ec

11:09 - November 5, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగున్నాయి. డిసెంబర్ నెలలో జరిగే ఈ ఎన్నికలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉండడంతో ఈసీ పలు నిబంధనలు విధిస్తోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఇటీవలే అమల్లోకి తెచ్చిన రైతు బంధు పథకం మీద ఈసీ ఆంక్షలు విధించింది. ఈ పథకంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. 
తాజాగా రైతు బంధు పథకంలో నగదు బదిలీని నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఖరీఫ్‌లో చెక్కులు అందుకున్న వారికి మాత్రమే నగదు బదిలీ చేయాలని, కొత్తలబ్దిదారులను చేర్చవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లు సమాచారం. ఇందులో సుమారు 2 లక్షల మంది లబ్దిదారులున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 4 లక్షల 90 వేల మంది రైతులకు ప్రయోజనం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో 2.9 లక్షల మంది పాస్ పుస్తకాలు అందలేకపోవడంతో నగదు అందలేదని టాక్. చెక్కులు అందచేసి నగదు ఎందుకు బదిలీ చేయరని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తమకు డబ్బు వస్తుందని ఆశించిన రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

08:56 - October 31, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులపై ఏపీ డీజీపీ స్పందించారు. ఇంటెలిజెన్స్‌ ఏడీజీతో మాట్లాడి సమగ్ర వివరాలతో డీజీపీ రిప్లై పంపారు. దొరికిన వారంతా నోటీసులో చెప్పిన విధంగా వారంతా ఇంటెలిజెన్స్‌ అధికారులేనని స్పష్టం చేశారు. వారి దగ్గర నగదు ఉందనేది కూడా అవాస్తవమన్నారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో సమాచారం సేకరించడానికే ఏపీ పోలీసులు తెలంగాణకు వెళ్లినట్టు డీజీపీ వివరణ ఇచ్చారు.

కొన్ని రోజుల క్రితం నిజామాబాద్‌ జిల్లా ధర్మపురిలో ఓటర్లకు డబ్బులు పంచుతూ కొంతమంది పోలీసులకు చిక్కారు.  అయితే వారిని విచారించగా ఏపీ పోలీసులుగా తేలింది.  దీంతో ఆంధ్రా పోలీసులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్‌ఎస్‌ ఫైర్‌ అయ్యింది.  అంతేకాదు.. వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. డబ్బులు పంచిన ఏపీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఈసీని టీఆర్‌ఎస్‌ కోరింది.

టీఆర్‌ఎస్‌ ఫిర్యాదుతో  ఈసీ ఏపీ డీజీపీకి నోటీసులు ఇచ్చింది. పోలీసులకు తెలంగాణలో పనేంటి, వారు డబ్బులు పంచడమేంటని ప్రశ్నించింది. వెంటనే సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఏపీ డీజీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చుకున్నారు. ఇంటెలిజెన్స్‌ ఏడీజీతో మాట్లాడి సమగ్ర వివరాలతో డీజీపీ సమాధానం పంపారు. దొరికిన వారంతా ఇంటెలిజెన్స్‌ అధికారులేనని స్పష్టం చేశారు. వారి దగ్గర నగదు ఉందని కొంతమంది ఆరోపిస్తున్నారని.. అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అదంతా అవాస్తవమని కొట్టిపారేశారు.

ఏపీ పోలీసులు తెలంగాణకు ఎందుకు వెళ్లాలన్న ప్రశ్నకు ఆయన సవివరమైన సమాధానం చెప్పారు. మావోయిస్టుల కదలికలకు సంబంధించిన సమాచార సేకరణలో ఇంటెలిజెన్స్‌ సిబ్బంది తెలంగాణకు వెళ్లారని వివరణ ఇచ్చారు. ఇంటెలిజెన్స్‌ నిఘాలో భాగంగా ఏ ప్రాంతానికైనా వెళ్లే హక్కు వారికి ఉంటుందని తెలిపారు. తెలంగాణలో ఇంకా ఏపీ ఇంటెలిజెన్స్‌కు యూనిట్‌ కూడా ఉందన్నారు. ఎన్నికల సంఘం పంపిన వీడియోలోనూ నగదు ఎక్కడా లేదని స్పష్టం చేశారు.

