India Vs England

07:06 - September 12, 2018

ఓవల్‌ టెస్ట్‌లో భారత్‌ ఓటమి పాలయ్యింది. భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. ఆ తర్వాత భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 292 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. దీంతో 40 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ విజృంభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 423 పరుగులు చేసి.. భారత్‌కు 464 పరుగల లక్ష్యాన్ని ముందుంచింది. అయితే లక్ష్యఛేదనలో భారత్‌ మరోసారి తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించిన విహారి... ఈ ఇన్నింగ్స్‌లో పరుగులు చేయకుండా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్‌ పంత్‌.. రాహుల్‌కు మంచి సహకారాన్ని అందిస్తూ బ్యాటింగ్‌ చేశాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రాహుల్‌, పంత్‌లు సెంచరీలు చేశారు. అయితే.. 82వ ఓవర్‌లో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత రిషబ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ దారిపట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వారెవరూ రాణించలేదు. దీంతో భారత్‌ 94.3 ఓవర్లలో 345 పరుగులు చేసి ఆలౌంట్‌ అయ్యింది. ఫలితంగా ఇంగ్లండ్‌ ఈ మ్యాచ్‌లో 118 పరుగుల తేడాతో విజయం సాధించి.. 4-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇరు ఇన్నింగ్స్‌లో అద్బుతంగా రాణించిన అలెస్టర్‌ కుక్‌కి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో 250కి పైగా పరుగులు చేసి.. 11 వికెట్లు తీసిన యువ క్రికెటర్‌ శామ్‌ కర్రన్‌కి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కింది. 

 

07:35 - September 11, 2018

ఢిల్లీ : ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో బ్రిటీష్‌ ఆటగాళ్లు పట్టుబిగించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 332 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 423 పరుగులకు డిక్లేర్డ్‌ చేసింది. దీంతో భారత్‌ ముందు ఇంకా 464 పరుగుల లక్ష్యం ఉంచింది. ఇప్పటికి 58 పరుగులకు కీలమైన మూడు వికెట్లు భారత్‌ కోల్పోయింది. క్రీజ్‌లో రాహుల్‌, రహానే ఉన్నారు.  మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఇండియాకు మరో 406 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. 

20:15 - August 29, 2018

రేపటినుండి ఇండియా, ఇంగ్లండ్ మధ్య నాలుగవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు నెగ్గిన ఇంగ్లండ్ విజయోత్సాహంతో వుండగా..ఇండియా మాత్రం ఒక మ్యాచ్ గెలిచి రెండు రెండు మ్యాచ్ లతో సమం చేసి అంతిమపోరులో విజయం సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలో నాలుగవ మ్యాచ్ గెలిచి సిరిస్ ను సొంతంచేసుకోవాలని ఇంగ్లండ్ ఉబలాటపడుతోంది. నేపథ్యంలో నాలుగవ టెస్ట్ ఇరు జట్ల మధ్య కీలకంకానుంది.

16:53 - August 22, 2018

ఢిల్లీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో 203 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. చివరిరోజు 2.5 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్‌ 317 పరుగుల వద్ద చివరి వికెట్‌ కోల్పోయింది. 9 వికెట్లకు 311 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌.. మరో ఆరు పరుగులు మాత్రమే చేసింది. 11 పరుగులు చేసిన అండర్సన్‌... అశ్విన్‌ బౌలింగ్‌ ఔటయ్యాడు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది కోహ్లీ సేన. రెండో ఇన్నింగ్స్‌ బుమ్రా 5, ఇషాంత్‌ 2, షమి, అశ్విన్‌, పాండ్యా తలా ఒక వికెట్‌ తీసుకున్నారు. బట్లర్‌ సెంచరీ, స్టోక్స్‌ హాఫ్‌ సెంచరీ చేసినా ఇంగ్లండ్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయారు. 

07:55 - August 21, 2018

ఢిల్లీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెలరేగి ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించాడు. తొలి ఇన్నింగ్స్‌లో తృటిలో చేజార్చుకున్న సెంచరీని రెండో ఇన్నింగ్స్‌లో సాధించి తన సత్తా సాధించుకున్నాడు. 191 బంతుల్లో 10 ఫోర్లతో టెస్టుల్లో 23వ సెంచరీ సాధించాడు. అనంతరం 103 పరుగుల వద్ద క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్లూ రూపంలో పెవిలియన్‌ బాటపట్టాడు. ఈ సెంచరీతో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 58వ సెంచరీ... 2018లో 6వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో అత్యధిక సెంచరీలు చేసిన టెస్ట్‌ కెప్టెన్ల జాబితాలో కోహ్లీ చేరాడు.  భారత్‌ ఇంగ్లాండ్‌ ముందు 521 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. సోమవారం ఆట చివర్లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ వికెట్‌ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజ్‌లో కుక్‌, జెన్సింగ్స్‌ ఉన్నారు.  

