human rights

14:36 - September 12, 2018

న్యూఢిల్లీ: వరవరరావు సహా ఇతర నలుగురు మానవ హక్కుల నేతలకు గృహనిర్బంధాన్ని వచ్చే సోమవారం (సెప్టెంబరు 17) వరకు కొనసాగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.  ఐదుగురు మానవ హక్కుల నేతల విడుదల కోసం దాఖలైన పిటీషన్ ను విచారించిన కోర్టు వారి గృహనిర్బంధాన్ని పొడిగించాలని ఆదేశాలు జారీచేసింది.

చరిత్రకారుడు రోమిల థాపర్ హక్కుల నేతలు ఐదుగురిని విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తెలుగ రచయిత వరవరరావు, హక్కుల నేతలు వెర్నాన్, అరుణ్ ఫెర్రీరా, లాయర్ సుధా భరధ్వాజ్, పౌరహక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను మహారాష్ట్ర పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.   

15:59 - December 7, 2017

మహిళలపై జరుగుతున్న లైంగిక, శారీరక దాడులపై ఐక్య రాజ్యసమితి ( ఐరాస) పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. మహిళలపై జరుగుతున్న దాడులు, హింసతోపాటు పలు రకాల దాడులకు వ్యతిరేకంగా నవంబర్ 25 నుంచి మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10 వరకు ఐరాసా పలు సదస్సులు కొనసాగనున్నాయి. ఇదే అంశంపై ఇవాళ్టి మానవి స్పెషల్ ఫోకస్ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

22:06 - August 16, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని నేరెళ్లలో బలహీనవర్గాలను పోలీసులు చిత్రిహింసలకు గురిచేసిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనపై వరంగల్‌ ఎంజిఎం ఆస్పత్రి డాక్టర్లు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను ప్రభుత్వం సీల్డు కవర్‌లో హైకోర్టుకు అందజేసింది. ఎస్ ఐ రవీందర్‌ సస్పెన్షన్‌పై నివేదిక ఇవ్వాలని కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. 
హైకోర్టులో విచారణ 
నేరెళ్ల బాధితులను పోలీసులు చిత్రహింసలకు గురిచేసిన ఘటన కేసుపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పౌరహక్కుల సంఘం వేసిన కేసులో బెంచ్‌ వాదనలు విన్నది. బాధితులను పరీక్షించి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వం తరుపున అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు సీల్డు కవర్‌లో కోర్టుకు అందజేశారు.
హైకోర్టు బెంచ్‌ కు నివేదిక 
ఎంజీఎం వైద్యులు ఇచ్చిన నివేదికను పరిశీలించిన హైకోర్టు బెంచ్‌... బాధితులందరికీ ఒకేచోట గాయాలు ఎలా అయ్యాయని ప్రశ్నించింది. బాధితులు కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందడంతో, గాయాలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సూరింటెండెంట్‌ను ఆదేశించింది. అలాగే బాధితులు కరీంనగర్‌ సబ్‌ జైల్లో ఉన్నప్పటి... వారెంట్‌తో పాటు మెడికల్‌ రిపోర్టును ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. దీంతో పాటు నేరెళ్ల కేసులో ఎస్‌ఐ రవీందర్‌ను సస్పెండ్‌ చేయడానికి దారితీసిన పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీని ఆదేశించింది. ఈ కేసులో డీఐజీని ప్రతివాదిగా చేర్చింది. నేరెళ్ల ఘటనపై అందిన అన్ని ఫిర్యాదులను కూడా కోర్టుకు  సమర్పించాలని కోరింది. వీటిని పరిశీలించిన తర్వాత ఎస్పీ విశ్వజిత్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తామని హైకోర్టు చెప్పింది. నేరెళ్ల బాధితలును పోలీసులు చిత్రహింసలకు గురిచేయలేదని, ఈ ఘటనను రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని ఇంతకు ముందు కోర్టు దృష్టికి తెచ్చిన ప్రభుత్వం... తాజా పరిణామాలతో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. 
 