21:37 - October 26, 2018

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం(ఈసీ) స్పందించింది. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ మహాకూటమి నేతలు చేసిన ఫిర్యాదులపై ఈసీ స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ డీజీపీని ఆదేశించారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో చెప్పాలని డీజీపి ఆదేశించారు. 
ఎంఎంటీఎస్ రైళ్లలో సీఎం కేసీఆర్ ప్రకటనలతో కూడిన ఫొటోలు పెట్టారన్న ఫిర్యాదుపై నివేదిక ఇవ్వాలని రజత్ కుమార్ దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరారు. ఇదే అంశంపై వివరణ ఇవ్వాలని రజత్ కుమార్ ఆదేశించారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మహాకూటమి నేతలు నిన్న రజత్ కుమార్‌ను కలిసి తమ ఫోన్లు ట్యాప్ చేస్తూ అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఫిర్యాదు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఈసీ దృష్టికి తెచ్చారు. ఐజీ ప్రభాకర్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందని.. తమ భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కల్గుతుందని కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తానని రజత్ కుమార్ మహాకూటమి నేతలకు హామీ ఇచ్చారు. దానికనుగునంగానే ఇవాళ రజత్ కుమార్ రాష్ట్ర డీజీపికి లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఎందుకు జరుగుతోంది? ఇది నిజమేనా? కాదా? ఇంటెలిజెన్స్ అధికారులు దీని ద్వారా వివరణ ఇవ్వాలని డీజీపీకి ఆయన లేఖ రాశారు. రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

అలాగే ప్రభుత్వ ప్రకటనలు ముఖ్యమంత్రి ఫోటోల ద్వారా ప్రచారం జరుగుతోంది. ఎంఎంటీఎస్, మెట్రో రైల్వే స్టేషన్లలోని ప్రతి కటౌట్‌పై ముఖ్యమంత్రి ఫొటోలు కొనసాగుతున్నాయని...ఇవ్వన్నీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అనుమతించరాదని.. ఇది కూడా ఎన్నికల కోడ్ కిందకు వస్తుందని నేతలు చెప్పారు.

మీడియా సంస్థలు కూడా కొంతమంది అధికార పార్టీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి వాటిలో జరిగే ప్రచారాన్ని కూడా వారి ఖాతాలో జమ చేయాలని.. పెయిడ్ ఆర్టికల్ గా పరిగణించాలని పలు ఫిర్యాదులు చేశారు. 

వీటన్నింటిపైనా ఈసీ రజత్ కుమార్ అధికారులతో సమావేశమై వాటి సాధ్యాసాధ్యాలు...ఏవి ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తాయి..? ఏవి రావు అనే అంశాలను పరిశీలించి..ఆయా డిపార్టుమెంట్లు రైల్వే, పోలీసులు డిపార్టుమెంట్లకు లేఖలు రాశారు. వారు ఇవ్వాలని కోరారు. రెండు రోజుల్లో వివరణ వస్తే, అది సంతృప్తికరంగా ఉంటే చర్యలు తీసుకుంటామని..లేదంటే వదిలి వేయడానికి అవకాశం ఉందని రజత్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. 

 

