని మోదీకి అబద్ధాలు చెప్పడం సహజంగా అబ్బిన విద్య అంటూ ఎద్దేవా చేశారు.

కీలకంగా మారిన జెడి(యు) అధినేత కుమారస్వామి
కాంగ్రెస్‌, బీజేపీ అగ్రనాయకత్వం వాగ్యుద్ధాలతో వాతావరణాన్ని వేడెక్కిస్తుంటే.. కీలకంగా మారిన జెడి(యు) అధినేత కుమారస్వామి చాపకింద నీరులా ప్రచారాన్ని నిర్వహించుకుంటూ వెళుతున్నారు. రాష్ట్రప్రజలు రెండు జాతీయ పార్టీలపై అసంతృప్తితో ఉన్నారని కుమారస్వామి విశ్వసిస్తున్నారు. ఎన్నికల రణక్షేత్రంలో.. కుమారస్వామి ఇప్పటికే రైతు రుణమాఫీ అస్త్రాన్ని ప్రయోగించారు. మహిళల ఓట్లను ఆకర్షించేందుకు.. స్త్రీశక్తి సంఘాలకు వడ్డీరహిత రుణాలు, ఐదువేల లోపు ఆదాయం ఉన్న కుటుంబాల్లోని ఆడపిల్లలకు నెలనెలా రెండు వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీలు గుప్పిస్తున్నారు.

హామీల తాయిలాలు..
కుమారస్వామి సంధించిన రైతురుణమాఫీ అస్త్రం దెబ్బతో.. బీజేపీ కర్నాటక శాఖ కూడా ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చింది. లక్షరూపాయల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, పంటలకు సాధారణ ధరకంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా మద్దతు ధర అందిస్తామనీ హామీ ఇచ్చింది. ఈమేరకు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప మేనిఫెస్టోను విడుదల చేశారు. రైతులే కాదు, చేనేత కార్మికుల రుణాలనూ మాఫీ చేస్తామన్నారు. మహిళల ఓట్లను ఆకర్షించేందుకు స్త్రీ ఉన్నతి నిధి పేరిట పదివేల కోట్లతో అతిపెద్ద సహకార సంఘాన్ని ఏర్పాటు చేస్తామనీ బీజేపీ మేనిఫెస్టోలో చేర్చింది. మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్‌లను రూపాయికే అందిస్తామని మేనిఫెస్టోలో తెలిపారు.

ప్రచారానికి వెళ్లేందుకు అనుమతి నిరాకరించిన కోర్టు
మరోవైపు.. ఈసారి ఎన్నికల్లో సొంత జిల్లా బళ్లారిలో ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ఆశించిన గాలి జనార్దనరెడ్డికి భంగపాటు ఎదురైంది. గనుల అక్రమ తవ్వకాల కేసులో.. ఈయన్ను బళ్లారికి వెళ్లకుండా.. కోర్టు గతంలో ఆంక్షలు విధించింది. బళ్లారిలో తన సోదరుడి తరఫున ప్రచారం నిర్వహించేందుకు అనుమతించాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఇంకోవైపు.. గురువారం నాడు ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా.. వేదికపై గాలి జనార్దనరెడ్డి సోదరుడు సోమశేఖరరెడ్డి కూడా ఉండడంపై.. కర్నాటక సీఎం సిద్దరామయ్య ట్విట్టర్‌లో విమర్శించారు. మైనింగ్‌ మాఫియా సూత్రధారి సోదరుడికి ఓటేయమంటూ.. చెప్పిన ప్రధాని, కాంగ్రెస్‌ పార్టీ బళ్లారిని మకిలి పట్టించిందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంకోవైపు.. కర్ణాటకలోని జయనగర్‌కు చెందిన బీజేపీ అభ్యర్థి బి.ఎన్‌.విజయ్‌ కుమార్‌.. ప్రచారం చేస్తూ.. గుండెపోటుతో మరణించారు. ఈయన జయనగర నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విజయకుమార్‌ మృతితో జయనగర స్థానానికి ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. 

