CPM

19:48 - November 14, 2018

హైదరాబాద్: టీఆర్ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కలిసి ఏర్పడిన మహాకూటమిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు. మహాకూటమిని బేస్‌లెస్ ఆలోచనగా కొట్టిపారేశారు. మహాకూటమిలో సీపీఎం చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై తమ్మినేని వీరభద్రం మాట్లాడుతు..కేసీఆర్ స్వలాభం కోసమే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని..ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న తరుణంలో మళ్లీ కాంగ్రెస్‌కు వంత పలకటం మూర్ఖత్వం అని వ్యాఖ్యానించారు. దేశంలో కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలను తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ అని.. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌తో కలవటానికి తాము సిద్ధంగా లేమన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయం, చట్టసభల్లో బలహీనులకు అవకాశం కల్పించటమే తమ లక్ష్యమన్నారు. బీఎల్ఎఫ్‌తోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. జనసేన, ఆమ్‌ ఆద్మీ పార్టీ సహా.. కలిసి వచ్చే వారితో బీఎల్ఎఫ్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తమది మొదటిది లేదా మూడో ఫ్రంట్ అనికూడా  అనుకోవచ్చునని తమ్మినేని తెలిపారు.

22:33 - November 11, 2018

ఢిల్లీ : బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను ఏకతాటిపైకి తెచ్చేయత్నం చేస్తున్నామని తెలిపారు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్లు చీలడంతో బీజేపీకి లాభం చేకూరిందన్నారు. అందుకే ఓట్లు చీలి పోవద్దని తాము తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. లోక్‌సభలో బీజేపీకి మెజారిటీ ఉన్నప్పటికీ ఆ పార్టీకి పడ్డ ఓట్లు 32 శాతమే...69 శాతం ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా వేశారని తెలిపారు. 

 

15:59 - November 5, 2018

నల్లగొండ: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొనసాగుతోంది. పొత్తుపొడుపులు సరిగ్గా కుదిరితే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మహాకూటమి బలీయంగా మారనుంది. అయితే పార్టీల అసంతృప్తులు బరిలోకి దిగితే.. సీన్‌ మారిపోనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం..

సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌తో కలిసి కూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్‌.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. టీజేఎస్‌ను పక్కన పెడితే. కాంగ్రెస్‌తో పాటు.. టీడీపీ, సీపీఐలకు సంస్థాగతంగా బలముంది. ఆ రెండు పార్టీలు ఒంటరిగా విజయం సాధించే పరిస్థితుల్లో లేకున్నా.. పలు నియోజకవర్గాల్లో ఫలితాన్ని నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే కాంగ్రెస్‌కు కూటమి పార్టీల వలన అదనపు బలం కలిసి వస్తుందని హస్తం నేతలు అంటున్నారు. 

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయగా.. కాంగ్రెస్, సిపిఐ ఒక కూటమిగా.. టీడీపీ, బీజేపీ మరో కూటమిగా.. సీపీఎం ఒంటరిగా పోటీ చేశాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 స్థానాల్లో ఆరు టీఆర్ఎస్‌ గెలుచుకోగా, సీపీఐకి ఒకటి కాంగ్రెస్‌ ఐదు స్థానాల్లో విజయం సాధించింది.

* ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12 స్థానాలు
* గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌‌ 6, కాంగ్రెస్‌‌ 5, సీపీఐ ఒక స్థానంలో విజయం
* నల్లగొండలో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐలకు సంస్థాగతంగా బలం
* మహాకూటమితో బలపడతామంటున్న కాంగ్రెస్‌

గత ఎన్నికల్లో దేవరకొండలో కాంగ్రెస్‌, సీపీఐ కూటమి తరుపున పోటీ చేసిన రవీంద్రకుమార్ 57 వేల 717 ఓట్లతో గెలవగా.. రెండవ స్థానంలో టీడీపీ అభ్యర్థి కేతావత్ బిల్యానాయక్ 53 వేల 501 ఓట్లు సాధించారు. టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన లాలూనాయక్ 38,618 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ కలిసి బరిలోకి దిగుతుండడంతో వారిద్దరికి వచ్చిన ఓట్లు 1,11,218 గా ఉన్నాయి. తమ ఓటు బ్యాంక్ చెక్కుచెదరలేదని కూటమి పార్టీలు విశ్వాసం వ్యక్తంచేస్తున్నాయి. గతంలో సిపిఐ అభ్యర్థిగా విజయం సాధించిన రవీంద్రకుమార్ ఈ సారి టీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగుతున్న నేపథ్యంలో.. క్రాస్ ఓటింగ్ జరిగినా.. అంత భారీస్థాయిలో ఉండదని కూటమి నేతల అభిప్రాయం. 