14:36 - May 23, 2017

ఢిల్లీ : బాలీవుడ్‌ నటుడు, బిజెపి ఎంపి పరేష్‌ రావెల్‌ వివాదస్పద ట్వీట్‌పై స్పందించడానికి ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతిరాయ్‌ నిరాకరించారు. ప్రస్తుతం తన కొత్త పుస్తకం పనిలో బిజీగా ఉన్నానని అరుంధతిరాయ్‌ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ అన్నారు. అరుంధతి రాయ్‌ రాసిన 'ద మినిస్ట్రీ ఆప్‌ ఎట్‌మోస్ట్‌ హ్యాపీనెస్‌' పుస్తకాన్ని వచ్చేనెల మార్కెట్‌లోకి తేనున్నారు. 30 దేశాల్లో ఒకేసారి ఈ పుస్తకం విడుదల అవుతోంది. కశ్మీర్‌లో రాళ్లు విసిరే యువకుడికి బదులుగా అరుంధతిరాయ్‌ను ఆర్మీ జీప్‌కు కట్టాలని పరేష్‌ రావెల్‌ ట్వీట్‌ చేయడంపై దుమారం చెలరేగింది. కశ్మీర్‌ యువకుడిని జీప్‌కు కట్టిన తర్వాత అరుంధతి రాయ్‌ కశ్మీర్‌ వెళ్లారని పాక్‌కు మద్దతుగా ప్రకటన చేశారని వార్తొలొచ్చాయి. ఇది పూర్తిగా తప్పడు ప్రచారమని ఆమె ఖండించారు. పరేష్‌ రావెల్‌ ట్వీట్‌ చేసిన కొన్ని గంటలకే కశ్మీరీ యువకుడిని జీప్‌కు కట్టిన ఆర్మీ మేజర్ లితుల్‌ గోగొయ్‌కు అవార్డు వరించడం గమనార్హం.

14:26 - January 25, 2017

గుంటూరు : మహిళా సాధికారత కోసం మూడు రోజులపాటు నిర్వహించే కాన్ఫరెన్స్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన మహిళా నేతలు పాల్గొంటారని అన్నారు. వివిధ దేశాలకు చెందిన నేతలు కూడా కాన్ఫరెన్స్‌లో భాగమవుతారని కూడా చెప్పారు.  మహిళల అభివృద్ధి కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కాన్ఫరెన్స్‌లో చర్చించడం జరుగుతుందని అన్నారు.

 

14:57 - January 27, 2016

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది 1989 సంవత్సరంలో వచ్చిందని, ఈ చట్టానికి సవరణలు తీసుకొచ్చారని లాయర్ పార్వతి పేర్కొన్నారు. అసలు ఈ చట్టం అంటే ఏమిటీ ? దీని ప్రాధాన్యత ఏమిటీ ? అనే అంశంపై టెన్ టివిలో ' మైరైట్' కార్యక్రమంలో లాయర్ పార్వతి విశ్లేషించారు. సమాజంలో అనాదిగా అంటరానితనం అనే వివక్ష ఉందని, దీనిపై ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు. సమాజంలో వివక్ష చూపిస్తే పౌర హక్కులకు భంగం కలుగుతుందని పేర్కొంటూ ఆనాడే చట్టం వచ్చిందని, సమాజంలో వివక్ష, అంటరానితనానికి గురవుతుంటుంటారని పేర్కొన్నారు. తగినటువంటి శిక్షలు విధించడం కోసం ఈ చట్టం వచ్చిందని, ఇందులో అనేక రకాల అంశాలను పొందుపరిచి ఉంటాయని లాయర్ పార్వతి పేర్కొన్నారు. మరిన్ని విశేషాల కోసం వీడియో చూడండి. 