18:29 - March 30, 2018

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితే.. గెలుస్తామో లేదోనన్న భయం.. కమలనాథుల్లో ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అందుకే పార్లమెంటులో ఈ అంశంపై చర్చ జరగకుండా అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. ఎన్ డీఏ నుంచి ఇప్పటికే 2 పార్టీలు బయటకు వచ్చాయని.. మిగతా మిత్రపక్షాలు కూడా మోదీ పాలన పట్ల సముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. తమ అవిశ్వాస తీర్మానంపై సోమవారం నుండి పార్లమెంటులో చర్చకు పట్టుపడతామని ఏచూరి తెలిపారు. 

17:47 - March 6, 2018

ఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ కార్తీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది.  సిబిఐ, ఈడీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు... ఈ కేసులో విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సిబిఐ కార్తీ చిదంబరాన్ని ఫిబ్రవరి 28న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. చిదంబరం మంత్రిగా ఉన్న సమయంలో ఎఫ్‌ఐపిబి క్లియరెన్స్‌ కోసం ఐఎన్‌ఎక్స్‌ మీడియా నుంచి కార్తి చిదంబరం ముడుపులు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. సీబీఐ వాదన అవాస్తవమని..రాజకీయ కక్షతోనే తనను వేధిస్తున్నారని కార్తీ ఆరోపిస్తున్నారు.

 

22:15 - December 22, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోది, బిజెపి నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. బిజెపి ఫౌండేషనే ఓ అబద్ధాల పుట్ట అని మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో తొలిసారిగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం పలు అంశాలపై చర్చించింది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్షతన తొలిసారిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.  ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ తదితర సీనియర్‌ నేతలు హాజరయ్యారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు, 2జీ కేసులో తీర్పు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై సిడబ్లుసి చర్చించింది.

సమావేశం అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ బిజెపిని, ప్రధాని మోదిని టార్గెట్‌ చేశారు. నోట్లరద్దు, గబ్బర్‌సింగ్‌ టాక్స్‌... బిజెపి చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఒక్కొక్కటిగా రుజువు అవుతోందని మండిపడ్డారు.  2జీ స్పెక్ట్రం కేసులో వచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ....నిజం ఏమిటో దేశ ప్రజలందరూ తెలిసుకున్నారని రాహుల్ అన్నారు.
బైట్‌ రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు

మోది గుజరాత్‌ అభివృద్ధి ఓ బూటకమని ఎన్నికల ఫలితాలు నిరూపించాయని రాహుల్‌ తెలిపారు. రఫేల్ ఒప్పందం, అమిత్‌షా కొడుకు సంపాదనపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్‌ నిలదీశారు. జయ్‌ షా 50 వేల పెట్టుబడి పెడితే అది మూడు నెలల్లో 80 కోట్లయిందని, అదెలా సాధ్యమని అడిగితే జవాబుండదని పేర్కొన్నారు. ఓ పారిశ్రామికవేత్తకు లాభం చేకూర్చేందుకే రాఫెల్‌ ఒప్పందం కుదుర్చుకున్నారని రాహుల్‌ విమర్శించారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని రాహుల్‌ ధ్వజమెత్తారు.

నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 వేలు జమ చేస్తామని మోదీ ప్రజలను నమ్మంచి...వంచించారని రాహుల్‌ అన్నారు. అసలు బీజేపీ ఫౌండేషనే ఓ అబద్ధాల పుట్ట అని ఎద్దేవా చేశారు. 

 

22:09 - December 15, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ శనివారం బాధ్యతలు స్వీకరించనుండడంతో ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం ముస్తాబైంది. రాహుల్‌ పట్టాభిషేక మహోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలతో పార్టీ కార్యాలయాన్ని అలంకరించారు.యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. రాహుల్‌ పట్టాభిషేకానికి ఒకరోజు ముందే బాజా భజంత్రీలతో కార్యకర్తలు సందడి చేశారు. మరి కొందరు కార్యకర్తలు కార్యాలయం ఆవరణలో డాన్స్‌ చేశారు. ఎఐసిసి కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఉదయం 11 గంటలకు రాహుల్‌ గాంధీ తల్లి సోనియాగాంధీ నుంచి అధ్యక్ష పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు.ఈ కార్యక్రమానికి సీనియర్‌ నేతలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు, తదతర నేతలు హాజరు కానున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు.