సీపీఐ రవీంద్రకుమార్‌ 57,717 ఓట్లు
టీడీపీ కేతావత్ బిల్యానాయక్ 53,501 ఓట్లు
టీఆర్ఎస్ లాలూనాయక్ 38,618 ఓట్లు

ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరుపున కుందూరు జానారెడ్డి 69,684 ఓట్లతో విజయం సాధించగా.. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహ్మయ్య 53,208 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. అయితే ఇక్కడ మూడవ స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి కడారి అంజయ్య యాదవ్‌కు 27,858 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ప్రస్తుత కూటమి ప్రకారం చూస్తే టీఆర్ఎస్ కంటే 44,334 ఓట్లు మహాకూటమికి అధికంగా ఉన్నాయి. 

కాంగ్రెస్ భాస్కర్‌రావు 62,059 ఓట్లు
టీఆర్ఎస్ అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి 56,006 ఓట్లు

మిర్యాలగూడలో గత ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భాస్కర్‌రావుకు 62,059 ఓట్లు రాగా.. రెండవ స్థానంలో నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి అలుగుబెల్లి అమరేందర్ రెడ్డికి 56,006 ఓట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్, టీడీపీ ఓట్లను కలిపి చూస్తే 26,812 ఓట్లు కూటమికి అధికంగా ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచిన భాస్కర్‌రావు ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. నాటి టీఆర్ఎస్ అభ్యర్థి అమరేందర్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరడంతో ఓటర్లు ఎలా రీసివ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Image result for uttam kumar reddyటీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా ప్రస్తుత కూటమిని పరిగణనలోకి తీసుకుంటే కూటమికి 49,319 ఓట్లు ఆధిక్యత ఉంది. అయితే గత ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ జరిగిన హుజూర్‌నగర్‌లో ఈ సారి ద్విముఖ పోటీ చోటు చేసుకోనుంది. గతంలో వైసీపీకి పోల్ అయిన ఓట్లు ఈ సారి కాంగ్రెస్‌కు వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

ఇక మొదటి నుంచీ టీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపని కోదాడలో మహాకూటమి ఓటింగ్ గణనీయంగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ పద్మావతి 81,966 ఓట్లతో విజయం సాధించగా.. గట్టి పోటీనిచ్చి రెండవ స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ 68,592 ఓట్లు సాధించారు. టీఆర్ఎస్‌ 13,404 ఓట్లు సాధించింది. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ ఒకే కూటమిగా ఉండటంతో గత ఎన్నికల ప్రకారం వారి ఓటింగ్ 1,37,154కు చేరుకుంది. ఇక్కడ క్రాస్ ఓటింగ్‌కు అవకాశం ఉన్నా.. అంత భారీస్థాయిలో ఉండకపోవచ్చన్నది విశ్లేషకులు అభిప్రాయం.

Image result for jagadeesh reddyమంత్రి జగదీష్ రెడ్డి నియోజకవర్గమైన సూర్యాపేటలో ఈసారి హోరాహోరీ తప్పదనిపిస్తోంది. గత ఎన్నికల్లో జరిగిన చతుర్ముఖ పోటీలో జగదీష్‌రెడ్డి 43,554 ఓట్లతో గెలుపొందగా.. రెండవ స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుకు 41,335 ఓట్లు.. మూడవ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ నేత దామోదర్‌రెడ్డికి 39,175 ఓట్లు, నాలుగవ స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి పటేల్ రమేష్‌రెడ్డికి 38,529 ఓట్లు పోలయ్యాయి. అయితే ఇప్పుడు దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి ఒకే పార్టీలో ఉండటంతో పాటు.. కూటమిగా బరిలో దిగుతుండడం.. సంకినేని బీజేపీ తరుపున పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ సారి త్రిముఖ పోటీకి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఓటు షేరింగ్ అనేది కీలకంగా మారింది. 

భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగిన పైళ్ల శేఖర్‌రెడ్డి 54,686 ఓట్లతో విజయం సాధించగా..39,270 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి జిట్టా బాలకృష్ణారెడ్డి రెండవ స్థానంలో.. కాంగ్రెస్ అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర్లు 33,560 ఓట్లతో మూడవ స్థానం.. 24,569 ఓట్లతో టిడిపి అభ్యర్థి ఉమామాధవరెడ్డి నాలుగవ స్థానంలో నిలిచారు. అయితే ఉమామాధవరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం ఆ పార్టీకి బలంగా మారింది. 