13:34 - January 15, 2016

కరీంనగర్ : పొట్టకూటి కోసం ఇతర జిల్లాలు..రాష్ట్రాల నుండి వలస వస్తుంటారు. కూలీలుగా మారి జీవనం సాగిస్తుంటారు. వీరిని అక్కున చేర్చుకుని చేసిన కష్టానికి తగిన వేతనం..రక్షణ ఇవ్వాల్సిన వారు వేధింపులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కార్మిక శాఖ అధికారులు లేకపోవడంతో ఏకంగా 45 కిలోమీటర్లు నడిచి తమ సమస్యను కలెక్టర్ కు విన్నవించుకున్నారు. వివరాల్లోకి వెళితే…ఒడిశా రాష్ట్రానికి చెందిన కొందరు పెద్దపల్లి మండలం రంగాపూర్ లో ఇటుక బట్టీల్లో పనులు చేస్తున్నారు. పద్మావతి ఇటుక బట్టీ యజమాని వెంకటేశ్వరావు తమపై దాడి చేశాడని, తమకు న్యాయం చేయాలని కూలీలు రోడ్డెక్కారు. కార్మికశాఖ అధికారులు పెద్దపల్లిలో అందుబాటులో లేకపోవడంతో కాలినడకన 42కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ కలెక్టరేట్‌కు గురువారం అర్థరాత్రి చేరుకున్నారు. ఉదయం కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్, లేబర్ ఆఫీసర్ నీలిమా, ఎమ్మార్వో జయచంద్రారెడ్డి కూలీలతో మాట్లాడి కలెక్టర్ దగ్గరికి కార్మికులను తీసుకెళ్లారు. కలెక్టర్ వారితో మాట్లాడి ఒడిశాకు పంపే ఏర్పాట్లు చేస్తామని హామి ఇచ్చారు. ఒరిస్సా కూలీలకు పౌరహక్కులసంఘం, సీపీఎం పార్టీ మద్దతిచ్చాయి.

12:54 - September 25, 2015

విజయవాడ : ప్రశ్నిస్తే పోలీసు లాఠీలు కుళ్లబొడుస్తున్నాయి..! నిలదీస్తే.. ఖాకీ బూట్లు కర్కశంగా తొక్కేస్తున్నాయి..! నిరసన తెలిపితే నిర్దాక్షిణ్యంగా ఈడ్చేస్తున్నారు..! న్యాయం అడిగితే అన్యాయంగా చావబాదుతున్నారు..! ఆందోళన చేసేవారికి బేడీలు వేస్తున్నారు, ఉద్యమిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు..! అసలు, చంద్రబాబు ఏలుబడిలో ఏం జరుగుతోంది..? ప్రజా ఉద్యమాలను అణిచేయ చూస్తున్న ప్రభుత్వం.. ప్రజలకు ఎలాంటి సందేశమిస్తోంది..??

విద్యార్థులను చావబాదుతున్నారు......

సమస్యలు పరిష్కరించాలన్న విద్యార్థులను చావబాదుతున్నారు... భూములు లాక్కోవద్దంటున్న రైతులను బెదిరిస్తున్నారు... నిరసన తెలిపే ప్రతిపక్షాలపై నిర్బంధం ప్రయోగిస్తున్నారు... ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామిక చర్య రాజ్యమేలుతోంది. నిరసన తెలిపే స్వేచ్ఛను, ఆందోళన చేసే హక్కును కూడా హరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాగిస్తున్న పాలనను తరచిచూస్తే ఇలాంటివి ఎన్నో అనుమానాలు, మరెన్నో ఆందోళనలు కలుగుతున్నాయి.

నెలల తరబడి ఆందోళన చేస్తున్న బాధితులు......

మా బతుకులపై రన్‌వే నిర్మించొద్దంటూ.. మా జీవితాలపై విమానాల రాకపోకలు సాగించొద్దంటూ భోగాపురం ఎయిర్‌ పోర్టు బాధితులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టుకు పచ్చటి భూములను బలిచేయొద్దని, తమ బతుకులను బలివ్వొద్దంటూ నిరసన తెలుపుతున్నారు. వాళ్లు ఎన్నిరకాల ఆందోళనలు చేసినా వినిపించుకోని ప్రభుత్వం.. భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. బలవంతంగానైనా భూములు తీసుకుని తీరుతామంటూ పరోక్షంగా తేల్చిచెప్పింది.

