Early Elections

15:24 - October 31, 2018

మహబూబ్ నగర్ : కరవు, వలసలు అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా గుర్తుకు వస్తుంది. రాజకీయ ప్రముఖులు కలిగిన జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర మాజీ మంత్రి డీకే.అరుణ, ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి, తెలంగాణ పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ తదితరులంతా ప్రస్తుత ఎన్నికల్లో తమ తమ పార్టీలను గెలిపించేందుకు ముమ్మరం ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో ఎన్‌టీఆర్‌ను ఓడించిన చరిత్ర కల్వకుర్తి నియోజకవర్గానికి ఉంది. అన్ని పార్టీల దృష్టి ఉమ్మడి పాలమూరు జిల్లాపైనే ఉంది. జిల్లాలోని 14 నియోజకవర్గాలకూ టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. పలు చోట్ల టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. 

Image result for mahaboobnagar district mapపూర్వ మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా నాలుగు జిల్లాలుగా ఏర్పడింది. మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాలు, వనపర్తి జిల్లాలుగా ఏర్పాడ్డాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు, నాగర్‌కర్నూలు జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు, వనపర్తి జిల్లాలో 1 అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న షాద్‌నగర్ నియోజకవర్గం విభజనలో భాగంగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉంది. కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల పరిధిలోకి వస్తుంది.

నాలుగు జిల్లాల్లో ఓటర్ల వివరాలు
జిల్లా పురుషులు స్త్రీలు ట్రాన్స్‌జెండర్స్ మొత్తం
మహబూబ్‌నగర్ 5,02,528 5,01,900  53 10,04,481
నాగర్‌కర్నూల్ 3,08,915  3,01,478  50 6,10,443 
జోగులాంబగద్వాల 2,17,127 2,18,549  54 4,35,730 
వనపర్తి 1,11,749 1,09,643  26 2,21,418

మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 10 లక్షల 4 వేల 481 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 5 లక్షల 2వేల 528 మంది పురుషులు, 5 లక్షల 1 వెయ్యి 900 మంది  స్త్రీలు, ఇతరులు 53 మంది ఉన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 6 లక్షల 10 వేల 443 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3 లక్షల 8 వేల 915 మంది పురుషులు, 3 లక్షల 1 వెయ్యి 478 మంది స్త్రీలు, 50 మంది ఇతరులు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 4 లక్షల 35 వేల 730 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2 లక్షల 17 వేల 127 మంది పరుషులు, 2లక్షల 18 వేల 549 మంది స్త్రీలు, 54 మంది ఇతరులు ఉన్నారు. వనపర్తి జిల్లాలో 2లక్షల 21 వేల 418 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1లక్షా 11 వేల 749 మంది పురుషులు, 1లక్షా 9 వేల 643 మంది స్త్రీలు, 26 మంది ఇతరులు ఉన్నారు. 

2014 ఎన్నికల్లో పార్టీల బలాబలాలు
టీఆర్ఎస్ 7
కాంగ్రెస్ 5
టీడీపీ 2

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5, టీడీపీ 2 అసెంబ్లీ స్థానాలు గెలిచాయి. గత ఎన్నికల్లో కొండగల్ నియోజవర్గం నుంచి టీడీపీ తరపున గెలిచిన రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్‌కు తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల పరిధిలో ఉండటం, కాంగ్రెస్‌ తరపున రేవంత్‌రెడ్డి బరిలో ఉన్న కొడంగల్‌‌ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
ముందస్తు ఎన్నికల ప్రచారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో రసవత్తరంగా సాగుతోంది. టీఆర్ఎస్‌, మహాకూటమిలోని కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు, బీజేపీ, బీఎల్ఎఫ్‌లోని సీపీఎంతోపాటు మిగిలిన పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి.