సంచలనం సృష్టించిన సోనియా వ్యాఖ్యలు
రాజకీయాల నుంచి తానిక రిటైర్‌ అవుతానని పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై స్పందించిన కాంగ్రెస్..సోనియా అధ్యక్ష బాధ్యతల నుంచి మాత్రమే రిటైర్‌ అవుతున్నారు...రాజకీయాల నుంచి కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు. ఆమె ఆశిస్సులు, సూచనలు పార్టీకి ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.ఎఐసిసి అధ్యక్షురాలిగా సోనియాగాంధీ 19 ఏళ్ల పాటు బాధ్యతలు చేపట్టారు. 125ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా వ్యవహరించిన వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ డిసెంబర్‌ 11న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ ఒక్కరే నామినేషన్ వేశారు. 47 ఏళ్ల రాహుల్‌ గాంధీ 2004లో రాజకీయాల్లోకి వచ్చారు. 2007లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌- యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ సారథ్య బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్- 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. ఆ ఎన్నికల్లో బిజెపి చేతిలో కాంగ్రెస్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 

14:22 - December 15, 2017
13:12 - December 15, 2017

న్యూఢిల్లీ : జాతీయ కాంగ్రెస్ పార్టీలో సమూల మార్పులు వస్తున్నాయా ? యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తారా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షురాలిగా 19 ఏళ్లుగా ఉన్న సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని బయటకు వస్తున్న సోనియా మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల నుండి తప్పుకోనున్నట్లు వెల్లడించారు. దీనితో శనివారం ఏఐసీసీ అధ్యక్ష పదవిని రాహుల్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం పార్టీలో మార్పులు తీసుకరావాలని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నట్లు టాక్. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుండి సోనియా ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈమె అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు వరుసగా రెండుసార్లు యూపీకు అధికార పీఠం దక్కింది. 

12:30 - December 15, 2017

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం నాడు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలకు హాజరై తిరిగి వెళుతుండగా సోనియా గాంధీ కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 19ఏళ్లుగా ఆమె కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనితో ఏఐసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలను శనివారం రాహుల్ చేపట్టనున్నట్లు సమాచారం. ఉత్తర్ ప్రదేశ్ నుండి రాయ్ బరేలి నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2013లో రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

  • ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టబోయే రాహుల్ గాంధీ.. కాంగ్రెస్‌లో ఐదో తరానికి చెందిన వారు.
  • నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి ఆరో వ్యక్తిగా చెప్పవచ్చు.
  • 132 ఏళ్ల వయసు కలిగిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు 45 ఏళ్ల పాటు నెహ్రూ-గాంధీ కుటుంబం చేతిలోనే ఉన్నాయి.
  • 19 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ అత్యంత ఎక్కువ కాలం ఆ బాధ్యతలు నిర్వర్తించారు.
  • జవహర్‌లాల్ నెహ్రూ 11 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు.
  • ఇందిరాగాంధీ ఏడేళ్లు, రాజీవ్ గాంధీ ఆరేళ్లు, మోతీలాల్ నెహ్రూ రెండేళ్లు కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు.
  • రాహుల్ పట్టాభిషేకానికి ముహూర్తం ఎప్పుడో సిద్ధమైందనే సంగతి తెలిసిందే. కానీ 2016లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలు విడిచిపెట్టలేకపోయారనే విమర్శలున్నాయి. 
20:28 - December 11, 2017

సవాళ్లు కావలసినన్ని ఉన్నాయి.. కళ్లముందే గుజరాత్ ఎన్నికలు.. ఇంకాస్త ముందుకెళితే పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు, 2019 సార్వత్రిక ఎన్నికలు సిద్ధంగానే ఉన్నాయి. వీటితో పాటు..నిన్న మొన్నటి పార్టీ వైఫల్యాలు వెంటాడుతూ ఉంటే, పార్టీ కేడర్ ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం భారీగా ఉన్నాయి. తరుణంలో పార్టీ పగ్గాలు చేపట్టాడు రాహుల్ గాంధీ.. మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని పరుగులు తీయిస్తారా...ఎంట్రీ ఇచ్చినప్పుడున్న అమాయకత్వం ఇప్పుడు లేకపోవచ్చు.. రాజకీయ క్షేత్రంలో క్రమంగా రాటుదేలుతున్న తీరు కనిపిస్తూ ఉండొచ్చు..ఇది కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురాగలదా? గత వైఫల్యాలను అధిగమించి బీజెపీని దాటగలదా? ఇదే ఇప్పుడు రాహుల్ ముందున్న ప్రశ్న..వారసత్వ రాజకీయాలు మనదగ్గర సాధారణంగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం నుంచి నాయకత్వం లేకపోతే మిగతా నాయకులకు ఊపిరాడని పరిస్థితి. జాతీయ పార్టీగా అత్యున్నత స్థితితో పాటు, అత్యంత హీనమైన స్థితిని కూడా చూస్తున్న కాంగ్రెస్ శ్రేణుల్ని రాహుల్ ఏ మేరకు సమర్ధంగా నడిపించగలరనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తున్న అంశం..