11:13 - October 26, 2018

కరీంనగర్ : కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు అందించే పరిహారంపై ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ప్రక‌టించిన పరిహారం అందించేందుకు ఇన్నాళ్లు కోడ్ అడ్డువ‌చ్చింది. మాన‌వ‌త్వం కోణంలో ప‌రిగ‌ణించిన సీఈసీ ఎట్టకేలకు పరిహారం అందించేందుకు అనుమ‌తినిచ్చింది. ఆర్టీసి చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదంగా నిలిచిన జగిత్యాల జిల్లా కొండగట్టు సంఘటన జరిగి 45  రోజులు దాటింది. అయితే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు గానీ.. క్షతగాత్రులకు గానీ ఇంత వరకు పరిహారం అందించలేదు ప్రభుత్వం. మృతులకు 5 లక్షలు, క్షతగాత్రులకు రెండున్నర లక్షలు ప్రభుత్వం తరుపున సాయం అందిస్తామని సంఘటన స్ధలాలనికి వెళ్ళిన మంత్రులు, అధికారులు ప్రకటించారు. కానీ ఇంత వరకు ఒక్కరికి కూడా పైసా రాలేకపోవడంతో ఇది రాజకీయ విమర్శలకు దారి తీసింది.
ఇదిలా ఉంటే కొండగట్టు ప్రమాదం సెప్టెంబర్ 11న జరిగింది. అప్పటికి తెలంగాణలో ప్రభుత్వం రద్దై ఐదు రోజులు అయ్యింది. అంటే సెప్టెంబర్ 6న కేసిఆర్ అసెంబ్లీ రద్దు చేసి అపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అంటే అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో  నష్ట పరిహారం చెల్లింపుపై అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే తెలంగాణ ప‌ర్యట‌న‌లో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘంతో రాష్ట్ర అధికారులు చర్చించి ఎట్టకేలకు పరిహారం చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 

09:48 - October 26, 2018

హైదరాబాద్: కేంద్ర ఎన్నికలసంఘం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతేదీ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులు తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 105మంది అభ్యర్ధులను కూడా ప్రకటించింది. బీజేపీ మొదటి విడతగా 38మంది పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఆపధ్దర్మ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులతో సమావేశాలు నిర్వహించి వారికి ఎన్నికల్లో విజయం సాధించటంపై దిశానిర్దేశం కూడా చేశారు. ఈనేపధ్యంలో రాష్ట్రంలోని 19 వార్తా చానళ్ల కార్యక్రమ ప్రసారాలపై ఎన్నికలసంఘం నిఘా పెట్టింది. ఇందుకోసం ఇప్పటికే తాత్కాలిక సిబ్బందిని నియమించుకుని వారిలో ఒక్కోరికి 2వార్తాచానళ్ల భాధ్యత అప్పచెప్పింది. వీరు 19 తెలుగు వార్తా చానళ్లు 24 గంటలు ప్రసారం చేసే రాజకీయపార్టీల వార్తలను పరిశీలిస్తారు. వీరు రాజకీయపార్టీల ప్రచారంతో పాటు ఎన్నికల్లో జరిగే ప్రతి చిన్నవిషయాన్ని రికార్డుచేసి ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తారు. వీటితోపాటు సోషల్ మీడియాలో వచ్చేవార్తా కధనాలను రికార్డుచేసి, తప్పుడు ప్రచారాలు చేసే వారిపైనా, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారి పైనా,ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపైనా నిఘాపెట్టి వారిపై కేసులుపెట్టి కఠినచర్యలు తీసుకోనుంది. రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించాయనే  ఫిర్యాదులు వస్తే వాటిని ఈసీ రికార్డు చేసిన వాటితో సరిపోల్చుకుని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటుంది. ఈప్రక్రియ వలన ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణి నిరోధించవ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది.