ఇప్పటివరకు టీఆర్ఎస్ రెండు సార్లు ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాలకు గానూ 107 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీటిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు అసెంబ్లీ రద్దు చేసిన రోజునే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీఎల్ఎఫ్ 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మహాకూటమి అభ్యర్థులను ప్రకటించ లేదు. నవంబర్ 1న తొలి జాబితా ప్రకటిస్తామని మహాకూటమి నేతలు తెలిపారు. 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా

sno నియోజకవర్గం
1 మహబూబ్ నగర్
2 నాగర్ కర్నూల్
3 గద్వాల
4 వనపర్తి
5 కల్వకుర్తి
6 షాద్ నగర్
7 మక్తల్
8 నారాయణపేట
9 దేవరకద్ర
10 కొల్లాపూర్
11 కొడంగల్
12 అలంపూర్
13 జడ్చర్ల
14 అచ్చంపేట

-చింత భీమ్‌రాజ్

 

 

 

09:55 - October 6, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని పరిస్థితిపై రజత్‌కుమార్‌తో సమీక్షించింది. ఓటరు జాబితా, ఈవీఎంల సిద్ధంపై ఆరా తీసింది. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు ఈనెల 10న మరోసారి కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి రానుంది. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. ఎన్నికల  నిర్వహణకు సంబంధించిన కీలక ప్రక్రియ ముగియనున్న వేళ.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఢిల్లీలో సమావేశమైంది.  తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులతో సమావేశమైన కేంద్ర ఎన్నికల సంఘం వివిధ అంశాలపై చర్చించింది.  ఓటరు జాబితా తయారీ, ఈవీఎంలు సిద్ధంలాంటి కీలక అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఉన్న పరిస్థితులను రజత్‌ కుమార్‌ సీఈసీకి వివరించారు.  అనంతరం ఈసీకి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై నివేదిక సమర్పించారు. మరోవైఐపు ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తుది విచారణ పూర్తయ్యే వరకు ఓటర్ల జాబితా విడుదల చేయవద్దని ఆదేశించిన నేపథ్యంలో దీనిపై కూడా ఈసీ దృష్టి సారించింది.

కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఈ నెల 10న హైదరాబాద్‌కు రానుంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు సన్నద్దతపై సమీక్షించనుంది. రెండు రోజులపాటు సమీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే ఎన్నికల  నిర్వహణ తేదీలపై తుది నిర్ణయాన్ని వెలువరించనుంది.  రాష్ట్రంలో  ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించేందుకు సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ఉమేష్‌సిన్హా   ఆధ్వర్యంలో అధికారుల బృందం గత నెలలో రాష్ట్రానికి వచ్చి వివిధ అంశాలపై సమీక్షించింది. మరోమారు సమీక్షించేందుకు ఈనెల 10న రానుంది.

18:57 - October 4, 2018

నల్లగొండ : జిల్లాలో ప్రజాశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతు..పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లాతో నాకు ఉద్వేగభరిత అనుబంధం వుందన్నారు. ముందస్తు ఎన్నికల్లో నల్లగొండ జిల్లా ప్రజలు సరైన తీర్పు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. నల్లగొండ శివారులోని మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం.. ఎలక్షన్లు వచ్చాయి. ఎందుకు వచ్చాయి.. ఎలక్షన్లు రావాల్సినటువంటి కారణాలు ఏవో మీకందరికి తెలుసు. నల్లగొండ జిల్లా పోరాటాల పురిటిగుడ్డ.. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం. మొన్నటి తెలంగాణ ఉద్యమం.. పిడికిలి బిగించిన నల్లగొండ ప్రజానీకం, ఈ జిల్లాకు నాకు ఉద్వేగపూరితమైన సంబంధం ఉంది. ఫ్లోరైడ్ మీద 8 రోజులు ఉద్యమించాను. అనేక సందర్భాలు, వందలాది సభలలో మీ అందరి ఆశీర్వచనం, ప్రజల సహకారం 2001లో గులాబీ జెండా ఎగిరింది. ఎవరికీ నమ్మకం లేదు. కారు చీకటి. అవమానాలు చేసేవాళ్లు..విమర్శలు చేసేవారనీ..తెలంగాణ ఉద్యమ బాట ఎట్టి పరిస్థితుల్లో వీడను, మడమ తిప్పను.. మడమ తిప్పితే రాళ్లతో కొట్టి చంపండి చెప్పిన. మీరందరూ నా మీద విశ్వాసం ఉంచి.. మీ స్ఫూర్తితో 14 ఏండ్లు నిరంతరంగా పోరాడి.. విమర్శలు, అవమానాలుఅధిగమిస్తూ పటిష్టమైన పోరాటంతో తెలంగాణ వచ్చింది. నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు స్థానమే లేదని చెప్పిన జిల్లాలో 12 స్థానాలకు 6 స్థానాల్లో గెలిపించారని కేసీఆర్ నల్లగొండ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