ఇక తుంగుతుర్తిలో గత ఎన్నికల్లో పోలైన ఓట్ల ప్రకారం.. ప్రస్తుత మహాకూటమికి 29,293 ఓట్ల ఆధిక్యం ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి గాదరి కిశోర్ 64,382 ఓట్లతో గెలుపొందగా.. రెండవ స్థానంలో అద్దంకి దయాకర్‌కు 62,003 ఓట్లు, మూడవ స్థానం సాధించిన పాల్వాయి రజనికుమారికి 31,672 ఓట్లు వచ్చాయి. 

Related imageఇక నల్లగొండలో గత ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గట్టి పోటీనిచ్చి కేవలం 10,547 ఓట్లతో ఓటమిపాలైన స్వతంత్ర అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి ఈ సారి టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతుండటంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. గతంలో కంచర్లకు మద్ధతుగా నిలిచిన టీడీపీ ఓటింగ్ ఈసారి ఎటు నిలిస్తే వారిదే విజయంగా రాజకీయవర్గాల్లో చర్చ జరగుతోంది.

ఆలేరులో గతంలో ద్విముఖ పోటీ జరుగగా.. ఇప్పుడు త్రిముఖ పోటీ నెలకొంది. అయితే ఇక్కడ కూటమి అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. మోత్కుపల్లి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతుండటంతో.. ఓట్ల షేరింగ్‌ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

మొత్తానికి ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌ను కూటమి ఎలా నిలువరిస్తుందో చూడాలి. కూటమి పార్టీల మధ్య క్రాస్ ఓటింగ్ జరగకుండా కట్టడి చేయగలుగుతారా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. తాజా కూటమి 2009 మహాకూటమిలా చివరంచులో బోల్తా పడుతుందో.. లేక మహాబలిగా నిలబడుతుందో తెలియాలంటే.. డిసెంబర్ రెండవ వారం వరకు ఆగాల్సిందే.

 
22:13 - October 10, 2018

హైదరాబాద్: తెలంగాణలో  త్వరలో  ఒక ప్రజాస్వామిక, ప్రజల ప్రభుత్వం ఏర్పడబోతోందని  టీపీసీీసీ అధ్యక్షుడు  ఉత్తమ్ కుమార్ రెడ్డి  అన్నారు.  ఆపద్దర్మ ముఖ్యమంత్రి  కేసీఆర్‌కు  ఆయన ఒక లేఖ రాశారు. అనంతరం  విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం రాజకీయ పార్టీలకు సహజమని, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకోవడాన్ని విమర్శిస్తున్న టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. 2009లో తెలంగాణకు టీడీపీ అనుకూలంగా లేఖ ఇచ్చినందుకే  టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్నామని ఆనాడు కేసీఆర్ చెప్పారని,   చంద్రబాబు లో ఏం మార్పు వచ్చిందని  చండీయాగానికి పిలిచి సన్మానించారని ఉత్తమ్  ప్రశ్నించారు. టీడీపీ నాయకురాలు, ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి వెళ్లి మీరు  టీడీపీ నాయకులతో రహస్య మంతనాలు జరపలేదా ,ఈ రోజు మేము  ఎన్నికల పొత్తులు పెట్టుకుంటే మీకు అభ్యంతరం వచ్చిందా అని  ఉత్తమ్ కుమార్ రెడ్డి  ప్రశ్నించారు. గతంలో తెలంగాణకు బద్ద వ్యతిరేకయిన సీపీఎంతో  కూడా టీఆర్ఎస్ ఎన్నికల  పొత్తులు పెట్టుకుందని   ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

21:45 - July 25, 2018

విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించి నిరసన తెలిపారు విద్యార్థులు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయడం లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉధృతమవుతోన్న ఏపీకి ప్రత్యేకహోదా పోరు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకహోదా పోరు ఉధృతమవుతోంది. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు మానవహారాలు నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. హామీలు అమలు చేయడం లేదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదాత విషయమై కేంద్రం దిగొచ్చేవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని వామపక్షాలు, విద్యార్థి జేఏసీ హెచ్చరించాయి. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు విభజన అంశాల హామీల అమలు చేయాలంటూ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద మానవ హారం చేపట్టారు. ప్రత్యేక హోదా సాధన కోసం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురంలోని క్లాక్‌ టవర్‌ వద్ద కోటి మంది విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. ఈ మేరకు సప్తగిరి సర్కిల్ వరకు వందలాది మంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు చేపట్టిన మానవహారం కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మద్దతు ప్రకటించారు.