15:31 - October 1, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు ఈసీ త్వరపడుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే టీ. సర్కార్ రూ.275 కోట్లు కేటాయించింది. సెప్టెంబర్ ఆరున అసెబ్లీని రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నిక కోసం ఉబలాపడతోంది. ఈ క్రమంలో ఈసీ కూడా ముందస్తు ఎన్నికలను త్వరగా అంటే అసెంబ్లీ రద్దు అయిన ఆరు నెలల లోపుగానే ఎన్నికలు నిర్వహించాలని త్వరపడుతోంది. దీనికి సంబంధించి ఈసీ అడుగులు త్వరపడుతున్నాయి. ఈవీఎంలకు అయ్యే ఖర్చును కేంద్ర ఎన్నికల సంఘం భరిస్తుందని కేంద్రం ఎన్నికల కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఉమేశ్ సిన్హా తెలిపారు. భారీ లావాదేవీలపై సమాచారం ఇవ్వాలని ఐటీ అదికారులను ఉమేశ్ సిన్హా కోరారు.
రూ.275 కోట్లు విడుదల చేయమని కోరాం : రజత్ కుమార్
తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.275 కోట్లు విడుదల చేసిందని, త్వరలో మరింత బడ్జెట్‌ను విడుదలచేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ వెల్లడించారు. ఈ ఎన్నికల సందర్భంగా బ్యాంకుల్లో జరిగే పెద్ద లావాదేవీలపై ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ ఉంటుందని, ఆదాయపుపన్నుశాఖ అధికారులతో కలిసి అధిక విలువైన బ్యాంకు లావాదేవీలను గుర్తించే పనిని ప్రత్యేకంగా చేపడుతున్నామని ఆదివారం ఆయన పీటీఐ వార్తాసంస్థతో అన్నారు. రాష్ట్రంలో ఎనిమిది నెలల ముందుగానే శాసనసభను రద్దుచేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ఇటీవల రాష్ర్టానికి వచ్చిన సందర్భంగా రాష్ట్ర ఆదాయపుపన్నుశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌ను కలిసి బ్యాంకుల లావాదేవీలపై దృష్టిసారించాలని సూచించారని, ఈ నేపథ్యంలో భారీ ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తామని తెలిపారు. గత ఎన్నికల సందర్భంగా చేసిన ప్రచార ఖర్చుల వివరాలను అందజేయాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 122 మంది ప్రతినిధులకు నోటీసులు జారీచేశామని రజత్‌కుమార్ చెప్పారు. రాష్ర్టానికి పూర్తిస్థాయిలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లు అందాయని, వీటిలో 70 శాతం ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఇప్పటికే తనిఖీచేశామని తెలిపారు. 

 

20:50 - September 27, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అక్రమాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపారు. రేవంత్ రెడ్డి ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు.. కొండల్ రెడ్డి భార్య వాణిని అదుపులోకి తీసుకున్నారు. ఓటుకు నోటు కేసులో రూ.50లక్షలు ఎక్కడివన్న దానిపై అధికారులు దర్యాఫ్తు జరుపుతున్నారు. ఇందులో భాగంగా వాణిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఆమెను ప్రశ్నించేందుకు కారులో బయటకు తీసుకెళ్లారు. పక్కా ఆధారాలను సేకరించాకే దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఫెరా చట్టాన్ని ఉల్లంఘించడం, విదేశాల్లో ఆస్తుల క్రయవిక్రయాలు చేయడంతో.. ఈడీ అధికారులను కూడా రంగంలోకి దించారు. ఐటీ శాఖ ఇప్పటికే కీలక ఆధారాలకు సేకరించింది. 

ఇక రేవంత్‌ రెడ్డి తన వియ్యంకుడు జి.వెంకట్‌రెడ్డితో కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఉన్నాయి. జి.వెంకట్‌రెడ్డితో కలిసి రేవంత్‌రెడ్డి 20 ఏళ్లుగా పలు వ్యాపారాలు చేస్తున్నారు. వెంకట్‌రెడ్డితో కలిసి నెక్సస్‌ ఫీడ్స్‌ లిమిటెడ్‌ను రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి వీరిద్దరూ కలిసి ఓ భారీ స్కెచ్ వేశారు. యంత్రాల కొనుగోలు పేరుతో భారీగా గోల్‌మాల్ చేశారు. తైవాన్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి వెంకట్‌రెడ్డి చెందిన గోల్డెన్‌ ఫీడ్స్‌ కంపెనీ కొన్న 14 కోట్ల మెషినరీని అక్రమంగా ... వీరిద్దరికీ చెందిన నెక్సెస్‌ ఫీడ్స్‌కు ఏకంగా 80 కోట్ల రూపాయలకు అమ్మారు. పైగా దీని కోసం ఎస్‌బీఐ సోమాజిగూడ, యూనియన్‌ బ్యాంక్ భీమవరం నుంచి ఏకంగా 75 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. మెషినరీ ధరను పెంచడం కోసం.. తమ బినామీ కంపెనీ పయనీర్‌ ఎక్విప్‌మెంట్‌ అండ్ అన్‌ఫ్రా స్టక్చర్‌ కు గోల్డెన్‌ ఫీడ్స్‌ నుంచి 25 కోట్లకు ఆ మెషినరీని అమ్మేశారు. అదే మెషినరీని ఆ తర్వాత నెక్సెస్‌ ఫీడ్స్‌కు 80 కోట్లకు అమ్మేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని తమ సొంత అకౌంట్లకు మళ్లించుకుని.. బ్యాంకులను బురిడీ కొట్టించారు. 