18:03 - September 28, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సీఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 2వ వారంలో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణ కమిటీపై సీఈసీ సంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో ఉదయ సిన్హా కమిటీ రెండు రోజులు పర్యటించింది. సీఈసికి ఉదయ సిన్హా కమిటీ నివేదిక అందజేసింది.

 

11:20 - September 24, 2018

హైదరాబాద్ :  తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రోజురోజుకు సెగ రాజుకుంటోంది. దీంతో నేతలు తమ తమ అభ్యర్థులకు గెలిపించదుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. వ్యూహ ప్రతి వ్యూహాలలో బిజీ బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు భాగస్వాములుగా ఉన్నాయి. తాజాగా ఈ కూటమిలోకి మరో పార్టీ వచ్చి చేరింది. 'తెలంగాణ ఇంటి పార్టీ' మహాకూటమితో చేతులు కలిపింది. ఈ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. మహాకూటమికి మద్దతు పలుకుతున్నట్టు తెలిపారు. కూటమిలో చేరుతున్నందున తమ పార్టీకి కేటాయించాల్సిన స్థానాలపై చర్చించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ, ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళతామని సుధాకర్ కు హామీ ఇచ్చారు. 

10:22 - September 21, 2018

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం...మరోసారి తెలంగాణలో పర్యటించనుంది. గత పర్యటనలో అధికారులతో ఎన్నికలపై చర్చించిన ఈసీ...ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సమస్యాత్మక ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో పర్యటించి క్షేతస్థాయిలో ఎన్నికల నిర్వహణపై పరిస్థితులను తెలుసుకోనున్నారు. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులపై అధ్యాయనం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు....మరోసారి రాష్ట్రానికి రానున్నారు. గత పర్యటనలో ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన ఈసీ సభ్యులు...ఈ పర్యటనలో గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తిరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత తొలిసారి జరిగే ఎన్నికలకు...ఏమైనా ఆటంకాలు ఉన్నాయా అన్న అంశాలను సభ్యులు గ్రౌండ్ లెవల్ లో తెలుసుకోనున్నారు.  ఇప్పటికే తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సిద్దమైన సీఈసి..మధ్యప్రదేశ్, రాజస్ధాన్ రాష్ట్రాల్లోనూ ఇదే సమచారం కోసం తమ పర్యటన పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

మరోవైపు ఈ నెల 25తో తెలంగాణలో ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం పూర్తవుతుంది. ఓటరు నమోదుపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో  పెట్టుకుని... జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక కార్యక్రమాలతో క్యాంపెయిన్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్... వివిధ జిల్లాల కార్యాలయాలను నేరుగా సందర్శిస్తున్నారు. ఇప్పటికే వీవీ ప్యాట్స్, ఈవీఎంలు రాష్ట్రానికి చేరుకున్నాయి.  వాటిని ఎలా వినియోగించాలనే దానిపై కూడా ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నారు. వచ్చే వారంలో రాష్ట్రానికి రానున్న సీఈసీ బృందానికి...ఈవీఎంలు, వీవీ ప్యాట్లకు సంబంధించిన నివేదికను అందజేయనున్నారు రజత్ కుమార్. గ్రామీణ స్థాయిలో పర్యటన ముగించిన తర్వాత...పరిస్థితులను బట్టి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశాలున్నాయి. 