నిజానికి రాహుల్ గాంధీ అనధికారికంగా ఎప్పుడో పగ్గాలు తీసుకున్నట్టే.. కానీ, ఇప్పుడుఅఫీషియల్ గా పార్టీ అధ్యక్షుడయ్యాడని చెప్పుకోవాలి.. ఈ తరుణంలో రాహుల్ ముందు సవాళ్లు సమీపంలో ఉన్నాయి. అగ్నిపరీక్ష లాంటి ఎన్నికలు కళ్లముందే ఉన్నాయి. ఇక పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.. ఈ తరుణంలో రాష్ట్రాల ఎన్నికలతో పాటు... 2019 రాహుల్ ముందున్న సవాల్.. గతంలో ఉపాధ్యక్షుడిగా రాహుల్ ఎంట్రీ ఇచ్చినంత గొప్పగా ఆ తర్వాత రిజల్ట్ కనిపించలేదనే చెప్పాలి. అంటే, ప్రజానీకంలో పాతుకుపోవటానికి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వరుసగా దెబ్బకొడుతూనే ఉన్నాయి. ఇవన్నీ, రాహుల్ సామర్ధ్యాన్ని స్పష్టం చేస్తున్నాయా? ఇప్పుడు పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్న తర్వాత మార్పు వచ్చే అవకాశముందా?

జాతీయ పార్టీగా ఒకనాటి ప్రభ మళ్లీ రావాలంటే అంత తేలికేం కాదు. దాని కోసం శ్రమించాల్సి ఉంటుంది. జిమ్మిక్కులు, తాత్కాలిక మెరుపులు, వ్యంగాస్త్రాల ఉపన్యాసాలతో ప్రయోజనం తాత్కాలికమే. విధానాల మార్పు, ప్రజలకోసం ఉద్యమాలు చేయగలగటం పార్టీలకు, ఆ మార్గంలో త్యాగాలకు సిద్ధమౌతూ ప్రజా బాహుళ్యానికి చేరువ కావటమే రాజకీయ నాయకులకూ సరైన పరిష్కారం అవుతుంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:38 - August 9, 2017

కొరటాల శివ...చేసిన సినిమాలు మాత్రం మూడే. కానీ ఈ సినిమాలు ఎంతగానో గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రభాస్ తో మిర్చి, మహేష్ బాబుతో శ్రీమంతుడు, జూ.ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చిత్రాలు తీసిన సంగతి తెలిసిందే. సమాజానికి ఉపయోగపడే అంశాలను తెరకెక్కించడంలో ఆయన స్టైలే వేరు. స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన ఈ దర్శకుడు వివాదాలకు దూరంగా ఉంటాడు.

మొన్నీ మధ్య డ్రగ్స్ వ్యవహారంలో కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. కానీ తాజాగా ఆయన రాజకీయాలపై చేసిన కామెంట్స్ చర్చ జరుగుతోంది. రాజకీయాలు పూర్తిగా చెడిపోయాయని, మురికి పట్టేశాయి..దేవుడొచ్చినా బాగు చేయలేడు..మనకు మనమే మారితే కానీ రాజకీయాలు మారవు అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో మహేష్ హీరోగా నటిస్తున్నారు. 'భరత్ అనే నేను' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. పూర్తిగా రాజకీయ నేపథ్యంలో సినిమా ఉంటుందని, మహేష్ ఇందులో సీఎం పాత్రలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగానే కొరటాల రాజకీయాలపై వ్యాఖ్యలు చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఆయన చేసిన కామెంట్స్ సినిమాకు ఎంతగా ఉపయోగపడుతాయో వేచి చూడాలి. 

Pages

Don't Miss

Subscribe to RSS - indian politics