 

22:40 - September 12, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల సన్నద్థతపై క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల బృందం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. డిప్యూటీ చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్‌ ఉమేష్ కుమార్  సిన్హా నేతృత్వంలో వచ్చిన కమిటీ.. ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించింది. పార్టీల వారిగా అభ్యంతరాలను, ఫిర్యాదులు, సలహాలు సూచనలు ఈసీ బృందం తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల పరిస్థితి, ఓట్ల గల్లంతు, వినాయక చవితి, మోహర్రం పండుగల సందర్భంగా ఓటరు నమోదు కార్యక్రమ వ్యవధిని పెంచాలని పార్టీలు సూచించాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని ఉమేష్‌ కుమార్ సిన్హా అన్నారు. 

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అధికారుల సన్నద్ధతపైనా 31 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో దాదాపు 6 గంటల పాటు ఈసీ బృందం సమావేశమయ్యింది. జిల్లాల వారిగా క్షేత్ర స్థాయి పరిస్థితులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితా, సమస్యాత్మక ప్రాంతాలు, శాంతిభద్రతలపైనా చర్చించారు. ఈవీఎంలు, వీవీప్యాట్స్‌పై సిబ్బంది శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈవీఎంల భద్రత, స్టోరేజీ, రవాణాకు అవసరమైన ఏర్పాట్లపైనా ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లను ఎవరూ ప్రలోభపెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇక  ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ కోసం  రూపొందించిన కొత్త ఈఆర్ఒ నెట్ పై జిల్లా కలెక్టర్లకు  అవ‌గాహ‌న  కల్పించారు.

అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి తో పాటు ఇతర ముఖ్య కార్యదర్శులతో సచివాలయంలో 20 నిముషాల పాటు ఉమేశ్‌ బృందం సమావేశం అయ్యింది. రాష్ట్రంలోని శాంతి భద్రతలు, సమస్యత్మాక ప్రాంతాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది , ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే నిధుల కేటాయింపు, రవాణ తదిరత అంశాల పై చర్చించారు. భౌగోళికంగా తెలంగాణకు చూట్టు ఉన్న సరిహాద్దు రాష్ట్రాల ప్రభావం ఎలా ఉంటుందో కూడా అడిగితెలుసుకున్నారు.

13:13 - August 27, 2018

ఢిల్లీ : రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం ప్రారంభం అయింది. పార్టీల ఎన్నికల ఖర్చుపై పరిమితి, ఓటర్ల నమోదు యంత్రాంగం ఏర్పాటు, పార్టీ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు అంశాలపై అభిప్రాయాన్ని ఈసీ సేకరిస్తుంది. టీడీపీ తరపున కనమేడల రవీంద్ర కుమార్, రావులు చంద్రశేఖర్ రెడ్డి, టీఆర్ ఎస్ నుంచి ఎంపి వినోద్, సీపీఐ తరపున నారాయణ, బీజేపీ నుంచి జేపీ నడ్డా, భూపేంద్రయాదవ్ లు హాజరయ్యారు. 

 

08:29 - August 27, 2018

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇవాళ అన్ని రాజకీయ పార్టీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి 7 జాతీయ పార్టీలు, 51 ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానం అందింది. ఈ భేటీలో ప్రధానంగా రాజకీయ పార్టీల కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యయపరిమితి నిర్ణయించడం, ఓటర్ల జాబితాల సవరణకు శాశ్వత యంత్రాంగం ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనుంది.  అయితే వచ్చే ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్‌ వినియోగానికి విపక్షాలు పట్టుబట్టనున్నాయి. రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితత్వం, పారదర్శకత, ఓటర్ల నమోదులాంటి అంశాలైనా చర్చ జరుగనుంది.ఈ మీటింగ్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి టీఆర్‌ఎస్‌, టీడీపీ నుంచి నేతలు హాజరవుతున్నారు. ఎన్నికల సంస్కరణలకు తమ పార్టీ సానుకూలంగా ఉందని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - ec