విద్యార్థులు డిమాండ్..
ప్రత్యేక హోదా సాధన కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటంలో సిఎం చంద్రబాబునాయుడు కలిసి రావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికిచ్చిన విభజన హామీలను నెరవేర్చకపోతే బిజెపి, టిడిపిలకు తగిన బుద్ధ చెబుతామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ మేరకు విజయనగరంలో విద్యార్థి సంఘాలు, రాజకీయ, ప్రజా సంఘాల ప్రతినిధులు ధర్నా చేపట్టారు. పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం ఇచ్చిన విభజనహామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. SFI, PDSU, ఏఐఎస్ఎఫ్ తదితర విద్యార్ధి సంఘాలు మానవహారం నిర్వహించారు.

ఒంగోలులో మానవహారం
విభజన హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్లతో విద్యార్ధి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులో మానవహారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధి, యువజన జేఏసీ ఇచ్చిన కోటిమందితో మానవహారం కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో మానవహారం నిర్వహించారు. విద్యార్ధులు కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించి అనంతరం చర్చి సెంటర్ లో మానవహారం నిర్వహించారు.

గుంటూరులో వేలాది మంది విద్యార్థులు మానవహారం
ప్రత్యేకహోదా డిమాండ్‌తో గుంటూరులో వేలాది మంది విద్యార్థులు మానవహారం నిర్వహించారు. బృందావన్‌ గార్డెన్‌ నుండి హిందూ కాలేజీ వరకు వేలాది మంది విద్యార్థులు, జేఏసీ నాయకులు ఈ మానవహారంలో పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక, హోదా విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాలు విశాఖలో మానవహారం నిర్వహించారు. ఆంధ్ర ఎంపీలు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైల్వే జోన్‌ విషయంలో స్థానిక ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని విద్యార్థులు మండిపడ్డారు.

ఎంపీ హరిబాబుపై నిరసన
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వేజోన్‌ తీసుకురావడంలో విశాఖ ఎంపీ హరిబాబు విఫలమయ్యారని జన జాగృతి సమతి సభ్యులు మండిపడ్డారు. ఈ మేరకు జన జాగృతి సమితి సభ్యులు చెవిలో పువ్వులు పెట్టుకొని విశాఖ జీవీఎంసీ వద్ద నిరసన తెలిపారు. తక్షణమే హరిబాబు ఎంపీ పదవికి రాజీనామా చేసి రైల్వే జోన్‌ కోసం పోరాటం చేయాలని డిమాండ్‌ చేశారు. 

12:10 - July 25, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా కోరుతూ మొదటి నుండి ఆందోళన చేపడుతున్న వామపక్షాలు మరోసారి నిరసనలు చేపట్టాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం వద్ద మానవహారం నిర్వహించింది. ఇందులో సీపీఐ, సీపీఎం, వైసీపీ, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు టెన్ టివితో మాట్లాడారు. కేంద్రం దిగగొచ్చే వరకు హోదా కోసం పోరాడుతామన్నారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కూడా మాట్లాడారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:38 - June 27, 2018

నెల్లూరు : బర్మశాల గుంట రైల్వే పట్టాల సమీపంలోని ఇళ్లను ప్రభుత్వం తొలగించాలని చూస్తోందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ఆయన ఆ ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడ నివాసం ఉంటున్న వారితో మధు, ఇతర నేతలు మాట్లాడారు. ఇక్కడ 800 ఇళ్లలో నివాసం ఉంటున్నారని, ప్రత్యామ్నాయం చూపెట్టకుండా ఇళ్లు తొలగించాలని చూడడం అన్యాయమన్నారు. ప్రభుత్వం బాధితులకు ఇళ్లను కేటాయించాలని కోరారు. 

18:53 - June 11, 2018

కర్నూలు : జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులపై రైతుసంఘం చేపట్టిన ఆందోళనకు సీపీఎం పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్‌ తెలిపారు. జిల్లాలో తాగు, సాగునీరు అందించేవరకు రైతులు దశలవారిగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు రైతాంగం పోరాటాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలను నెరవేర్చేంత వరకు రైతుల పోరాటం ఆగదని గఫూర్ పేర్కొన్నారు.