22:13 - September 19, 2018

హైదరాబాద్ : రాష్ట్ర సాధన కోసం  తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి..టీఆర్ఎస్ లో విలీనం చేసిన అనంతరం తెరమరుగు అయిపోయిన రాములమ్మ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుస్తు ఎన్నికల్లో రాములమ్మ చక్రం తిప్పనుంది. టీఆర్ఎస్ లో ఎంపీగా పనిచేసిన ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మళ్లీ కీలకపాత్ర పోషించబోతున్నారు. ఆమెను టీకాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ అధిష్ఠానం నియమించింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి 2014 ఎన్నికల్లో మెదక్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 
ఇటీవల హైదరాబాద్ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన సందర్భంలో... ఆమె మళ్లీ కనిపించారు. రాజకీయాలల్లో ఇకపై క్రియాశీలకంగా ఉంటానని ఆ సందర్భంగా ఆమె తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెకు కీలక పదవిని కట్టబెట్టింది. పార్టీ గెలుపులో ఆమె కీలక పాత్ర పోషిస్తారని పార్టీ భావిస్తోంది. మరోవైపు, టీడీపీతో పొత్తును ఇంతకు ముందే ఆమె వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

 

15:45 - September 19, 2018

ఢిల్లీ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్రంలో గడువు కంటే ముందే ఎన్నికలు నిర్వహించడం వల్ల పౌరులకు నష్టమని పేర్కొంటూ సిద్ధిపేటకు చెందిన పోతుగంటి శశాంక్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

తెలంగాణలో సాధారణ ఎన్నికల సమయానికి దాదాపు 20లక్షల మందికి పైగా యువత ఓటుహక్కు పొందేందుకు అవకాశముంటుందని... ముందస్తు ఎన్నికల వల్ల వారంతా ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసే విధంగా ఉందన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న ప్రభుత్వమే అధికారంలో ఉందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. స్వయంగా ముఖ్యమంత్రే.. ఎన్నికల సంఘంతో మాట్లాడిన తర్వాతే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పడం అర్థరహితమన్నారు. ఫలానా సమయంలో ఎన్నికలు జరుగుతాయని, మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి, రాజకీయ సంక్షోభం లేకపోయినా... కేవలం రాజకీయ పరమైన లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైందని పిటిషనర్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలను దృష్టిలోకి తీసుకుని తెలంగాణలో గవర్నర్‌ పాలన విధించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని.. అప్పటివరకు గవర్నర్‌ పాలన అమల్లో ఉండటం వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందని పిటిషనర్‌ అభిప్రాయపడ్డారు.

12:15 - September 18, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు సబంధించి హైకోర్టులో పిల్ దాఖలు అయింది. ఇంకా ఎన్నికల జాబితా పూర్తి కాని నేపథ్యంలో ఎన్నికలు నిలిపివేయాలని కొమ్మిరెడ్డి విజయ్ ఆధార్ పిటిషన్ దాఖలు చేశారు. ఓట్ల సవరణ గడువు తగ్గించడాన్నిసవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఇవాళ పిటిషన్ విచారణకు రానుంది. కాగా ఈనెల 6న తెలంగాణ అసెంబ్లీ రద్దైన నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు తెరలేచింది. అన్నీ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. 

 

 

17:10 - September 12, 2018

హైదరాబాద్: ఎంపీలు కేశవరావు, కవిత, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు చేరిన ముఖ్యనేతలకు గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు పార్టీలోకి ఆహ్వానించారు.

కరీంనగర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ ఇంఛార్జ్ బండారి లక్ష్మారెడ్డి, నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు తెరాసాలో చేరారు. పలువును నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - Early Elections