బందరు పోర్టు వ్యవహారంలోనూ అదే తీరు....

ఇక రాజధాని భూముల విషయంలోనూ, బందరు పోర్టు భూముల అంశంలోనూ ప్రభుత్వం నిర్బంధ సూత్రాన్నే అమలు చేస్తోంది. రాజధానికోసం అవసరానికి మించి వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు బందరు పోర్టు విషయంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. వేలాది ఎకరాలను లాక్కుంటున్న ప్రభుత్వం.. ప్రశ్నిస్తున్న వారిని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందంటున్నారు. బందరు పోర్టు భూములను బలవంతంగా లాక్కునేందుకే భూ సేకరణ చట్టాన్ని ప్రయోగిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విద్యార్థులకు కొట్టించిన సర్కార్‌......

ఇక, ఇటీవల విద్యార్థులపైనా చంద్రబాబు ప్రభుత్వం ప్రతాపం చూపింది. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ తోపాటు, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరడమే విద్యార్థుల పాపమైంది. తమను ఆదుకోవాలని నినదించినందుకు విద్యార్థులపట్ల అమానుషంగా ప్రవర్తించింది. ప్రభుత్వ ఆదేశాలతో రెచ్చిపోయిన ఖాకీలు.. విద్యార్థులను రోడ్డుమీద పడేసి గొడ్డును బాదినట్టు బాదారు.

ఏపీ సీపీఎం కార్యదర్శి మధు అరెస్ట్‌ ......

ప్రతిపక్షాలను సైతం ప్రభుత్వం వదలడం లేదు. భూములు కోల్పోతున్న రైతులతో ముచ్చటించేందుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును మధ్యలోనే అడ్డగించిన పోలీసులు.. అక్రమంగా అరెస్టు చేశారు. తాజాగా.. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేపడుతున్న వైసీపీ విషయంలోనూ ఇదేతరహా విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. గుంటూరులో దీక్ష చేపట్టేందుకు ప్రతిపక్ష నేత జగన్‌ అనుమతి కోరితే పోలీసులు నిరాకరించారు. దీంతో.. అటు వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం తలెత్తింది.

తుళ్లూరులో పోలీసుల నిర్భంధం.....

తుళ్లూరు వాసులది మరో వేదన. ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చి.. నిరాశ్రయులైన ఈ ప్రాంత రైతులు.. నెలనెలా ప్రభుత్వం ఇస్తామన్న చెక్కులు అందక పోవడంతో ఆందోళనకు ప్రయత్నించారు. దీంతో పోలీసుల నుంచి నిర్బంధం ఎదురైంది. నిలదీస్తే నిర్బంధాలు.. రోడ్డెక్కితే అరెస్టులు.. జరుగుతుండడంతో.. వీరు బయటకు వచ్చేందుకే జంకారు. అయితే.. తమ నిరసనను వ్యక్తీకరించేందుకు.. వినూత్నంగా గృహదీక్షకు కూర్చున్నారు.

ప్రశ్నించిన వారికి నిర్బంధం.....

ఈ విధమైన చర్యల ద్వారా.. ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నించిన వారికి నిర్బంధం తప్పదనే సంకేతాన్ని చంద్రబాబు ప్రభుత్వం జనాల్లోకి పంపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే.. ప్రజాసంఘాలు మాత్రం సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. నిర్బంధానికి పరాకాష్టగా నిలిచిన గత పాలనను గుర్తుచేసుకోవాలని, పాత బాటలోనే మళ్లీ పయనిస్తే.. ప్రజల చేతిలో పరాభవం తప్పదని హెచ్చరిస్తున్నాయి...

Don't Miss

Subscribe to RSS - human rights