09:40 - May 30, 2018

నెల్లూరు : కమ్యూనిస్టు ఉద్యమ నేత జక్కా వెంకయ్య కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వెంకయ్య మృతితో నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన భౌతికకాయాన్ని కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలు సందర్శించి నివాళులు అర్పించారు. నేడు ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.
1930 నవంబర్‌ 3న జన్మించిన జక్కా వెంకయ్య
కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, సీపీఎం సీనియర్‌ నాయకులు జక్కా వెంకయ్య కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన నెల్లూరు జిల్లా సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన కేంద్రబిందువుగా నిలిచారు. 1930 నవంబర్‌ 3న బుచ్చిరెడ్డి పాలెం మండలం, దామరమడుగు గ్రామంలో జక్కా వెంకయ్య జన్మించారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన జక్కా వెంకయ్య.... పీడిత ప్రజల అభ్యున్నతికై ఎంతగానో పాటు పడ్డారు. 
1951లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన జక్కా
చిన్నప్పటి నుండే కమ్యూనిస్టు భావజాలాలు కలిగిన జక్కా వెంకయ్య....1951లో భూమి కోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో డా.జెట్టి శేషారెడ్డి ప్రోత్సాహంతో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1956 కమ్యూనిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికై అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర, కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు. 1957లో దామరమడుగు గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.  అలాగే 1994లో అల్లూరు నియోజకవర్గం నుండి వెంకయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. గతితార్కిక చారిత్రక భౌతిక వాదం, రాజకీయ అర్థశాస్త్రం వంటి పుస్తకాలను ఆయన రాశారు.
నెల్లూరు జిల్లాలో విషాదఛాయలు 
ఉద్యమ నేత వెంకయ్య మృతితో నెల్లూరు జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంకయ్య మృతి వార్త తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన భౌతిక కాయానికి వివాళులు అర్పించారు. 
హైదరాబాద్ ఎస్వీకేలో సంతాప సభ 
జక్కా రామయ్య మృతికి నివాళిగా.. హైదరాబాద్ ఎస్వీకేలో ఆయన సంతాప సభను ఏర్పాటు చేశారు. వెంకయ్య చిత్రపటానికి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పార్టీ నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జక్కా వెంకయ్య మృతి పార్టీకి తీరని లోటన్నారు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన చివరి వరకు పని చేశారని గుర్తు చేసుకున్నారు. బుధవారం ఉదయం జక్కా వెంకయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. 

09:09 - May 30, 2018

నెల్లూరు : కమ్యూనిస్టు ఉద్యమనేత, సీపీఎం సీనియర్ నాయకులు నిన్న కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జక్కా చికిత్స పొందుతూ మృతి చెందారు. జిల్లాలో ఇవాళ జక్కా వెంకయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా జక్కాతో ఉన్న అనుబంధాన్ని వామపక్షాలు నేతలు గుర్తు చేసుకున్నారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ 1967 జనవరిలో జక్కా వెంకయ్యతో తనకు పరిచయం ఏర్పడిందన్నారు. అంతకముందు నెల్లూరు పట్టణంలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంలో, స్టీలో ప్లాంట్ ఆందోళనలో జక్కాను తాను చూశానని తెలిపారు. పెద్ద భూస్వామ్య కుటుంబంలో పుట్టిన జక్కా.. నిరాడంబర జీవితం గడిపారని తెలిపారు. ఆస్తులు అమ్మి ప్రజా ఉద్యమాలకు వెచ్చించిన మహానుభావుడు జక్కా వెంకయ్య అని కొనియాడారు. స్వంత మానుకుని ప్రజలకు తన జీవితాన్ని ధార పోశారని తెలిపారు. ఆయన కొన్ని మంచి సంప్రదాయాలను జిల్లాలో ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం వారికి రుణపడి ఉందన్నారు. ఇప్పుడున్న నాయకత్వం ఆయన ఆశయాలు, సంప్రాయాదాలను అమలు చేసి ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కృష్టి చేస్తారని నమ్ముతున్నానని తెలిపారు. జక్కా వెంకయ్య విప్లవ సంప్రదాయాల అడుగుజాడల్లో నడుస్తామని శపథం చేస్తున్నట్లు ప్రకటించారు. అంతిమయాత్రలో పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులందరూ పాల్గొంటారని తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బృందాకరత్ లు జక్కా వెంకయ్యకు సంతాపం తెలుపుతూ సందేశాలు పంపారని తెలిపారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - CPM