 

09:12 - August 13, 2018

లండన్ : క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో విజయం సాధించాలనుకున్న కోహ్లీసేన పరాజయంపాలైంది. 159 పరుగుల ఇన్సింగ్స్‌ తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఇంగ్లాండ్‌  2-0తో  ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్యాట్స్‌మెన్స్‌ వైఫల్యం కారణంగా.. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో మిగతా మూడు టెస్టులను గెలవక తప్పని పరిస్థితి ఏర్పడింది.. రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌, హార్దిక్‌ పాండ్య మినహా ఏ ఒక్కరూ 20 పరుగుల స్కోరుకు కూడా చేరుకోలేదు.  వెన్నునొప్పితో బాధపడుతున్న విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. మూడో టెస్టులోనూ ఆడటం అనుమానంగానే తోస్తోంది. జేమ్స్‌ అండర్సన్‌ , స్టువర్ట్‌ బ్రాడ్‌, క్రిస్‌వోక్స్‌, కోహ్లీసేన పతనాన్ని నిర్దేశించారు. 

 

08:54 - July 17, 2018

ఇంగ్లండ్ : నిర్ణయాత్మక మూడో వన్డే పోరుకు ఇండియా-ఇంగ్లాండ్‌ జట్లు సిద్ధమయ్యాయి. టీ20 సిరీస్‌లాగే వన్డే సిరీస్‌నూ చేజిక్కించుకోవాలనే పట్టుదలతో భారత్‌ బరిలోకి దిగుతోంది. ఇవాళ్టి మ్యాచ్‌లో సిద్ధార్థ్‌ కౌల్‌ స్థానంలో భువనేశ్వర్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టెస్టు సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌పై మానసిక విజయం సాధించాలని భారత్‌ చూస్తోంది. అయితే వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించడం అంత తేలిక కాదని రెండో మ్యాచ్‌లో తేలిపోయింది. భారత్‌ బ్యాటింగ్‌,బౌలింగ్‌ బలహీనతలను లార్డ్స్‌ ఓటమి బయటపెట్టింది. బలహీనతలను అధిగమించి భారత్ మ్యాచ్‌ గెలుస్తుందా లేదా అనేది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. 

09:27 - July 15, 2018

ఢిల్లీ : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌ చిత్తుగా ఓడింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 323 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో భారత క్రికెటర్లు ఘోరంగా విఫలం అయ్యారు.  మొదటి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్దేశిత 50 ఓవర్లలో 322 పరుగులు చేసింది.  323 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.  ఓపెనర్లు రోహిత్‌శర్మ, శిఖర్‌ ధావన్‌ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేరారు.  విరాట్‌కోహ్లీ, రైనాల జోడి జట్టును ఆదుకునేందుకు ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. భారత్‌ 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 236 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇంగ్లాండ్‌ 86 పరుగుల తేడాతో విజయం సాధించి... సిరీస్‌ను 1-1తో సమయం చేసింది. ఇక మంగళవారం జరుగనున్న మూడో వన్డేలో సిరీస్‌ ఫలితం తేలనుంది.

 

11:36 - July 13, 2018

ఇంగ్లండ్ : ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 40.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 137 పరుగులు చేసి భారత్‌ను సునాయాసంగా గెలిపించాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 75 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. శిఖర్‌ ధావన్‌ 40 పరుగులు చేశాడు. కేఎల్‌ రాహుల్‌ 9 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 49.5 ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ ఆరువికెట్లు తీసి ఇంగ్లాండ్‌ నడ్డి విరిచాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్‌ దూసుకెళ్లింది. రెండే వన్డే లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో ఈ నెల 14న జరుగనుంది. కుల్దీప్‌ యాదవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

 

 

07:04 - July 9, 2018

ఢిల్లీ : మూడో టీ-20 మ్యాచ్‌లో టీం ఇండియా అద్భుత విజయం సాధించింది. మన క్రికెటర్లు అద్భుతమైన ఆటతీరుతో ఇంగ్లండ్‌ క్రికెటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ చిత్తైంది. దీంతో 2-1 తేడాతో టీ 20 సిరీస్‌ను ఇండియా గెల్చుకుంది. రోహిత్ శర్మ, హార్థిక్ అద్భుతమైన ఆటతీరుతో భారత్‌కు విజయం తెచ్చిపెట్టారు. ఇంగ్లండ్ క్రికెటర్లను మనవాళ్ళు ముచ్చెమటలు పట్టించారు. భారత జట్టు వరుసగా ఆరు అంతర్జాతీయ టీ-20 సిరీస్‌లు, మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీసులు ఎనిమిది కైవసం చేసుకుంది.

టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. 199 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో జేసన్ రాయ్ 67, బట్లర్ 34, హేల్స్ 30 పరుగులు చేశారు.

200 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన టీమ్‌ ఇండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్ విల్లీ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి శిఖర్ ధవన్ ఔట్ అయ్యాడు. తర్వాత కేఎల్ రాహుల్ 19 పరుగులకు ఔట్ అయ్యాడు. ఈ దశలో రోహిత్, విరాట్‌లు జట్టుకు అండగా నిలిచారు. 3వ వికెట్‌కి 89 పరుగులు జోడించిన వీరిద్దరు... స్కోర్ బోర్డును పరుగులు తీయించారు. 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ జోర్డన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌ చేసిన హార్థిక్‌తో కలిసి రోహిత్ చెలరేగిపోయాడు. 56 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులు కొట్టాడు. మొత్తానికి 100 పరుగులతో జట్టు విజయానికి కీలకంగా వ్యవహరించాడు. హార్థిక్ 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు తీశాడు. దీంతో టీమ్‌ ఇండియా 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. మ్యాచ్‌ను 7 వికెట్ల తేడాతో గెలిచి... సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో మొత్తం 137 పరుగులు చేసిన రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - India Vs England